సిద్ధిపేట, ఆగస్టు 9 (ప్రజాతంత్ర బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నుంచి హుజూరాబాద్ వరకు మంగళవారం నిరుద్యోగ ఉద్యమ కళాకారుల కన్నీటి పాదయాత్ర ప్రారంభం కానున్నది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు పెంచి అర్హులైన కళాకారులందరికీ సిఎం కేసీఆర్ ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగ ఉద్యమ కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల నర్సింలు, రాష్ట్ర నేత ఇనుప సురేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులపైన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. సిద్ధిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు నర్సింలు, సురేష్ మాట్లాడాతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర వహించిన కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనీ, పేరుకు 500 మంది కళాకారుల ఉద్యోగాలు కల్పించి మిగతా వారిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.
నిరుద్యోగ ఉద్యమ అన్ని రంగాల కళాకారులు కష్టాలను ప్రభుత్వానికి తెలియపర్చడానికి సిద్దిపేట నుండి హుజురాబాద్ వరకు పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ పాదయాత్రతోనైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ఇండ్లులేని నిరుపేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని, ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు వయస్సు పైబడిన కళాకారులందరికీ 10 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కళాకారులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్వాప్త అన్ని రంగాల కళాకారులు సిద్దిపేట నుండి హుజురాబాద్ వరకు జరగబోయే ఉద్యమం కళాకారుల కన్నీటి పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాంలో కుంచెం శ్రీనివాస్, చిన్నగుండవెళ్లి రాజు, చంద్లాపూర్ రాజు, జలిగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.