Take a fresh look at your lifestyle.

చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యం

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 25 ‌న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాంతక వ్యాధి మలేరియా అనే  పట్ల ప్రజలలో అవగాహన పెంచడం,  చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ఉద్దేశం.5వేల సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నదని తేలింది. క్రీస్తు పూర్వం 2700 మొదలుకుని చైనాలో చాలాసార్లు మలేరియా లాంటి జ్వరాలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. మలేరియా అనే పేరు ‘‘మల అరియ’’ అనే ఇటాలియను పదాల నుండి పుట్టింది. ‘‘మల అరియ’’ అంటే చెడిపోయిన గాలి అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని చిత్తడి జ్వరం అని కూడా పిలిచేవారు.1880లో ఫ్రెంచి సైన్యంలో వైద్యుడైన చార్లెస్‌ ‌లూయీ ఆల్ఫోన్సె లావెరెన్‌ అల్జీరియాలో పనిచేస్తున్నప్పుడు ఎర్రరక్త కణాలలో ఈ పరాన్న జీవులను కనుగొన్నాడు. ఈ పరాన్న జీవులే మలేరియా కారకాలని మొట్ట  మొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పాడు. దీని వలన, తరువాత కనుక్కున్న ఇంకొన్ని విశేషాల వలన  ఆయనకు 1907లో నోబెల్‌ ‌బహుమతి లభించింది.

మలేరియా పరాన్నజీవి జీవిత చక్రాన్ని సర్‌ ‌రోనాల్డ్ ‌రాస్‌ అనే శాస్త్రవేత్త సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు 1897 ఆగస్టు 20న కనుగొన్నారు. తద్వారా ఆయనకు 1902లో నోబెల్‌ ‌బహుమతి లభించింది. రోనాల్డ్‌రాస్‌.. ‌మలేరియా పరాన్న జీవికి ప్లాస్మోడియం అని పేరు పెట్టారు. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. మనుషుల్లో ఆడ అనోఫీలస్‌ ‌దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పరాన్నజీవిని కలిగివున్న దోమ మనుషులను కరిచినపుడు అవి మనుషులతో చేరి వారి కాలేయంలో విభజన చెంది తదనంతరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తాయి. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్మోడియం’’  అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు.  వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషులలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి. అందులో …ప్లాస్మోడియం ఫాల్సిపారం,  ప్లాస్మోడియం వైవాక్స్, ‌ప్లాస్మోడియం మలేరియై, ప్లాస్మోడియం ఒవేల్‌, ‌ప్లాస్మోడియం సెమీ ఒవేల్‌,  ‌ప్లాస్మోడియం నోవెస్లి ముఖ్యమైనవి.

దోమ మనుషులను కరిచినపుడు అవి మనుషులతో చేరి వారి కాలేయంలో విభజన చెంది తదనంతరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తాయి. ఎర్ర రక్తకణాలలో చేరిన 48 నుండి 72 గంటలలో ఈ పరాన్నజీవులు విభజన చెంది  చిట్లిపోతాయి.దీనివలన ఫ్లూ, వణుకుతో కూడిన జ్వరం, అసాధారణ రక్తస్రావం, దీర్ఘ శ్వాస, రక్తలేమి చిహ్నాలు మరియు స్పృహ కోల్పోవడం జరుగుతుంది.చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడం, వాంతులు, విరేచనాలు, నీరసంగా ఉండటం, ఆయాసం మొదలైనవి మలేరియా లక్షణాలు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స అందించ వచ్చు. దోమకాటుకు గురైన ఏడు నుంచి 18 రోజుల మధ్య  ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్‌ ‌ల్యాబోరేటరీ టెస్టులు లేదా ఆర్డీటీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారు.

1946నుండి మలేరియా అదుపు చేయడానికి డి.డి.టి వినియోగం మొదలయ్యింది. 1953లో 7 కోట్ల పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు. 8 లక్షల వరకు మరణాలు అందువలన సంభవించాయి. అప్పుడు 1958లో జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్లు రక్తపరీక్ష చేసి మలేరియా అని నిర్ధారిస్తారు. వ్యాధిగ్రస్తుని నుండి సేకరించిన రక్తం బొట్టును ఒక సన్నటి గాజు పలకపై ఉంచి, దానిపై గీంసా  ద్రావకం వేస్తారు. దీనివలన డాక్టర్లు సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు) కింద మలేరియా జీవులను చూడ గలుగుతారు.మలేరియా బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే.. వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించడం మేలు. దోమలు ఉండకుండా చూసుకోవాలి. ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్స్ ‌క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది. ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి రోస్‌మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమై, రోగాల బారిన పడకుండా ఉంటాం. వీధుల్లో అమ్మే అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం మానేయాలి.
అధిక ప్రొటీన్లు ఉన్న పాలు పెరుగు, మజ్జిగ మలేరియా వ్యాధి ఉన్నవారు కణజాలాన్ని అధికంగా కోల్పోవడం వలన మలేరియా ఉన్నవారు తమ ఆహార ప్రణాళికలో ప్రొటీన్లను చేర్చుకోవాలి. అధిక ప్రోటీన్‌ ‌మరియు అధిక చెక్కెరలు ఉన్న ఆహార పదార్థాలు కణజాల నిర్మాణానికి దోహద పడతాయి. అధిక ప్రొటీన్లు ఉన్న పాలు, పెరుగు, మజ్జిగ, చేపలు, లస్సీ, చికెన్‌ ‌సూప్‌, ‌గుడ్లు మొదలైనవి తీసుకోవాలి. ఎలాక్ట్రోలైట్స్ ‌మరియు నీటిని కోల్పోవడం మలేరియా వ్యాధి ఉన్నవారిలో సర్వ సామాన్యం. కనుక పండ్ల రసాలు, సూపులు, గంజి, కొబ్బరి నీరు, పప్పు నీరు మొదలైనవి తీసుకోవడం శ్రేయస్కరం. బీట్‌ ‌రూట్‌, ‌క్యారెట్‌, ‌బొప్పాయి, నిమ్మ జాతి పండ్ల విటమిన్‌ ఎ, ‌విటమిన్‌ ‌సి సమృద్ధిగా కలిగిన బీట్‌ ‌రూట్‌, ‌క్యారెట్‌, ‌బొప్పాయి, నిమ్మ జాతి పండ్లయిన నారింజ, బత్తాయి, ద్రాక్ష, అనాసపనస, నిమ్మ మొదలైన ఆహార పదార్థాలతో పాటు బి- కాంప్లెక్స్ ‌విటమిన్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
      9440595494

Leave a Reply