Take a fresh look at your lifestyle.

తెలుగు భాషామ తల్లికి దేవులపల్లి ఎనలేని సేవలు

నేడు దేవులపల్లి రామానుజ రావు జయంతి

తె•లంగాణ ప్రాంతంలో తెలుగు భాష తెరమరుగు అవుతున్న సమయంలో, తెలుగు భాషను కాపాడిన స్వభాషాభిమానులలో దేవులపల్లి రామానుజరావు ఒకరు. జీవిత మంతా సాహితీ సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి రామానుజరావు. విద్యార్థి దశ నుండే మాతృభాషపై మమకారం పెంచుకుని, తెలుగు భాషా వికాసానికి, ఔన్నత్యానికి పాటుపడిన ఒక గొప్ప సాహిత్యాభిమాని. నిజాం నిరంకుశ పాలనకు ఎదురు నిలిచిన వారిలో రామానుజరావు ఒకరు.1943లో స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్‌, 1956‌లో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమి వంటి అగ్రగామి సంస్థల స్థాపనకు ఎంతో కృషి చేసి, జీవిత కాలమంతా సారస్వత పరిషత్‌ ఉపాధ్యక్షుడుగా, అధ్యక్షుడుగా ఉన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంత రావు, బూర్గుల రామకృష్ణరావు. స్వామి రామానంద తీర్థ వంటి పెద్దలతో తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసారు.
దేవులపల్లి రామానుజరావు వరంగల్‌ ‌జిల్లా బొల్లికుంటలో 1917 ఆగస్టు 25న కలిగిన కుటుంబంలో జన్మించారు. డిగ్రీలో చేరేదాకా వరంగల్లులో, తర్వాత నిజాం కళాశాలలో, మధ్యలో కొంత విరామం తర్వాత నాగపూర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఉద్యోగం కోసం వెదకక, రాజకీయ, సాహిత్య రంగాల్లో కృషి చేశారు. సాహిత్య రంగంతోపాటు విద్యారంగం, గ్రంథాలయోద్యమం, విశ్వ విద్యాలయం, పత్రికా రచన, రాజకీయాలు, సహకారోద్యమం, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు, విశాలాంధ్రోద్యమం, రాజ్యసభ సభ్యత్వం- ఇలా తెలుగు వారి జీవితానికి సంబంధించిన సకల రంగాల్లోనూ ఆయన పాత్ర ఉంది.

1943 మే 23న ఏర్పడిన ఆంధ్ర సారస్వత పరిషత్తుతో ఆయనకు మొదటి నుంచి సంబంధం ఉంది. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌కార్యవర్గ సభ్యుడిగా మొదలై, 1947లో కార్యదర్శి అయి, 1952లో తొలిసారి అధ్యక్షుడై మధ్యలో కొంత విరామం తప్ప జీవితం చాలించే దాకా ఆ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగులో ప్రవేశ, విశారద లాంటి పరీక్షలు నిర్వహించింది. తెలుగు మాధ్యమంలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత తెలుగు అధ్యాపకుల కొరత తీర్చింది ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ప్రాథమికోపాధ్యాయులు గానూ, విశారద పరీక్ష పూర్తి చేసిన వారిని ఉన్నత పాఠశాల అధ్యాపకులుగా నియమించేవారు. ఈ పరీక్షలు తెలంగాణలోనే కాక, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటిలో… బెంగళూరు, మైసూరు, హోసూరు, బొంబాయి, షోలాపూర్‌ ‌వంటి అనేక ప్రాంతాల్లో నిర్వహించేవారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి పండిత శిక్షణను కూడా రామానుజరావు సారథ్యంలోని సారస్వత పరిషత్తే చేపట్టింది. అక్షరాస్యతా ప్రచారం, వయోజన విద్య కూడా పరిషత్తు కార్యక్రమాల్లో భాగం. 1953లో అలంపురంలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షిక సభల నిర్వహణ బాధ్యతను తలకెత్తుకున్నదీ ఆయనే.అప్పటి ఉపరాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఈ ‌సభలను ప్రారంభించడమే కాక రెండు రోజులూ వాటికి హాజరయ్యారు. ఆ సభల్లోనే తెలంగాణ రచయితల సంఘం దాశరథి అధ్యక్షులుగా, సి.నారాయణరెడ్డి కార్యదర్శిగా, శ్రీశ్రీ గౌరవాధ్యక్షుడిగా ఏర్పాటైంది.

కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా 1957 నుంచి 1985 దాకా ఆయన జీవితంలో చాలా భాగం సాహిత్య అకాడమీతో ముడిపడింది. సాహిత్య అకాడమీ కార్యభారం మోసింది రామానుజరావే. అకాడమీ వృత్తి పదకోశాలు ప్రచురించడం, ప్రాచీన గ్రంథాలు ప్రచురించి చౌకగా అందుబాటు లోకి తేవడమూ ఆయన చలవే. సాహిత్య అకాడమీ నిర్వహణలో గానీ, సారస్వత పరిషత్తును నడపటంలో గాని రామానుజరావు తానే ఒక వ్యవస్థగా మారారు. ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ ప్రచురించినన్ని గ్రంథాలు దేశంలో మరే సాహిత్య అకాడమీ వెలువరించలేదు. ఉస్మానియా యూనివర్సిటీతో రామానుజరావుకు అమితమైన సంబంధం ఉంది. 1953 నుంచి 1976 దాకా సెనేట్‌, ‌సిండికేట్‌ ‌సభ్యుడిగా ఉన్నారు. 1972, 1973, 1975లో మూడుసార్లు తాత్కాలిక ఉపకులపతిగా వ్యవహరించారు.1960 నుంచి 1962 దాకా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక విశ్వ విద్యాలయం ఉస్మానియా. తెలుగు భాషకు ద్రోహం చేస్తూ, ఉర్దూను కృత్రిమత్వానికి గురిచేస్తూ కొందరు స్వార్థ పరులు ఉస్మానియాను హిందీ యూనివర్సిటీగా మార్చి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నాలు చేశారు.

ఉన్న ఒక్క విశ్వవిద్యాలయమూ పోయే పరిస్థితి ఎదురైనప్పుడు పౌర సంఘాన్ని ఏర్పాటు చేసి పోరాడి ఉస్మానియాను తెలుగువారికి దక్కించడంలో రామానుజరావు అద్వితీయ కృషి చేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు, అఖిల భారత తెలుగు మహాసభలు అతి వైభవంగా జరిగాయి. ఈ సభం రూపకల్పనలో రామానుజరావు పాత్ర ప్రమేయం, ప్రాతినిధ్యం ప్రముఖం.1974, జనవరిలో రవీంద్రభారతిలో జరిగిన రామానుజరావు స్మారకోమాసంలో నాటి భారత ప్రధాని పి.వి. తమ ప్రసంగంలో వారిద్దరూ కలిసి నాగపూర్లో న్యాయశాస్త్రాన్ని చదువుకున్న రోజులను గుర్తుచేసు కోవడం విశేషం. సాహిత్య సేవే జీవిత పరమావధిగా, కనీసం సొంత ఇల్లు కూడా సమ కూర్చు కోవడంపై దృష్టి నిలపక, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మాత్రం వందల కోట్ల రూపాయల ఆస్తులను సమకూర్చి పెట్టిన రామానుజరావు 1993, జూన్‌ 8‌న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. తెలుగు ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసి పోయారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply