జ్వాలావలయ రూపంలో కనువిందు
ఉదయం 9.56 నుంచి మధ్యాహ్నం 2.29 గంటల వరకు..
ఈ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ (రింగ్ ఆఫ్ ఫైర్) సూర్యగ్రహణం ఏర్పడనుంది. ’తిప్రాద రాహుగ్రస్త’ సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడనుంది. మృగశిర, ఆరుద్ర నక్షత్రాల కలయికతో.. సింహ, కన్య లగ్నంలో ఉదయం 10:18 గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1:49 గంటలకు ముగుస్తుంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపించనున్నదని, తక్కిన భారతదేశంలో పాక్షికంగానే దర్శనమివ్వనుందని ప్లానెటరీ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉదయం 9.16 గంటల నుంచి సూర్యగ్రహణం మొదలవుతుందని పేర్కొంది. మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఇది బాగా కనిపిస్తుందని తెలిపింది. భారత్‌లో ఉదయం 9.56 గంటలకు మొదలై మధ్యాహ్నం 2.29 గంటలకు ముగుస్తుందని వెల్లడించింది.
పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు మినహా తక్కిన ఆఫ్రికా, ఆగ్నేయ యూరప్, మధ్యప్రాచ్యం, ఉత్తర తూర్పు రష్యా మినహా ఆసియా, ఇండొనేషియా తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుందని వివరించింది. కాంగోలో మొదలై.. భారత్‌లో సూరత్‌గఢ్(రాజస్థాన్), సిర్సా, కురుక్షేత్ర(హర్యానా), డెహ్రాడూన్, చమోలీ, జోషిమఠ్ (ఉత్తరాఖండ్) గుండా సాగనుంది. అనంతరం చైనా, తైవాన్ గుండా సాగి పసిఫిక్ మహాసముద్రం వద్ద ముగియనుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కాకుండా 99శాతం ఉపరితలాన్ని మాత్రమే కప్పేయడంతో రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడనుంది. మన హైదరాబాద్‌లో పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేయనున్నారు. యాదాద్రిలో శనివారం రాత్రి ఆరగింపు సేవ తర్వాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం అంటే ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. సంప్రోక్షణ, ఆరాధన తర్వాత సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. భద్రాద్రి, వేములవాడ, బాసర సరస్వతి, కొమురవెల్లి మల్లన్న ఇలా మిగతా ఆలయాల్లోనూ దాదాపుగా ఇదే తరహా విధానం కొనసాగించనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి సార శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. సూర్యగ్రహణంతో నిత్య పూజల్లో మార్పుల దృష్ట్యా భక్తులకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.