Take a fresh look at your lifestyle.

నేడు అంతర్జాతీయ మైన్‌ అవగాహన దినోత్సవం

కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి…బయ్యారం ఉక్కు హుళక్కే..!

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి కేంద్రంలో ఉన్న బిజేపీ ప్రభుత్వం ఎందుకు తత్సారం చేస్తుందో రాష్ట్ర ప్రజలు యావత్‌కు ఇప్పుడు అర్థం అయ్యేవుండాలి. కేంద్రం ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేపనిలో ఉంది. ఈ దశలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని ఎలా ఆశిద్దాం. దీంతో రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేసిన విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్నట్టు అన్ని వనరులు ఉన్న బయ్యారంలో రూ.36 వేల కోట్ల వ్యయంతో ఒక భారీ ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతామన్న లిఖితపూర్వక హామీ అటకెక్కినట్టే అనే సందేహం ఇంకా బలపడింది. రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై ఒక్క అడుగూ పడకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పై యుద్దానికి సై.. అంటూ పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ ఉక్కు, తెలంగాణకు సింగరేణి..ఈ రెండే రెండు భారీ పరిశ్రమలు ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన జీవనాధారమైన ఈ రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడానికి తెలంగాణలో బయ్యారం, ఆంధ్రప్రదేశ్‌ ‌కడపలో ఉక్కు పరిశ్రమలను నెలకొల్పుతామని విభజన చట్టంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉక్కు పరిశ్రమల స్థాపనకు నాణ్యతను పరీక్షించే నిపుణుల నివేదిక ఆధారంగానే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు టాస్క్ ‌ఫోర్స్ ‌కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో వీటి స్థాపనపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

కొత్త రాష్ట్రం తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడానికి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనివార్యం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సవతి ప్రేమ చూపడం, రాజకీయ కోణంలో ఆలోచించండం తెలుగు ప్రజలను అవమానపర్చినట్లుగానే భావించాలి. తెలంగాణ వ్యాప్తంగా 460 మిలియన్‌ ‌టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్టు గనుల శాఖ తేల్చగా, ఇందులో బయ్యారం ఒక్కచోటనే 240 మిలియన్‌ ‌టన్నుల ఖనిజ నిక్షేపాలున్నట్టు రాష్ట్ర గనులశాఖ స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇం‌డియాకు (సెయిల్‌) ‌గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోనే నివేదిక ఇచ్చింది. నాటి ఉద్యమ నేత కేసీఆరే సీఎం కావడంతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించారు. ప్రధాన మంత్రితో సమావేశమైన ప్రతీసారి బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరుతూ వచ్చారు. దీంతో ఎట్టకేలకు గత ఏడాది మేలో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా (సెయిల్‌) ‌నిపుణుల బృందం, టాస్క్ఫోర్స్ ‌కమిటీ బయ్యారంలో ఉక్కు ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. వచ్చే 50 ఏళ్లకు సరిపడా ఉక్కు ఖనిజం బయ్యారంలో ఉందని, పైగా పరిశ్రమకు అవరమైన డోలమైట్‌, ‌సున్నపురాయి నిల్వలు సైతం భారీగా ఉన్నాయని గుర్తించి వెళ్లింది. అలాగే ఉక్కు పరిశ్రమకు అవసరమైన నీటిని అందించడానికి కిన్నెరసాని, మల్లన్నవాగు వనరులు ఉన్నాయని టాస్క్ఫోర్స్ ‌కమిటీ స్పష్టం చేసింది. సాంకేతికంగా నివేదిక అందిన వెంటనే బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు హామీ ఇచ్చారు. దీనితో పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించేంతటి సామర్థ్యం కలిగిన బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణకు బంగారు బాతు గుడ్డుగా ఆర్థిక నిపుణులు వర్ణించారు.

రాష్ట్ర ప్రజలు కూడా పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం కూడా వేగంగా స్పందించి.. బయ్యారంలో సమగ్ర స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని, వాస్తవానికి బయ్యారం పరిశ్రమ ద్వారా వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందడమేకాక వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక గ్రామాల్లో పురోగతి సాధ్యమవుతుందని అనుకున్నారు. అందులో బాగంగానే కేసీఆర్‌ అనేక సార్లు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. అయితే కేంద్రం అందుబాటులో ఉన్న స్టీల్‌ అథారిటీ అధికారులతో అధ్యయనంలో తేలిన అంశాల పేరుతో తెలంగాణ ఆశలపై నీళ్ళు చల్లాయి. బయ్యారం ప్రాంతంలో నాణ్యమైన ఇనుప ఖనిజం లేదని, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఇనుప ఖనిజానికి పెద్దగా డిమాండ్‌ ‌లేదని, ఇలాంటి సమయంలో బయ్యారంలో స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పెట్టినట్లయితే భవిష్యత్తులో పెద్దగా ప్రయోజనం ఉండదని, ఆర్థిక కోణం నుంచి చూస్తే ఎక్కువ కాలం పరిశ్రమను నడపలేమని అధికారులు ఇటీవల మత్రికి వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌.. ‌పరిశ్రమల ఏర్పాటును కేవలం ఆర్థికకోణం నుంచిగానీ, లాభార్జన అంశంతో ముడిపెట్టిగానీ చూడడం అన్ని సందర్భాల్లో సహేతుకం కాదని అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఉపాధి కల్పన అవకాశాల గురించీ ఆలోచించాలని సూచించారు.
వాస్తవాల లోకి వెళితే బయ్యారం ఇనుప ఖనిజ నిక్షేపాలపై డీప్‌ ‌స్టడీ చేసిన ఎన్‌ఎం‌డీసీ బృందాలు ఒక సవివర నివేదికను కేంద్రానికి సమర్పించాయి.

బయ్యారంలో ఉన్న నిల్వలు దేశంలోని నిల్వలతో పోల్చినపుడు 11 శాతం మొత్తం ఉన్నట్టు.. ముడి ఖనిజంలో లభ్యమయ్యే ఉక్కు నాణ్యతలోనూ అరవై శాతంగా తేల్చారు. దీంతో ఇక్కడ ఫ్యాక్టరీ వయబిలిటీపై భరోసా కుదిరినట్లయింది. ఏటా నాలుగు లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఖనిజాన్ని తవ్వి తీయగలిగినా కనీసం పాతికేళ్ల పాటు ఏలోటూ రానంత నిల్వ ఒక్క బయ్యారంలోనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి కావాల్సిన ఇనుప ఖనిజం స్థానికంగానే లభ్యం కావడం.. దీంతోపాటుగా ఉప ఖనిజాలైన డోలమైట్‌, ‌బైరేటిస్‌, ‌బొగ్గు లభ్యత కూడా దగ్గరలోనే ఉండడంతో ఇంకా ఫ్యాక్టరీ ఏర్పాటుకు నమ్మకం కుదిరింది. దీనికితోడు పాల్వంచ కేటీపీఎస్‌ ‌లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉండడం, దగ్గరలోనే గోదావరి జీవనది ఉండడం.. రైలు మార్గం కూడా పక్కనుంచే ఉండడం మరో ప్రత్యేకత.

దీనికితోడు తీవ్ర వెనుకబాటుకు గురైన బయ్యారం ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటైతే అటు అభివృద్ధి, ఇటు ఉపాధి రంగం ఊపందుకుని సంక్షేమం కూడా మెరుగవుతుందన్న ఆశలు నెలకొన్నాయి. దీంతో• విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయాన్ని ప్రస్తావించడంతో ఇక్కడి స్థానిక యువతలోనూ, ఆ ప్రాంత గిరిజనుల్లోనూ ఆశలు మొగ్గతొడిగాయి. కానీ ఏడేళ్లయినా ఇప్పటికీ ఈ విషయంలో బిజేపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికితోడు ఎప్పుడో ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటైన విశాఖ ఉక్కును సైతం ప్రవేటు పరం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మంకు పట్టుపట్టడంతో ఇక బయ్యారం ఉక్కు పరిశ్రమ ఆశలు ఆవిరైనట్టేనని నిరాశకు గురవుతున్నారు.
ఎలక్షన్స్ ‌వచ్చినప్పుడు మాత్రమే బయ్యారం గనులు గుర్తుకొస్తాయని, రాష్ట్ర పునర్విభజన చట్టం 2014కు బిజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని , బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టక తప్పదేమోనని మేథావులు అభిప్రాయపడుతున్నారు.

– డా. సంగని మల్లేశ్వర్‌,
‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,
‌సెల్‌ .9866255355.

Leave a Reply