Take a fresh look at your lifestyle.

నిజాంపై బాంబు విసిరిన తెలంగాణ విప్లవ వీరుడు

నేడు నారాయణరావు పవార్‌ ‌జయంతి
ఆయన ఒక పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. ప్రాణాలను పణంగా పెట్టీ, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ త్యాగ ధనుడు. రాచరికంలో బందీ అయిన తెలంగాణ ప్రజల స్వేచ్ఛాకాంక్షను ప్రపంచానికి చాటడానికి, నిజాం ప్రభువు హత్యకై ఆయనపై బాంబును విసిరిన సాహస వంతుడు. ఆయనే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ నారాయణ పవార్‌. ‌బాంబు గురి తప్పినా, ఆయన బందీ అయినా, ఆయన త్యాగ నిరతి, స్పూర్తి దాయకం అయింది. పవార్‌ ‌బాంబు వేసిన సంఘటనను పార్లమెంట్‌లో భగత్‌సింగ్‌ ‌చేసిన సాహసంతో నాటి ప్రజలు పోల్చుకునే వారు. అయితే ఆ సాహస వీరునికి ప్రాధాన్యత దక్కలేదు. తానే స్వయంగా నిరాహార దీక్ష చేస్తే గానీ రాజకీయ ఖైదిగా గుర్తించలేదు. నాటి తరానికి పవార్‌ ఆదర్శవంతుడే అయినా, చరిత్ర ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా, నాటి తరానికీ స్పూర్తి ప్రదాత అయిన పవార్‌ ‌పేరు కూడా నేటి తరానికీ తెలియని దుస్థితి శోచనీయం. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్‌ ‌సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో మగ్గక తప్పలేదు. సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపై బడి దోపిడి చేయడం, ఇండ్లు తగల బెట్టడం నానా అరాచకాలు సృష్టించగా, హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ ‌నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు.

1926 అక్టోబర్‌ 3‌న వరంగల్‌లో జన్మించిన నారాయణరావు పవార్‌. ‌బాల్యం నుంచే స్వేచ్ఛ భావాలు కలిగి అణచివేత ఏ రూపంలో ఉన్నా సహించేవాడు కాదు. 8వ తరగతిలోనే ఆర్య సమాజ్‌లో చేరాడు. నిజాం నవాబ్‌ ఆకృత్యాలు చదివాడు. ప్రత్యక్షంగా చూసాడు. అప్పుడే నిజాం నవాబ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించు కున్నాడు. కొంత మంది యువకులతో కలిసి ‘’ఆర్య యువక్రాంతి దళ్‌’’ ఏర్పాటు చేశాడు. దీనికి కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ సలహాదారుడుగా ఆర్థిక సహాయం చేశాడు. సమకాలీన రాజకీయాలపై నిరంతరం చర్చించేవారు. ‘’ మారు వేశాలలతో వెళ్ళి హైదరాబాద్లో. జిన్నా ‘’రెచ్చగొట్టే ఉపన్యాసం విన్నాడు.

తెలంగాణ సాయుధ పోరుకు సంఘీభావంగా ఏదైనా చేయాలను కున్నారు. ప్రతి దినం సాయంత్రం నిజాం నవాబ్‌ ‌దారుల్‌ ‌షిఫాల ఉండే తన తల్లి సమాధిని దర్శించుకు నేందుకు వెళతాడని తెలుసుకుని మిత్రులతో కలిసి నైజాంను చంపాలని, ప్రాణ త్యాగానికైనా సిద్దపడ్డారు. నారాయణ పవార్‌, ‌పండిత విశ్వనాధ్‌ ‌బొంబాయి వెళ్లి బాంబులు కొనాలని బయలు దేరారు. మార్గ మధ్యలో షోలాపూర్‌ ‌వద్ద కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ కనబడ్డాడు. విషయం చెప్పారు. ఆరు వందల రూపాయ లిచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు. బొంబాయి వెళ్లి రెండు బాంబులు, రెండు రివాల్వర్లను తీసుకున్నారు. బాంబులు ఫెయిల్‌ అయితే రివాల్వర్‌, అదీ ఫెయిల్‌ అయితే శత్రువుకు మాత్రం చిక్కకూడదు, పథకం ఎక్కడ పొక్క కూడదు. ఇది పథకం. హైదరాబాద్‌కు వచ్చిన పవార్‌ ‌నిజాంను ఎందుకు చంపాలనుకున్నది వివరంగా ఒక ఉత్తరం రాసారు. పవార్‌, ‌జగదీష్‌, ‌గండయ్యలు దానిపై రక్తంతో సంతకం చేసి నారాయణ స్వామికి ఇచ్చారు. బాంబులు వేసిన తర్వాత విజయవాడకు వెళ్లి ఆ పత్రాన్ని పత్రికలకు, రేడియో సంబంధీకులకు, నారాయణ స్వామి ఇవ్వాలన్నది వారి పథకం. అనుకున్న విధంగావారు సంసిద్ద మైన క్రమంలో, 1947 డిసెంబర్‌ 4‌న సాయంత్రం సుమారు 4 గంటల సమయాన, కింగ్‌కోఠి రోడ్డు నుండి తల్లి సమాధి దగ్గరకు వెళ్లే సమయంలో నిజాం ఇంటి ముందే గండయ్య, జగదీష్‌తో కలిసి పవార్‌ ‌మాటు వేశాడు. పవార్‌ అం‌దరికంటే ముందు ఉన్నాడు. ఒకవేళ అతని చేతిలో తప్పింకుంటే రెండోవాడు, అక్కడా తప్పితే మూడో వ్యక్తి పూర్తి చేయాలని రెడీ అయ్యారు.

నిజాం కారు పవార్‌ ‌దగ్గరకు రాంగనే కారుపై బాంబు విసిరాడు. అది గురి తప్పింది. కానీ ఆ బాంబు పేలుడుకు ఒక ఆడ మనిషి చనిపోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నిజాంపై రివాల్వర్‌తో కాల్చాలను కున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకున్నారు. బాంబు శబ్దం విన్న జగదీష్‌, ‌గండయ్య పథకం విజయవంతమైందని అనుకొని వెళ్లిపోయారు. లేకుంటే నిజాంకు అదే ఆఖరి రోజు అయ్యేది. సైకిల్‌ ఆధారంగా గండయ్యను కూడా అరెస్టు చేశారు. ఐదు రోజులు నారాయణ పవార్‌ను పోలీసులు నానా చిత్ర హింసలు పెట్టారు. తన కేసును వాదించు కోవడానికి వకీల్‌ను నియమించు కోక, స్వయంగా తానే తన వాదనలను వినిపించు కున్నాడు. ఎందుకు చంపాలను కున్నాడో విచారణలో వివరించాడు. చివరికి కోర్టు పవార్‌కు ఉరిశిక్ష విధించింది. 1948 సెప్టెంబర్‌ 18‌న అది అమలు కావాల్సి ఉండగా, ఒక్క రోజు ముందు సెప్టెంబరు 17 న నిజాము నవాబు వల్లబాయి పటేల్‌ ‌ముందు లొంగిపోగా, హైదరాబాద్‌ ‌సంస్థానం స్వతంత్ర భారత్‌ ‌లో విలీనం అయి పోయింది. సంస్థానం విముక్తి తర్వాత మిలిటరీ గవర్నర్‌ ‌మేజర్‌ ‌జనరల్‌ ‌జె.ఎన్‌.‌చౌదరి, ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు. కాని వివిధ సంస్థల ఆందోళనతో 1949 ఆగస్టు 10న జనరల్‌ ‌చౌదరి వీరిని విడుదల చేశాడు.అతనితోపాటు గండయ్య కూడా విడుదలయ్యాడు.

ఎట్టకేలకు పవార్‌ 2009 ఆగస్టు 9న నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ‌ద్వారా పవార్‌ ‌సన్మానించ బడి నాడు. నారాయణరావు పవార్‌ 85 ‌యేళ్ళ వయసులో హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో, 2010, డిసెంబర్‌ 8 ‌న కన్నుమూసాడు. తెలంగాణ గర్వించ దగిన పవార్‌ ‌లాంటి దీరులను, త్యాగ ధనులను భావితరాలకు తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నాటి చరిత్ర ను మరవకుండా ఉండేందుకు వైయక్తిక, చారిత్రక సంఘటనలను, సందర్భాలను పాఠ్యాంశాలుగా చేయాలి.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply