Take a fresh look at your lifestyle.

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి

జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి, ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించే వారు. కథలంటే చెవి కోసు కొనేవారు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగారు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో, ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహల పడేవారు.

రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక, ఇంటి వద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్ర లేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవారు. ఆది వారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొ నేవారు. బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివే వారు. కాళిదాను, షేక్స్పియర్‌ ‌రచనలు ఇష్టపడి చదివారు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాషపై అభిమానం పెంచుకొన్నారు. ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు వెళ్లిన రవీంద్రుడు ప్రొఫెసర్‌ ‌మార్లే ఉపన్యాసాలు విని, ఆంగ్ల సాహిత్యంపై మరింత అభిరుచి పెంచుకున్నారు. సాహితీవేత్తల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలు, సంగీత కచేరీలకు హాజరై, ఆంగ్ల సంస్కృతీ సంప్ర దాయాలను ఆకళింపు జేసుకున్నారు. అక్కడ తన అనుభవాలను స్నేహితుడు భారతికి లేఖలుగా రాసేవారు. ఇంగ్లండులో ఉండగానే ‘‘భగ్న హృదయం’’ అనే కావ్యాన్ని విశ్వకవి రచించారు. విర్గరేర్‌ ‌స్వప్న బంగ, సంగీత ప్రభాత అనే భక్తి గీతాలను కూడా రాశారు. ఆయన రచనల్లో గీతాంజలి గొప్పది. బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను ‘‘గీతాంజలి’’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. అనంతరం దీన్ని అనేక ప్రపంచ భాషలలోకి తర్జుమా చేశారు. ప్రపంచ సాహిత్యంలో ఇది ఓ గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పదనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. ఈ రచనకే 1913 సాహిత్యంలో ‘‘నోబెల్‌ ‌బహుమతి’’ లభించింది. ‘‘విశ్వకవి’’ అనే బిరుదును సాధించి పెట్టింది. నోబెల్‌ ‌పొందిన తొలి భారతీయుడి గానే కాదు ఆసియాలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించారు. ఆయన రచించిన సంధ్యాగీత కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించారు.

రవీంద్రుడు కేవలం రచయిత గానే కాదు, చిన్నారుల హృదయాలను వికసింపజేసే ప్రాచీన గురుకులాల తరహాలోనే ‘‘శాంతి నికేతన్‌’’‌గా ప్రసిద్ధి గాంచిన ‘‘విశ్వభారతి విశ్వ విద్యాలయాన్ని’’ స్థాపించారు. అయిదుగురు విద్యార్థులతో ఆరంభించిన విశ్వభారతి క్రమంగా విస్తరించింది. ఉపాధ్యాయుల ఇళ్లలో విద్యార్థులు భోజనం చేసే వారు. ప్రాతఃకాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రంచేసి స్నానం చేయడం, ప్రార్థనలు చేయడం, నియమిత వేళలలో నిద్ర పోవడం వారి దినచర్య. ఆరోగ్యం, పరిశుభ్రత, వాక్కు శుద్ది, పెద్దలను, గురువులను గౌరవించడం ఇక్కడ నేర్పేవారు. 1919లో కళాభవన్‌ను స్థాపించి విద్యార్థులకు విభిన్న కళలను నేర్పించేవారు. గ్రామాభ్యుదయమే, దేశాభ్యుదయమని భావించిన రవీంద్రుడు, శ్రీనికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. మొదట ‘‘వాల్మీకి ప్రతిభ’’ అనే నాటకాన్ని రచించిన విశ్వ కవి, ‘‘తరువాత’’ అనే నాటకం రాశారు. రవీంద్రుడి కలం నుంచి జాలువారిన ‘‘చిత్రాంగద నాటకం’’ ఆయనకు మంచి పేరు తెచ్చింది. ‘‘ప్రకృతి… ప్రతీక’’ అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించారు. రవీంద్రుడు ‘‘కచదేవయాని, విసర్జన, శరదో త్సవ్‌, ‌ముక్తధార, నటర్పూజ’’ మొదలగు అనేక నాటకాలు రచించారు. మతాలు వేరైనా, పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలనే సాంఘిక ప్రయోజనం, సందేశ మిళిత మైన ‘గోరా’ నవల రవీంద్రుని కీర్తిని మరింత ఇనుమడింప జేసింది. రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలు ఉన్నవారు. హిందీ మేళాలో దేశభక్తి గీతాలను పాడారు. పృథ్వీరాజ్‌ ‌పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించారు. బ్రిటీష్‌ ‌ప్రభుత్వం తిలక్‌ను నిర్బం ధించినపుడు, రవీంద్రుడు తీవ్రంగా విమ ర్శించారు.

బెంగాల్‌ ‌విభజన ప్రతిఘటనోద్య మంలో రవీంద్రుడు ప్రముఖ పాత్ర వహించారు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశారు. రవీంద్రనాథ ఠాగూర్‌ 1896‌లో – జరిగిన కలకత్తా కాంగ్రెస్‌ ‌సదస్సులో మొట్ట మొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించారు. రవీంద్రుడు వ్రాసిన ‘జనగణమణ’ ను జాతీయ గీతంగా ప్రకటించే ముందు ‘‘వందేమాతరం ‘‘జనగణమన’’లో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ‘జనగణ మన’దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ 1950 ‌జనవరి 24న జనగణమన జాతీయ గీతంగా, వందేమాతరం జాతీయ గేయంగా ప్రకటించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, 1941 ఆగష్టు 7న మరణించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…

Leave a Reply