Take a fresh look at your lifestyle.

తెలుగు ప్రజలకు వరం సురవరం

నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి

అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు సాగడం, ఉర్దూ లోనే ప్రభుత్వ, వ్యావహారిక కార్యక్రమాలు కొనసాగడం, చదువుకున్న వారు ఉర్దూ చదవటం ఒక హోదా చిహ్నంగా ప్రజలు భావించే కాలం. అప్పుడు రాజభాషగా, పాలనా భాషగా, వ్యవహారభాషగా ఉర్దూ ఉండగా,  ఉర్దూ భాషలోనే మీజాన్‌, ‌జామీన్‌, ‌రయ్యత్‌ ‌పత్రికలు వచ్చేవి. అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’ నల్లగొండ జిల్లా నుండి, ‘తెలుగు’ వరంగల్‌ ‌జిల్లా నుంచి వెలువడు తుండేవి. అలాంటి నిజాం రాజ్యంలో, ప్రతికూల వాతా వరణంలో తెలుగు పత్రికని స్థాపించడమే ఓ సాహసం. ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషలు రాజ్యమేలుతున్న నిజాం రాజ్యంలో తెలుగు సాహిత్యం నిలదొక్కు కునేందుకు ‘గోలకొండ పత్రిక’ బీజం వేసింది.
హైదరాబాద్‌ ‌సంస్థానంలోని తెలుగు ప్రజల విజ్ఞానానికి తెలుగులో పత్రికను ప్రారంభించాలని నిశ్చయించారు. అంధకార బంధుర మైన నాటి  పరిస్థితులలో గోలకొండ పత్రిక అనే చిరుదివ్వెను వెలిగించి తన బహుముఖ ప్రజ్ఞతో సంస్ధలను, ఉద్యమాలను నిర్మించి, ప్రజల చైతన్యాన్ని తట్టిలేపే బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు సురవరం ప్రతాపరెడ్డి. మాతృ భాషలో చదువుకొనే అవకాశాలు లేక అంతా ఉర్దూమయమై, నిజాం నిరంకుశ పరిపాలనలో, నిద్రాణ స్థితిలో ఉన్న తెలంగాణను జాగృతం చేయాలన్న సురవరం  దీక్ష ఫలితమే…1926 మే 19న గోలకొండ పత్రిక ప్రారంభ నేపథ్యం. ఆ పత్రిక వారానికి రెండు మార్లు వెలువడు తుండేది. పత్రిక నిర్వహణలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జాతీయ భావాలను ధైర్యంగా ప్రచారం చేశారు. 1947 లో అది దినపత్రికగా మారింది. నిజాంను తన పత్రికలలో ఏకిపారేస్తూ దూకుడుగా వ్యవహరించేవారు సురవరం. ఒక దశలో నిజాం రాజు గోలకొండ సంపాదకీయాలకు  భయపడ్డారంటే… ఆయన కలం నిజాం ను  ఎంత కలవర పరిచిందో అర్థం చేసుకోవచ్చు.

పత్రిక ఆదర్శాలను గురించి వివరిస్తూ ప్రతాపరెడ్డి ఒక  సంపాదకీయంలో… ‘‘మేము మా పత్రిక స్థాపన కాలం నుండియు రెండంశములు దృష్టి పథమందుంచు కొని దేశీయులకు సేవ చేయు చున్నాము. మొదటిది ఆంధ్రాభాషా సేవ, రెండవది జాతి, మత, కుల వివక్షత లేక ఆంధ్రులలో సర్వశాఖల వారి యొక్క సత్వరాభి వృద్ధికై పాటుపడుట’’. ఈ ఆశయాన్ని నెరవేర్చేందుకే ప్రతాపరెడ్డి క్షణం విశ్రాంతి లేకుండా ఎనలేని కృషి చేశారు. గోలకొండ పత్రికకి సురవరమే సర్వస్వంగా ఉండేవారు. సంపాదకుడి దగ్గర నుంచి ప్రూఫ్‌ ‌రీడరు వరకూ అన్ని బాధ్యతలూ నెత్తిన వేసుకుని పత్రికను నడిపించే వారు. గోలకొండ  ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృత పరచటంలో అద్భుత పాత్రను నిర్వహించింది. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి పత్రికా సంపాదకుడిగా,రచయితగా సేవలు అందించారు. ఆయన రాసిన వ్యాసాలూ, పద్యాలూ, విమర్శలూ, సంపాదకీయాలూ 1000కి మించి ఉంటాయి. ఇతర పత్రికల్లో 100కు పైగా వ్యాసాలు రాసి ఉంటారు.  కథానికలూ, కవితలూ రాశారు. పత్రికలో కొన్ని శీర్షికలని స్వయంగా నిర్వహించారు. చిత్రగుప్త, భావకవి, రామ్మూర్తి, యుగపతి సింహ, సంగ్రామసింహ మొదలైన ఎన్నో మారుపేర్లతో ఆయన అసంఖ్యాక రచనలు చేశారు. 1896 మే 28 తేదీన జన్మించిన సురవరం కర్నూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. వెల్లాల శంకరశాస్త్రి  వద్ద సంస్కృత కావ్యాలు, వ్యాకరణం చదువు కొన్నారు. నిజాం కాలేజీలో ఎఫ్‌.ఎ. ‌మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో బి.ఏ. చదివిన తర్వాత బి.ఎల్‌. ‌చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారు. కాని  ఎంతో కాలం ఆ వృత్తిలో ఉండలేక పోయారు.

- Advertisement -

గాంధీజీ నాయకత్వంలో సాగుతున్న స్వాతంత్య్ర పోరాటం ఆయనను ఆకర్షించింది. తెలంగాణ ప్రజల దైన్యం, దారిద్య్రం, ప్రాథమిక హక్కులను కూడా నోచుకోని దుస్థితి చూచి చలించి పోయారు. భావుకుడైన రచయితగా, సురవరం కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినవి. 1924లో హైదరాబాద్‌ ‌లోని రెడ్డి హాస్టల్‌ ‌కార్యదర్శిగా నియమితులై, ప్రతాపరెడ్డి హాస్టల్‌ ‌విద్యార్ధులలో క్రమశిక్షణ నెలకొల్పి వారిని చైతన్య వంతులను కావించి, నాటి కొత్వాల్‌ అయిన రాజా బహదుర్‌ ఆశీస్సులతో 1926 మే 10వ తేదీన ‘గోలకొండ’ పత్రికను ప్రారంభించారు. పోలీస్‌ ‌చర్య వరకు ప్రతాపరెడ్డి  ‘గోలకొండ’ పత్రికా సంపాదకులుగా పనిచేసారు. 1930లో మెదక్‌ ‌జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు. కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.

1951 లో ప్రతాపరెడ్డి పులిజాల హనుమంతరావు తో కలిసి ‘ప్రజావాణి’ దినపత్రికను స్థాపించి రెండేళ్ళు నడిపారు. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి పట్ల ప్రగాఢమైన అభిమానం ఉండేది. ప్రజలలో విజ్ఞాన వికాసానికి గొప్ప రచనలు చేశారు. తెలంగాణా ప్రజల భాషనుకాని, సంస్కృతినిగాని తక్కువ చేసి మాట్లాడితే సహించేవారు కాదు. తెలంగాణలో తెలుగు కవులు లేరన్న ముడుంబ వెంకట రాఘవాచార్య వ్యాఖ్యలకు స్పందించి, 354 మంది తెలంగాణ కవుల పరిచయాలతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ను విడుదల చేశారు సురవరం.
ఆయన  నిజాం రాష్ట్ర పాలన, మొగలాయి కథలు, సంఘోద్ధరణ, ఉచ్చల విషాదము, గ్రంథాలయము, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానం మొదలైన రచనలు, దాదాపు 40 గ్రంథాలు రచించారు. సురవరం రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ‘కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు‘ లభించింది. దానిలో దాదాపు వెయ్యేళ్ల ఆంధ్రుల చరిత్రను నమోదు చేశారు. తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించారు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షులు.
1952 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో, మిత్రుల ఒత్తిడిపై వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ ‌పక్షాన పోటీచేసి విజయం సాధించారు. కాని రాజకీయాలు ఆయనకంతగా రుచించలేదు.  త్యాగము, దేశభక్తి, భాషాభిమానం ప్రజా శ్రేయస్సు పరమార్ధంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డి  1953 ఆగష్టు 25న దివంగతులయ్యారు.

అయన సేవలు అందుకొనని సంస్థ తెలంగాణలో లేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన ఆంధ్ర భాషా నిలయం, హిందీ ప్రచారసభ తదితర సంస్థల ప్రగతికి ఎంతో కృషి చేశారు. తెలుగు జాతికి అయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదు లోని ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులుగా, పత్రికా సంపాదకులుగా, న్యాయవాదిగా, రచయితగా,  సంఘ సంస్కర్తగా, ప్రజా ప్రతినిథిగా, చరిత్ర కారునిగా, పరిశోధకుడుగా, పండితుడుగా, క్రియాశీల ఉద్యమ కారుడుగా  బహుముఖాలుగా సాగిన సురవరం ప్రతాపరెడ్డి  ప్రతిభ, కృషి అనన్యమైనవి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ఒక అధ్యాయం. ఆయన తెలుగు ప్రజలకు వరం..
 – రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494

Leave a Reply