Take a fresh look at your lifestyle.

‘‘‌దేశాన్ని ఊపేసిన నినాదం అది’’

నేడు ‘క్విట్‌ ఇం‌డియా డే’

స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ ‘ఇండియన్‌ ‌నేషనల్‌ అసోసియేషన్‌’(‌భారత జాతీయ సంఘం) స్థాపించారు. పదవీ విరమణ చేసిన బ్రిటన్‌ ‌ప్రభుత్వ ఉద్యోగి ఆలన్‌ ‌హ్యూమ్‌ ‌ప్రోత్సాహంతో బొంబాయిలో సమావేశమైన 78 మంది భారత ప్రతి నిధులు ‘భారత జాతీయ కాంగ్రెస్‌’‌కు అంకురార్పణ చేశారు. పాశ్యాత్య విద్యాభ్యాసకులైన వారు, పాత్రికేయ, విద్యారంగ ప్రముఖులు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా బ్రిటిష్‌ ‌పాలన పట్ల సానుకూలతను వ్యక్తపరిచారు. తమ తీర్మానాలను వైస్రాయ్‌, ‌కొన్నిసార్లు బ్రిటన్‌ ‌పార్లమెంటుకు పంపడానికే పరిమితమయ్యారు. నిజానికి కాంగ్రెస్‌ ‌పార్టీ అప్పట్లో నగరాలలో నివసించిన శిష్టజన వర్గానికి మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్‌ ‌వాదులు తమను తాము స్వామి భక్తులుగా భావిస్తూ, బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం నీడలో భాగస్వామ్యాన్ని ఆశించి మాత్రమే కార్యకలాపాలు కొనసాగించారు. దాదాభాయి నౌరోజీ బ్రిటిష్‌ ‌వారి ‘హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్’‌కు పోటీ చేసి గెలిచిన తొలి భారతీయునిగా నిలిచారు. ‘లోకమాన్య బాలగంగాధర తిలక్‌’ ‌తొలిసారిగా ‘స్వాతంత్య్రం నా జన్మ హక్కు’ అని ఎలుగెత్తి నినదించిన జాతీయ వాది. భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, మన జాతిని కించ పరిచిన బ్రిటిష్‌ ‌విద్యా వ్యవస్థను ఆయన తీవ్రంగా నిరసించారు. జాతీయవాదులకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేకపోవడాన్ని ఆయన సహించలేక పోయారు. ఈ సమస్యలకు స్వరాజ్యమే ఏకైక పరిష్కార మార్గమని నమ్మారు. బ్రిటన్‌ ‌పాలకులపై జనం తిరగబడడమే స్వరాజ్య సాధనా మార్గమని విశ్వసించారు. బిపిన్‌ ‌చంద్ర పాల్‌, ‌లాలా లజపతిరాయ్‌ ‌తిలక్‌ ‌సమర్థించారు. ఇలా ‘లాల్‌, ‌బాల్‌, ‌పాల్‌’ ‌జాతీయవాదానికి రూపురేఖల కల్పనలో కృతకృత్యులైనారు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌ ‌వచ్చాక దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమం పలు రూపాల్లో విస్తరించింది. సత్యాగ్రహ ఉద్యమం, అహింసా ప్రతి సహాయ నిరాకరణ ఉద్యమాల ఫలితంగా లక్షలాది మంది భారతీయులలో పోరాట స్ఫూర్తి రగిలింది. 1919 ఏప్రిల్‌ 18 ‌నాటి ఆందోళనలో-జలియన్‌ ‌వాలా బాగ్‌(అమృతసర్‌ ‌మారణకాండ) వద్ద బ్రిటీష్‌ అధికారి డయ్యర్‌ ‌నేతృత్వంలో జరిగిన 1651 రౌండ్ల పోలీసు కాల్పులకు 379 మంది మరణించినట్లు1137 మంది గాయాల పాలైనట్లు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. కానీ, జలియా వాలా బాగ్‌ ‌దుర్ఘటనలో 1,499 మంది మృతి చెందినట్లు వచ్చిన అంచనాలు భారతీయుల్లో ఆగ్రహావేశాలను రగిలించాయి.
మొదటి సహాయ నిరాకరణ, 1920లో స్వరాజ్య సాధనా లక్ష్యంతో కాంగ్రెస్‌ ‌పునర్వ్వస్థీకరణ, 1922లో గాంధీ రెండేళ్ల కారాగార వాసం, 1928లో సైమన్‌ ‌కమిషన్‌ ‌సిఫార్సుల తిరస్కరణ, భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్‌ ‌నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘం ఏర్పాటు, వంటి కీలక పరిణామాలు ఉద్యమాల గతిని మార్చాయి. 1929 డిసెంబర్‌ ‌లోగా స్వపరిపాలన హోదా ఇవ్వకుంటే సత్యాగ్రహం ఉధృతం చేస్తామన్న తీర్మానాలు, రాజకీయ అసంతృప్తి, లాహోర్లో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో సంపూర్ణ స్వతంత్ర సాధన పిలుపునకు క్రమానుగత హేతువులయ్యాయి. 1930 జనవరి 26న దేశం మొత్తం ‘సంపూర్ణ స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయమైంది. రాజకీయ వాదులు, విప్లవకారులు ఒక్కటి కావడానికి ఈ నిర్ణయం కారణభూతమైంది. 1930 మార్చి 12 నుండి ఏప్రిల్‌ 6 ‌వరకు కొనసాగిన ఉప్పు సత్యాగ్రహంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 400 కిలోమీటర్ల మేర కాలినడకన సాగిన దండియాత్రలో గాంధీ వెంట వేలాదిమంది నడిచారు. 1931లో ‘గాంధీ ఇర్విన్‌ ఒప్పందం’ కుదిరింది. విప్లవ వీరులు భగత్‌ ‌సింగ్‌, ‌సుఖ్‌ ‌దేవ్‌, ‌రాజ్‌ ‌గురులకు బ్రిటన్‌ ‌ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయడంతో, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 1932లో గాంధీజీ తిరిగి సత్యాగ్రహాన్ని చేపట్టారు. అనంతర పరిణామాలతో దశాబ్దకాలం పాటు కొనసాగిన వివిధ ఆందోళనలు సత్యాగ్రహాలు, నిరసనలు, బాంబు దాడులు, విధ్వంసం క్రమంలో- ‘క్విట్‌ ఇం‌డియా’ (భారత్‌ ‌ను వీడిపోండి’ అనే నినాదాన్ని గాంధీజీ ఇచ్చారు. క్విట్‌ ఇం‌డియా’ నినాదాన్ని సూచించింది. ఆ ఉద్యమం నాటికి ముంబై మేయర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల యూసుఫ్‌ ‌మెహరల్లీ. మేయర్‌ ‌పదవికి ఎన్నికైన తొలి సోషలిస్ట్ ‌మెహరల్లీ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎనిమిది సార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి ఊపునిచ్చిన ‘క్విట్‌ ఇం‌డియా’ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కే. గోపాలస్వామి రాసిన ‘గాంధీ అండ్‌ ‌బాంబే’ పుస్తకంలో వివరించారు. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికి వచ్చే మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరారు. అందుకు ‘గెటవుట్‌’ అని ఎవరో సూచించారు. అదంత మర్యాదగ లేదని గాంధీ తిరస్కరించారు. ‘రిట్రీట్‌ ఆర్‌ ‌విత్‌ ‌డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న యూసుఫ్‌ ‌మెహరల్లీ ‘క్విట్‌ ఇం‌డియా’ పదాన్ని సూచించారు. బాగుందని మెచ్చుకున్న వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు.
1942 ఆగస్టు 8న ముంబయిలోని గొవాలియా బ్యాంక్‌ ‌మైదానంలో జరిగిన సభలో ఆయన ఈ నినాదాన్ని ఇచ్చారు. ‘క్విట్‌ ఇం‌డియా’ నినాదం భారత స్వాతంత్య్ర సమరాన్ని కొత్తపుంతలు తొక్కించింది. గాంధీజీ పిలుపు మేరకు ఆగస్టు 9 నుంచి ‘క్విట్‌ ఇం‌డియా’ ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరంభమైంది.
1942 ఆగస్టు 9 నుండి 1942 సెప్టెంబరు 21 వరకు, క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో స్థానిక నిర్ణయాల మేరకు 550 పోస్టాఫీసులు, 250 రైల్వే స్టేషన్లపై దాడి చేసారు. అనేక రైలు మార్గాలను దెబ్బతీసారు. 70 పోలీస్‌ ‌స్టేషన్లను ధ్వంసం చేసారు. 85 ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టడమో, ధ్వంసం చెయ్యడమో చేసారు. టెలిగ్రాఫ్‌ ‌వైర్లు కత్తిరించిన సందర్భాలు సుమారు 2,500 ఉన్నాయి. బీహార్‌లో అత్యధిక స్థాయిలో హింస జరిగింది. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం 57 బెటాలియన్‌ ‌బ్రిటిషు దళాలను మోహరించింది. ఇలాంటి సంఘటనలకు ఆందోళన చెందిన బ్రిటిషు వారు వెంటనే స్పందించి గాంధీని, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ (జాతీయ నాయకత్వం) సభ్యులందరినీ జైలులో పెట్టారు. ప్రధాన నాయకుల అరెస్టు కారణంగా, అప్పటి వరకు తెలియని యువ నాయకురాలు అరుణా అసఫ్‌ అలీ ఆగస్టు 9 న ఏఐసీసీ సమావేశానికి అధ్యక్షత వహించి జెండాను ఎగురవేసింది. ఆ తరువాత కాంగ్రెస్‌ ‌పార్టీని బ్రిటిషు ప్రభుత్వం నిషేధించింది. గాంధీ  అహింసాయుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా 1943 వ సంవత్సరానికి క్విట్‌-ఇం‌డియా ఉధ్యమం నీరసించింది. ఏది ఏమైనప్పటికీ  కోట్లాది ప్రజలు, చరిత్రలో అపూర్వమైన విధంగా, ఒక త్రాటిపై నిలచి, ఏకకంఠంతో స్వాతంత్య్రమే ఏకైక లక్ష్యమని ప్రకటించడమే స్వాతంత్య్ర సాధనకు ముఖ్యకారణమని విస్మరించరాదు.
– రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494

Leave a Reply