Take a fresh look at your lifestyle.

ఆపన్నులకు అండగా… రెడ్‌ ‌క్రాస్‌ ‌సంస్ధ

నేడు అంతర్జాతీయ రెడ్‌‌క్రాస్‌ ‌దినోత్సవం

రెడ్‌ ‌క్రాస్‌ ‌సంస్థ ఏర్పాటు వెనక ఒక మానవతా మూర్తి స్పూర్తి ఉంది. స్విస్‌ ‌పౌరుడు జీన్‌ ‌హెన్రీ డునాంట్‌ 1859 ‌లో ఒక వ్యాపార పర్యటనలో, ఆధునిక ఇటలీలో సోల్ఫెరినో యుద్ధం పరిస్థితులకు డునాంట్‌ ‌సాక్షిగా నిలిచాడు. ఆ యుద్ధంలో 40వేల మంది మరణించారు, అధిక సంఖ్యాకులు గాయపడ్డారు. గాయపడిన వారికి సాయం అందకుండా, రక్షణ లేకుండా పోయిన హృదయ విదారక దృశ్యాలు కళ్ళారా చూశాడు. తన జ్ఞాపకాలు, అనుభవాలను ఎ మెమరీ ఆఫ్‌ ‌సోల్ఫెరినో పుస్తకంలో రికార్డ్ ‌చేశాడు. ఆ సంఘటన 1863 లో ఇంటర్నేషనల్‌ ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌కమిటీ (ఐసిఆర్సి) ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే ‘‘రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ’’. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సేవా సంస్థలన్నింటిలో అతి పెద్దది. అది మానవతా ఉద్యమంగా రూపు దిద్దుకుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల సమస్యలతో బాధ పడుతున్న, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రపంచ రెడ్‌ ‌క్రాస్‌ ‌దినోత్సవానికి ప్రేరణగా నిలుస్తున్నది.

అంతర్జాతీయ రెడ్‌‌క్రాస్‌ ‌కమిటీ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్‌ ‌మే 08, 1863లో జన్మించాడు. ఆయన గౌరవార్థం ఆయన జయంతి రోజున ఈ ప్రపంచ రెడ్‌‌క్రాస్‌ ‌దినోత్సవాన్ని జరుపు కుంటున్నారు. హెన్రీ డునాంట్‌ ‌నోబెల్‌ ‌శాంతి బహుమతి గ్రహీత కూడా. హెన్రీ డునాంట్‌,1859 ‌జూన్‌ 24‌న వ్యాపారం పని మీద లావర్డి నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ ఆ‌స్ట్రియాల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం చూశాక, హృదయ విదారకమైన దృశ్యం అయన మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.

యుద్ధం ముగిసాక ఆయన ప్రజలందరికీ … ‘‘యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం.’’ అని విజ్ఞప్తి చేశాడు. ఆయన విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. 1864లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్‌ ‌క్రాస్‌ ‌సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 14 వ అంతర్జాతీయ సదస్సులో అంతర్జాతీయ కమిషన్‌ ‌శాంతికి ప్రధాన సహకారిగా రెడ్‌‌క్రాస్‌ను ప్రవేశ పెట్టింది. టోక్యోలో 1934లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రూస్‌ ‌సూత్రాలను ఆమోదించారు. అనంతరం రెడ్‌ ‌క్రాస్‌ ‌ను వివిధ ప్రాంతాలలో కూడా వర్తింప జేశారు.

యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ. తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోను రెడ్‌ ‌క్రాస్‌ ‌శాఖలు, యుద్ధ సమయాలలో, శాంతి కాలం లోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతి కాలంలో రెడ్‌ ‌క్రాస్‌ ‌కార్య కలాపాలు…ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, రక్త నిధులు సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది. 1965 వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, మానవత, నిష్పాక్షికత, సమ తౌల్యత, స్వతంత్రం, వాలంటరీ సేవ, ఐక్యత, విశ్వజనీయత…ఏడు ప్రాథమిక సూత్రాలు ఆమోదింపబడినవి. ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలు పరచాలని తీర్మానించ బడింది.1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.

1876 నుండి 1878 వరకూ జరిగిన రష్యా – టర్కీ యుద్ధ సమయంలో ఉస్మానియా సామ్రాజ్యం రెడ్‌ ‌క్రాస్‌ ‌కు బదులుగా రెడ్‌ ‌క్రెసెంట్‌ ఉపయోగించింది. క్రాస్‌ ‌గుర్తు క్రైస్తవ మతానికి చెందినదని, దీని ఉపయోగం వలన తమ సైనికుల నైతిక బలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయంలో సంపూర్ణ అంగీకారాన్ని ప్రకటించింది. 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం ఆమోదం పొంది, స్విడ్జర్లాండ్‌ ‌దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ‌ను తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచారు. అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణ మయినది. రెడ్‌ ‌క్రాస్‌ ‌ప్రైవేట్‌ ‌సంస్థ కింద 1863 లో స్థాపించిన, అలాగే 1919 లో స్థాపింపబడిన, అంతర్జాతీయ రెడ్‌‌క్రాస్‌ ‌కమిటీ ICRC), అంతర్జాతీయ రెడ్‌‌క్రాస్‌, ‌రెడ్‌‌క్రెసెంట్‌ ‌సంఘాల సమాఖ్య (IFRC), స్విట్జర్లాండ్‌ ‌లోని జెనీవా నగరంలో ప్రధాన కేంద్రంగా అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. హెన్రీ డ్యూనాండ్‌కు 1901లో తొలి నోబెల్‌ ‌శాంతి బహుమతి లభించింది. రెడ్‌‌క్రాస్‌ ‌సంస్థ 1917, 44, 63 సంవత్సరాలలో మూడు సార్లు నోబెల్‌ ‌శాంతి బహుమతిని గెలుచుకుంది.

అంతర్జాతీయ రెడ్‌‌క్రాస్‌, ‌రెడ్‌‌క్రెసెంట్‌ ఉద్యమం ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సేవాసంస్థ లన్నింటిలో రెడ్‌ ‌క్రాస్‌ ‌సొసైటీ అతి పెద్దది. ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) ఉన్నారు. మానవతా వాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు. అత్యవసర పరిస్థితుల నుండి వారి ప్రాణాలను రక్షించడానికి రెడ్‌ ‌క్రాస్‌ ‌సంస్థలు ఎంతో కృషి చేస్తాయి. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్‌‌క్రాస్‌ ఉద్యమంలో నేడు ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి. భారతీయ రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటీ 1920 లో స్థాపించబడి, ఢిల్లీ ప్రధానకేంద్రంగా విశేష సేవలు అందిస్తూ, ప్రజాదరణ పొందుతున్నది. ఇండియన్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌దేశ వ్యాప్తంగా 700 కి పైగా శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న స్వచ్ఛంద మానవతా సంస్థ.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply