Take a fresh look at your lifestyle.

జీవ నదులు భూగ్రహ జీవ నాడులు నేడు ‘ప్రపంచ నదుల దినం’…

నదుల ప్రాధాన్యతను వివరిస్తూ, నదుల పరిరక్షణకు పూనుకుంటూ, మానవ నాగరికత వికాస కేంద్రాలుగా, మానవ ఆవాసాల తీరాలుగా నదుల ప్రయోజనాలను సామాన్య ప్రజానీకానికి ఏకరులు పెట్టడానికి ప్రతి ఏట సెప్టెంబర్‌ ‌చివరి ఆదివారం రోజున, అనగా 26 సెప్టెంబర్‌ 2021‌న, విశ్వ దేశాలు ‘ప్రపంచ నదుల దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. మిలియన్ల పౌరులు, కనీసం 100కు పైగా దేశాలు నదుల పరిరక్షణ యజ్ఞంలో పాల్గొని తమ గళాలను వినిపిస్తున్నాయి. నదీ పరిరక్షకుడు మార్క్ ఆం‌జెలో నివేదనతో ఐరాస 2005లో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రపంచ నదుల దినం ఆవిర్భవించింది. ప్రపంచంలోకి 1000కి పైగా నదులను సందర్శించిన మార్క్ ఆం‌జెలో ‘రివర్‌ ‌వరల్డ్’‌ను ఆవిష్కరించాడు.

ప్రపంచ, దేశ, రాష్ట్ర నదులు:
ప్రపంచ నదుల్లో 76 మాత్రమే 1000 మైళ్ళకు పైగా ప్రవహిస్తున్నాయి. అత్యంత పొడవైన నదులుగా నైల్‌, అమెజాన్‌, ‌యెనీసే, మిసిసిపీ, యాంగ్‌జే, ఛాంగ్‌ ‌జియాంగ్‌, అం‌గార, కాంగో లాంటివి గుర్తించబడినవి. ప్రపంచ పొడవైన 165 నదుల జాబితాలో భారత దేశానికి చెందిన బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, యమున,సుత్లెజ్‌, ‌కృష్ణ, నర్మద, సింధూ లాంటివి చోటు దక్కించుకున్నాయి. ఒక్క అమెరికాలోనే 3.5 మిలియన్ల పొడవుతో 2.5 లక్షల నదులు ప్రవహిస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా హిమాలయ, ద్వీపకల్ప నదులు/ఉపనదులు అనేకం ప్రవహిస్తున్నాయి. ముఖ్యమైన నదుల్లో గంగా, యమున, కోసి, బ్పహ్మపుత్ర, నర్మద, ఇండస్‌, ‌గోదావరి, కృష్ణ, సరస్వతి, కావేరి, తపతి, సుత్లెజ్‌, ‌ఛంబల్‌, ‌బీస్‌, ‌తుంగభద్ర, సబర్మతీ లాంటివి పేర్కొనబడినవి. మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణ, భీమ, మంజీర, మూసి, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, పెన్‌ ‌గంగా, వైరా, తాలిపేరు మ్నెదలైన నదులు, ఉపనదులు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

నదులు, ఉపనదుల ప్రయోజనాలు :
భూగ్రహానికి సిరులుగా, ప్రాణికోటి జీవ నాడులుగా నదులు పర్యావరణంతో విడదీయరాని పటిష్ట బంధాలను పెనవేసుకున్నాయి. జలమే జీవనం, నీరే ప్రాణాధారం. నదులే అపార జాతి సంపదలు. నదులతోనే మానవ మనుగడలు. సమస్త జీవరాసుల ఉనికి నీటి లభ్యత మీదనే ఆధారపడి ఉంటుంది. నదీ తీరప్రాంతాలే మానవ ఆవాసాలు, పల్లెలు, పట్నాలు, మహానగరాలు. దేశాభివృద్ధి నదీ జలాలతోనే ముడిపడి ఉంటుంది. ధరణి జీవుల దాహాన్ని తీర్చగలిగే పుణ్యతీర్థాలు సజీవ నదులు మాత్రమే. నదీ జలాలు మాత్రమే మానవ వినియోగ సురక్షిత నీటి వనరులు. త్రాగడం, వ్యవసాయం, పరిశ్రమలు, శక్తి ఉత్పత్తి కేంద్రాలు, ఉపరితల రవాణ, పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రయోజనాలను నదులు కలిగి ఉన్నాయి. మానవ నాగరికత వికాస కేంద్రాలు నదీ జలాలు మాత్రమే. పంటల దిగుబడికి, ప్రాణి దాహం తీర్చడానికి, ఆహార ఉత్పత్తికి, శక్తి జననానికి, ఉపరితల రవాణాకు, జల క్రీడలకు నదీ జలాలు ఉపయోగ పడుతున్నాయి. భూజల వనరుల్లో 3-4 శాతం మాత్రమే ‘ఫ్రెష్‌ ‌వాటర్‌’‌గా (97 శాతం ఉప్పు నీరు) మానవ వినియోగానికి పనికి వస్తున్నాయి.

నదులు, ఉపనదుల విధ్వంసం :
నదుల విధ్వంసంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా, ప్రమాదకరంగా మారుతున్నది. పర్యావరణంలో ప్రధాన అంతర్భాగం నదుల ప్రవాహించడమే. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, జనాభా విస్పొటనం, నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో నదుల విధ్వంస వినాశన, విచ్ఛన్నతలు ప్రారంభమైనాయి. పట్టణీకరణ, స్వార్థ మానవ అనాలోచిత కార్యాలతో నదులు అనేక సవాళ్ళ నడుమ వాతావరణ దుష్ప్రభావాలకు కారణం అవుతున్నాయి. నదీ తీరాలను అనాలోచితంగా దుర్వినియోగ క్రియలకు వినియోగిస్తే, మానవ జాతి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

నదులు, ఉపనదుల పరిరక్షణ చర్యలు :
నదుల పరిరక్షణతోనే జీవకోటి రక్షణకు పునాదులు పడతాయి. నదీ పరివాహక ప్రాంతాల శుభ్రత, తీరప్రాంతాల్లో హరిత క్షేత్రాల రక్షణ, నదీ తీరాల వెంట ప్రకృతి పర్యటనలు, నదీజలాల క్రీడలు, నదీ తీర పర్యాటకం, మత్స్య సంపద, భూసారాన్ని పెంచడం, నదీ తీరాల్లో సాంస్కతిక వేడుకలు, పాఠశాల విద్యార్థులకు నదీ సారాంశ ప్రాజెక్టుల నిర్వహణలు, నదులతో కవాతుల కదం తొక్కడాలు, నదుల ప్రధాన్యతలను వివరించే పోటీల నిర్వహణలు లాంటి కార్యక్రమాలను ప్రపంచ నదుల దినం వేడుకలు ఉపయోగపడతాయి.
నదులు నవ్య నాగరికతకు సాక్ష్యాలని, మానవ మనుగడకు ప్రాణాధారమని, భూమిపై వెలసిన జీవ నాడులని, సమగ్రాభివృద్ధి ఉత్ప్రేరకాలని నమ్ముదాం. ప్రపంచ నదుల దినం రోజున నది ఒడ్డున సేదదీరుతూ, నదీజలాలకు కృతజ్ఞతలు తెలియచేద్దాం, వాటి పరిరక్షణకు కంకనబద్దులమవుదాం.

dr-burra-madhusudhan-reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

 

Leave a Reply