Take a fresh look at your lifestyle.

పెనం మీద నుంచి పొయ్యిలోకి ..

నేడు రైతుల దేశవ్యాప్త బంద్‌  ‌సందర్భంగా ..

అదునుకోసం గోతికాడ నక్కలా
కాచుకున్న కొండచిలువను  చూశారా..
ఒక్కొక్క అడుగూ వేస్తూ
పావులు కదుపుతూ ఇటే వస్తున్న
అనకొండను చూశారా ..

ఇబ్బడిముబ్బడిగా పెరిగే పెట్టుబడితో
కనీస మద్దతు ధరలేని పంటతో
మార్కెట్‌ ‌మోసాలతో దోపిడీతో
కుదేలైన సన్న చిన్నకారు రైతు
తాటికాయపడి నడ్డి విరిగినా
పెట్టే చెయ్యికానీ చాచే చెయ్యి కాదనే
ఆత్మగౌరవంతో బతికాడిన్నాళ్ళూ ..

నలుగురి ఆకలి తీర్చడం కోసం
కబేళాకి పోయే పశువులా మారినా
వధ్యశిలపై వేలాడుతూనే ఉన్నా
దేశానికి వెన్నెముక ఎదురీదుతూనే
భూమిని, కాడిని వదలకుండా
తన చిరునామా శాశ్వతం చేసుకోవాలని
రైతే రాజని గర్వంగా బతికాడిన్నాళ్ళూ .

తగవు చెప్పు ధర్మరాజా అంటే
మొసలి కన్నీరు కారుస్తూ ..
దూడ, బఱ్ఱె నాదే అన్నాడట వెనకటికెవడో
అట్లా తయారయింది నేటి అన్నదాత పరిస్థితి
రైతు స్వేచ్ఛకోసం, విముక్తికోసం
సంక్షేమం కోసమనే అనే కొత్త బిల్లులు
హద్దులు, సరిహద్దులు లేకుండా
విహరించమంటున్నాయి ..
రాకాసి అనకొండలకు స్వేచ్ఛనిస్తున్నాయి

పెనం మీదనుండి పొయ్యిలో పడి
అన్నదాత చేసే హాహా కారాల మధ్య
రైతుసంక్షేమం పేరిట కొత్త బిల్లు
వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ‌మార్కెట్‌
‌వావ్‌ ఎం‌త వినసొంపుగానే ఉంది!
నియంత్రణలులేని విపణి వీధిలో ..
స్వేచ్ఛ, సంక్షేమం అంటే  ..
కూకటివేళ్ళతో పీకేయడమేనా .. ?
మాడుకు మైదాకు పెట్టి
కింద కొర్రాయి పెట్టడంలా లేదూ!?

ఒక్కసారి కళ్ళు మూసుకుని
భవిష్యత్‌ ‌దర్శిస్తే
ఒకరు కాదు ఇద్దరు కాదు
వేలు లక్షలు కోట్లలో సేద్యకారులు
కొండచిలువ పొట్టలోకి పోతూ
అదిగో అటు చూడండి
జాతికి తిండి పెట్టే అలుపెరుగని
శ్రామికులను మింగిన కొండచిలువలు
నింగినంటే ధరలతో
వినియోగదారులైన మనని మింగుతూ
నేలతల్లిని చుట్టేస్తూ ..
 -వి. శాంతి ప్రబోధ

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply