Take a fresh look at your lifestyle.

నేడు గుజరాత్‌ ‌ప్రజల తీర్పు

దేశ మంతా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికలు రానే వొచ్చాయి. రెండు విడుతలుగా ఇక్కడ జరిగే ఎన్నికలు గురువారం ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలకు ప్రాధాన్యం చేకూరింది. దాదాపుగా రెండున్నర శతాబ్ధాలకు పైగా గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంటూ వొస్తున్నది. అంటే ఇప్పటికి అయిదు విడుతలుగా ఆ పార్టీయే ఇక్కడ నెగ్గుకు వొస్తున్నది. ఇప్పుడు ఆరో విడుతకూడా తామే అధికారంలోకి వొస్తామన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నది. ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడనేవారెవరూ బిజెపికి లేకపోవడం గమనార్హం. అందుకే ఇక్కడ జరుగుతున్న ఎన్నికల బాధ్యతనంతా మోదీ, అమిత్‌షాలే మీద వేసుకున్నారు. వారితోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు ఎన్నికల తేదీ ప్రకటించింది మొదలు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలను చుట్టబెడుతూ వొచ్చారు. వాస్తవంగా గుజరాత్‌ అం‌టేనే మోదీ.. మోదీ అంటేనే గుజరాత్‌ అన్న నానుడి నిలబడిపోయింది. అందుకే ఆయన ప్రచార సభల్లో కూడా తన ముఖం చూసి అభ్యర్థ్యులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వొచ్చారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యంగ్య ఛలోక్తి విసిరడం ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది.

ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ స్థాయి ఎన్నికలు జరిగినా ప్రధాని అక్కడ సిద్దమవుతున్నాడని, ప్రతీచోట తన ముఖం చూసి వోటు వెయ్యాలని అడుగుతున్నాడని, ఆయనేమన్న బహు ముఖాల వ్యక్తా అంటూ ఖర్గే చేసిన కామెంట్‌ ‌బిజెపి శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమయింది. ప్రధాని తన పదవిని వొదిలేసి ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకోవడాన్ని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే సహజంగా ఇప్పటివరకు గుజరాత్‌లో ప్రతీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌, ‌బిజెపి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంటూ వొచ్చింది. కాని, ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగప్రవేశం చేసింది. పంజాబ్‌లో మాదిరిగానే ఈసారి గుజరాత్‌ను హస్తగతం చేసుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్ళూదుతున్నది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అనివార్యమైంది. ఈ మూడు పార్టీలు కూడా తమ తమ మ్యానిఫెస్టోలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రకటించాయి. ముఖ్యంగా దిల్లీ తర్వాత పంజాబ్‌లో ప్రవేశపెట్టిన పథకాలు మంచి ఫలితాలను ఇస్తుండడంతో ప్రజలు తమను గెలిపిస్తారన్న గట్టి నమ్మకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉంది. కాగా ఇరవై ఏడేళ్ళ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్‌ ‌పార్టీ విశ్వసిస్తున్నది. అయితే ఈ వ్యతిరేకతను తమ వోటు బ్యాంకుగా మార్చుకునే సామర్థ్యం గల నాయకులు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు లేరన్న మాట చాలాకాలంగా వినిపిస్తున్నది.

ఆ పార్టీ ముఖ్యనేత అహ్మద్‌పటేల్‌ ‌మరణంతో ఆ స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడు కాంగ్రెస్‌లో లేకపోవడం వల్లే ఇక్కడి ఎన్నికల పర్యవేక్షణకు రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లెట్‌ను తీసుకురావాల్సి వొచ్చింది. ప్రధాని సొంత•రాష్ట్రం కావడంతో మోదీయే స్వయంగా ఇక్కడ ప్రచారం చేస్తున్న క్రమంలో ఆయన ప్రచారానికి ధీటైన ప్రచారం చేయాల్సిన రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రలో బిజి బిజీగా ఉన్నారు. ఒకటిరెండు సార్లు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆప్‌ ‌పార్టీ ప్రచారం ముందు కాంగ్రెస్‌ ‌ప్రచారం వెలవెల పోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ గుజరాత్‌లో చేయాల్సినంతగా అభివృద్ధి చేయలేక పోయిందన్న అపవాద బిజెపిపైన ఉంది. కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌ ‌లాంటి నినాదం తీసుకున్న బిజెపి ఆ పార్టీ నాయకులను ఆకర్షించడం లాంటి చర్యలను జనం ఆమోదించలేకపోతున్నారన్న వాదన ఒకటి ఉంది. కాంగ్రెస్‌నుండి వొచ్చి కాషాయ కండువ కప్పుకున్న దాదాపు పదిహేడు మందికి బిజెపి ఈసారి టికట్‌ ఇవ్వడంపైన కూడా స్వీయ పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దానికితోడు కేంద్రం ఇటీవల కాలంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా ప్రజలు ఆ పార్టీపైన అనాసక్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ మరో మార్గంలో వాటిని అమలు చేయాలనుకోవడం, కొరోనా సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ద్రవ్యోల్భణ, పెట్రోల్‌ ‌డిజిల్‌ ‌ధరలను పెంచడం లాంటి విషయాలు ఆ పార్టీ పట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా 2002 నుండి పార్టీ గెలుచుకున్న స్థానాలను పరిశీలిస్తే ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీ గ్రాఫ్‌ ‌తగ్గుతూనే ఉంది. 2002లో 127 శాసనసభ స్థానాలను గెలుచుకున్న బిజెపి, 2007లో 117 స్థానాలకు, 2012లో 115 స్థానాలకు, 2017 వచ్చేసరికి కేవలం 99 స్థానాలకే పరిమితమయింది. ఈసారి కాంగ్రెస్‌తోపాటు ఆప్‌కూడా రంగంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక వోటును ఆ రెండు పార్టీలు చీల్చుకోవడంద్వారా బిజెపి బయటపడుతుందా లేక ఈసారి మరోపార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Leave a Reply