Take a fresh look at your lifestyle.

పెద్దలను రక్షించుకుందాం

“వృద్ధ్దులు ఇంట్లో ఉంటే• మనకు జ్ఞాన సంపద ఉన్నట్లు. మన సంస్కృతి, సంప్రదాయాలు మన వెంట ఉన్నట్లు. వారి సాంగత్యంలో పిల్లల్లో  నైతిక విలువలు పెరుగుతాయి. వారికి  ఆదరాభిమానాలు పంచినట్లయితే వారి జబ్బులు కూడా త్వరగా నయమవుతాయి. మన పలకరింపు, ఆత్మీయ స్పర్శ వారిలో ఎనలేని ఆనందాన్ని కలిగిస్తాయి. చాలా క్లిష్ట పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్న  గొప్ప అనుభవం వారి సొంతం అని చెప్పవచ్చు. ప్రస్తుత కొరోనా పరిస్థితుల్లో వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం కలదు. వారిని ఇళ్లలోనే ఉండనిచ్చి చిన్నారులతో సమానంగా చూసుకోవాలి.”

సీనియర్‌ ‌సిటిజన్స్ ‌డే ప్రతి సంవత్సరం ఆగష్టు 21న ప్రపంచ వ్యాప్తంగా జరుపు కుంటారు. వృద్ధ్దుల జనాభాలో చైనా తరువాత మన దేశం రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 12 శాతం వరకు ఉన్న వృద్ధ్దులు 2050వ సంవత్సరం నాటికి జనాభాలో 22 శాతం కానున్నారని అంచనా. మనదేశంలో వృద్ధ్దులు 12కోట్లమంది ఉన్నట్లు ‘’ఐక్య రాజ్యసమితి జనాభా నిధి’’ 2019లో ప్రకటించింది.భారత్‌లో ప్రతి పది మందిలో ఒకరు వృద్ధ్దులుగా ఉన్నారు. వీరిలో దాదాపు మూడవ వంతు గ్రామాలలో నివసిస్తున్నారు. అందులో దాదాపు సగం మంది పేదరికంతో దుర్భర జీవితం గడుపుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.అదే విధంగా తెలంగాణా జనాభాలో వృద్దులు 17 శాతం మంది ఉన్నట్లు ఒక అంచనా.ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొరోనా వైరస్‌ ‌ప్రభావం వయో వృద్ధ్దులపై ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కావునా కొరోనా మహమ్మారి నేపథ్యంలో వయోధికులపై ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం కలదు. కొరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వైరస్‌ ‌నుండి పెద్ద వారిని కాపాడుకొనేందుకు ముఖ్యంగా అరవై ఏళ్ళ వయస్సుపై బడిన వారు బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరికి వైరస్‌ ‌సోకితే మిగతా వారి కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. వీరు హైరిస్క్ ‌కేటగిరిలో ఉన్నందున కుటుంబ సభ్యుల వీరి పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇప్పటివరకు కొరోనా కారణంగా మరణించిన వారిలో ఎక్కువ మంది 60 సంవత్సరాలు దాటినవారున్నారు.దీనికి మినహాయింపుగా తమ మాససిక స్థయిర్యంతో కొరోనాను జయించిన పెద్దవారూ ఉన్నారు. పెద్దలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాద్యత మనందరిపై కలదు.వీరికి కొరోనా ఇన్ఫెక్షన్‌ ‌సులభంగా సోకె ప్రమాదం కలదు. కాబట్టి పెద్దల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో ప్రత్యేక మెళకువలు పాటించాలి.ఇన్ఫెక్షన్‌ ‌సోకకుండా అత్యంత జాగరుకతతో వ్యవహరించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యంగా ఉన్న వృద్ధ్దుల పట్ల సరియైన జాగ్రత్తలు తీసుకోకపోతే అత్యధిక మరణాలు సంభవించే అవకాశం కలదు. వృద్ధ్దులు ఇంట్లో ఉంటే మనకు జ్ఞాన సంపద ఉన్నట్లు. మన సంస్కృతి, సంప్రదాయాలు మన వెంట ఉన్నట్లు. వారి సాంగత్యంలో పిల్లల్లో నైతిక విలువలు పెరుగుతాయి. వారికి ఆదరాభిమానాలు పంచినట్లయితే వారి జబ్బులు కూడా త్వరగా నయమవుతాయి. మన పలకరింపు, ఆత్మీయ స్పర్శ వారిలో ఎనలేని ఆనందాన్ని కలిగిస్తాయి. చాలా క్లిష్ట పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్న గొప్ప అనుభవం వారి సొంతం అని చెప్పవచ్చు. ప్రస్తుత కొరోనా పరిస్థితుల్లో వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం కలదు. వారిని ఇళ్లలోనే ఉండనిచ్చి చిన్నారులతో సమానంగా చూసుకోవాలి.

ఇంట్లో అందరు దూర దూరంగా ఉంటుంటే వృద్ధ్దులను ఒంటరితనం వేధించే అవకాశం కలదు.ఒంటరితనం వృద్ధాప్యానికి శాపం.అలాంటి భావన వారికి రానీయకుండా మసలుకోవాలి.ఇది వైరస్‌ అం‌టకుండా చూసుకునే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదని వారికి ఓపికగా విడమర్చి చెప్పాలి.అదృష్టం కొద్దీ ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్ల వంటివి అందుబాటులో ఉన్నాయి.వీలైనప్పుడల్లా మిత్రులతో,బంధువులతో మాట్లాడించాలి. వారికి ఇష్టమైన వారితో వీడియో కాల్స్ ‌కూడా మాట్లాడించవచ్చు. వారికి ఇష్టమైన టీవీ కార్యక్రమాలు, సినిమాలు చూడమని చెప్పవచ్చు.పుస్తక పఠనం అలవాటుంటే పుస్తకాలు మరియు పత్రికలూ చదువుకొమ్మని చెప్పాలి. ఇళ్లలోని బాల్కనీలలో, గదుల్లో నడవడం ద్వారా వారు చురుగ్గా ఉండేలా చేయవచ్చు.వారిలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అవసరమైన ఆహారాన్ని అందించాలి. వారి కోసం అవకాశం ఉంటె ఒక ప్రత్యేక మైన గదిని కేటాయించాలి.సాధ్యమైనంతవరకు వారుండే గదులకు గాలి,వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. వారికి రెగ్యులర్‌ ‌గా జరపవలసిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వస్తే అది ఎంత దూరంలో ఉంది ,అక్కడ కొరోనా కేసులేమైనా చూస్తున్నారా వంటి అంశాలను పరిశీలించాకే తప్పనిసరి అనుకుంటేనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు వైద్య పరీక్షలను వాయిదా వేసుకునే విషయమై వైద్యులను ఫోన్లో లేదా ఆన్‌ ‌లైన్‌ ‌నందు సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వారికి మెరుగైన వైద్య పరీక్షలతో పాటు గౌరవప్రదమైన జీవన పరిస్థితులను కల్పించాలి. వారిని భారంగా కాకుండా భాద్యతగా,ప్రేమగా చూసుకోవాలి.కొరోనా నేపథ్యంలో వారు కొన్నిసార్లు భయాందోళనలకు లోనవుతారు.మానసికంగా కుంగిపోతారు. ఇంటికే పరిమితం కావడం వల్ల,ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండమని సూచించడంతో వారిలో అసహనం,చికాకు లాంటి లక్షణాలు తలెత్తుతాయి.అలాంటి సమయంలో వారి ప్రవర్తనకు మిగతా కుటుంబ సభ్యులు విసుక్కోకుండా ఓపికగా వ్యవహరిస్తూ ,వారిలో ఆత్మ స్థయిర్యం నింపి వారికి భరోసానివ్వాలి.కుటుంబ సభ్యులు తరచుగా బయట సంచరించడం తగ్గించాలి.ఇంట్లోకి అడుగు పెట్టిన ప్రతిసారి చేతులు శానిటైజర్‌ ‌తో శుభ్రం చేసుకోవాలి.వృద్ధులున్న గదుల్లోకి వెళ్లేముందు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించాలి. పనివారిని వారి గదుల్లోకి వెళ్లనీయకూడదు. తప్పనిసరిగా పెద్దలనుండి రెండు మీటర్ల దూరం పాటించాలి.వారు ఒత్తిడికి గురికాకుండా వారిని అత్యంత జాగరు కతతో చూసుకోవాలి.వారి శారీరక,మానసిక ఆరోగ్య సంరక్షణతో పాటు వారి భావోద్వేగాలను కూడా పరిరక్షించవలసి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతినేలా మాట్లాడకూడదు.

తల్లితండ్రులను కనిపించే దేవుళ్లుగా పూజించే తరం క్రమేపి కనుమరుగు అవుతున్నది.ఉరుకులు పరుగులతో సాగే బతుకు పోరాటంలో పెద్దల యోగ క్షేమాలను విచారించాల్సిన కనీస ధర్మాన్ని నేటి తరంలో చాలా మంది విస్మరిస్తున్నారు. పెరుగుతున్న నాగరికత వృద్దులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. సంపాదనకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నవి.మనిషి జీవితాంతం కష్టపడి వృద్దాప్యంలో కుటుంబ సభ్యుల మధ్య గడపాలని అనుకుంటాడు. కానీ నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై వ్యష్టి కుటుంబాలు,అపార్ట్ ‌మెంట్‌ ‌కల్చర్‌ ‌వచ్చాక వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది.చివరి దశలో ఉన్న వృద్ధులను కొంత మంది పోషిస్తుంటే కొంత మంది వృద్ధాశ్రమాలలో వొదిలేస్తున్నారు.కన్న బిడ్డల ఆదరణ, ఆప్యాయతలకు దూరమై తప్పనిసరి పరిస్థితిలో వృద్ధాశ్రమాల్లో తలదాచుకుంటున్న వృద్ధ్దులకు కొరోనా వైరస్‌ ‌మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నది.అనేక వృద్ధాశ్రమాలు దుర్భర పరిస్థితులతో,ఆర్ధిక లేమితో నెట్టుకొస్తున్నాయి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు బలవర్ధక ఆహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ వృద్దాశ్రమాల్లో నిధుల లేమి కారణంతో సాధారణ ఆహారం అందించడమే గగనమవుతున్నది.చాలా వృద్దాశ్రమాల్లోని వృద్దులకు కొరోనా సోకుతున్నది.కొన్నిచోట్ల నిర్వాహకుల నిర్లక్ష్యంతో కూడా వృద్దులు కొరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వమే మానవతా దృక్పధంతో వ్యవహరించి వృద్ధ్దాశ్రమాల్లోని వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకోవలసిన అవసరం కలదు.కొరోనా కాలంలో వృద్ధాశ్రమాల నిర్వహణకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం కలదు.వృద్ధుల శాతం రోజు రోజుకు పెరుగుతున్నందున వారి సమస్యల పరిష్కారానికి సహాయక కేంద్రాలను అధిక సంఖ్యలో వారికి అందుబాటు లో నెలకొల్పవలసిన ఆవశ్యకత కలదు. ప్రభుత్వం ఒంటరిగా నివసిస్తున్న సీనియర్‌ ‌సిటిజన్ల వివరాలు నమోదు చేసుకొని వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ వారికి భరోసాను అందిస్తూ ఉండాలి. అవసరమనుకుంటే ఇరుగు పొరుగు వారి సహాయం తీసుకుంటుండాలి.

వృద్దాప్యం ప్రతి మనిషి జీవితంలో ఆహ్వానించదగిన అనుభవంగా మారాలంటే వారి ఆరోగ్యానికి,జీవన శైలికి భరోసా ఉండాలి. అప్పుడే అది ఆనందకరమైన, హుషారైన వృద్ధ్దాప్య మవుతుందని డబ్ల్యూ హెచ్‌ ఓ ‌భావిస్తున్నది.కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్న వృద్ధ తల్లితండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం 2007 లో తల్లితండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని రూపొందించింది.ఈ చట్టం ప్రకారం తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి పిల్లలకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేసే అవకాశం కలదు. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో 2011 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా వృద్దులు తమ హక్కులను సాధించుకొనుటకు అవకాశం కలదు.ముఖ్యంగా వృద్ధుల కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆసుపత్రులను ఏర్పాటు చేయవలసిన అవసరం కలదు.వారికి రెగ్యులర్‌ ‌గా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాటికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలి.వారు ఎదుర్కుంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపుతూ ఉండాలి. వృద్దులకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రత్యేకమైన నర్సింగ్‌ ‌వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ముఖ్యంగా ఇండ్లలో ఉండలేని వారికి, ఆర్ధికంగా లేని వారికి ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలి.వారిని జాతి సంపదగా భావించి అన్నిచోట్లా వారికి ప్రాధాన్య మిచ్చి వారిని గౌరవించుకోవలసిన బాధ్యత మనందరిపై కలదు.వారి అనుభవాలను, సామర్ధ్యాలను అవసరాలను బట్టి ఉపయోగించుకుంటే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పని చేసే అవకాశం కలదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కావునా సాంకేతికతను వారికి మరింత చేరువ చెయ్యాలి. దానితో వారు ఒంటరితనం నుండి బయటపడ గలుగుతారు. ‘‘మలి సంధ్య వెలుగుల్ని వృద్ధతరం ఆస్వాదించే పరిస్థితులను కల్పింపజేయడం కుటుంబ సభ్యులందరి బాధ్యత’’ వృద్దులైన తల్లితండ్రులను ఎవరైతే చక్కగా చూసుకుంటారో వారే నిజమైన ధనవంతులు, అదృష్ట వంతులని చెప్పవచ్చు. ‘‘పెద్దలను ప్రేమగా చూసుకుందాము – వారిని కాపాడుకుందాము.
పుల్లూరు వేణు గోపాల్‌, 9701047002

Leave a Reply