Take a fresh look at your lifestyle.

ఈ రోజు ‘ప్రజాతంత్ర’ కుటుంబానికి పర్వదినం

  • ఇది సంతోష సమయం..
  • ఇది శుభ సందర్భం..
25 సంవత్సరాల  కిందట 1998,జనవరి 2 న  ‘ప్రజాతంత్ర’ వార పత్రిక ప్రచురణ ప్రారంభమయింది. క్రమం తప్పకుండా, విరామం లేకుండా వారం వారం ‘ప్రజాతంత్ర’ వినూత్న స్ఫూర్తితో పాఠకుల, అభిమానుల మన్ననలను పొందింది .ఆనతి కాలం లోనే 2001 లో ప్రారంభమయిన  దిన పత్రిక ను ,వార పత్రిక ను  పాఠకులు ఆదరించారు.పత్రిక ప్రచురణ, విశేషించి కొన్ని ఉదాత్త ఆశయాలకు, ఆదర్శాలకు, ఉత్కష్ట ప్రమాణాలకు, తలవంచకుండా నిలదీసి ప్రశ్నించే పత్రిక ప్రచురణ అసిధారావ్రతమని   మాకు తెలుసు. పత్రికా ప్రచురణ, నిర్వహణ అతి కష్టమయిన కార్యమని హెచ్చరించిన శ్రేయోభిలాషులు లేకపోలేదు. అయినప్పటికి, అన్నిటికి సిద్ధమయి  ‘ప్రజాతంత్ర’ ప్రచురణకు సంకల్పించాం… నిషేధాలకు, నిర్బంధాలకు గురైన గొంతులను వినిపించింది… అన్నా.. నీడనియ్యి అన్నవారికి గొడుగు పట్టింది.. ఒడిదొడుకుల నడుమ సెలయేరులా..వెనుకకు తిరుగకుండా ముందుకు, మున్ముందుకే నడుంకట్టి నడిచాం.
‘ప్రజాతంత్ర’ ప్రారంభమయిన మరుక్షణం నుంచి అన్ని ప్రాంతాల నుంచి అసంఖ్యాక పాఠకుల ప్రొత్సాహం, ఆదరణ అపారంగా లభ్యమయినాయి.. పాఠకులు, అభిమానులు నిరంతరం అందిస్తున్న ప్రేరణ ఊపిరిగా ‘ప్రజాతంత్ర’ నిత్యనూతన ఆకర్షణలతో, అకుంఠిత శక్తితో, సంకల్ప బలంతో 26 వ  సంవత్సరంలో ప్రబల ఆత్మవిశ్వాసంతో ప్రవేశిస్తున్నది. ఇది ‘ప్రజాతంత్ర’కు చరిత్రాత్మక సమయం,  సంఘటనలతో నిండిన, సంచలనాత్మకమయిన ఇరవై అయిదు సంవత్సరాలు  పూర్తి చేసుకుని ‘ప్రజాతంత్ర’ మహత్తర దశలో, నిర్ణయాత్మక దిశలో ప్రవేశిస్తున్నది.‘ప్రజాతంత్ర’ ప్రభవించిన సమయానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది, భారత రాజకీయ రంగంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విచిత్రమయిన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒక వంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న భారతదేశం మరో వంక అణ్వస్త్ర పరీక్షలు జరిపి అంతర్జాతీయ రంగంలో విమర్శలకు గురి అయింది, కేంద్రంలో రాజకీయ అస్థిరత్వం భారత ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించింది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా వినిపించింది. ఈ పరిణామాలన్నిటికి, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ రంగాలలో సంభవించిన సంఘటనలన్నిటికి ‘ప్రజాతంత్ర’ దర్పణమయింది. సమకాలీన చరిత్రను, వర్తమాన పరిస్థితులను, సాకల్యంగా విశ్లేషించి, విమర్శించడంలో ‘ప్రజాతంత్ర’ నిర్భయంగా, రాగద్వేష రహితంగా వ్యవహరించింది. ఇది ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక, విశిష్ట వ్యక్తిత్వం.
‘కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్య కర్మణి’ – ఈ గీతాబోధనను మార్గదర్శకం చేసుకుని ‘ప్రజాతంత్ర’ 26 వ  సంవత్సరంలోకి, నూతన శతాబ్దంలోనికి పురోగమించబోతున్నది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రగతిశీలం పతాకాలను చేపట్టి ‘ప్రజాతంత్ర’ కొనసాగిస్తున్న ఈ పురోగమనంలో సర్వదా పాఠకుల, అభిమానుల, హితుల, సన్నిహితుల ఆదరణ, అండదండలు సంపూర్ణంగా అభించగలవని మా ప్రగాఢ ఆకాంక్ష – పరిపూర్ణ ఆశంస.గత ఇరవై అయిదు సంవత్సరాలు  ‘ప్రజాతంత్ర’ కు పాఠకులు, మిత్రులు అవ్యాజానురాగంతో అందించిన ప్రొత్సాహం వల్ల విజయవంతమయిందని వినయ పూర్వకంగా విశ్వసిస్తున్నాం. వినమ్రతతో గర్వపడుతున్నాం. అలసత్వానికి తావులేని, నిత్యనూతనత్వం అత్యావశ్యకమయిన అవిశ్రాంత పోరాటం ఇది. ఇదోక నిరంతర ప్రయోగయాగం. విజయమూలంబయిన మీ  తోడుతో ఈ అక్షర ఆయుధపూజకు  పునరంకితమవుతున్నాం.ఈ శుభవేళ ఇవే మా నమస్సులు, నూతన వత్సర శుభాకాంక్షలు, హృదయ పూర్వక కృతజ్ఞతలు.
-దేవులపల్లి అజయ్ 

Leave a Reply