Take a fresh look at your lifestyle.

నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం మానవ జీవనంలో భాగం..నృత్యం

మనసకు వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం తనకు తానె లయబద్దంగా కదలికలు చేస్తుంది. దానినే నృత్యం అంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 29‌న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. 1982లో యునెస్కో సంస్థ అయిన ఎన్‌జిఓ యొక్క ఇంటర్నేషనల్‌ ‌డాన్స్ ‌కమిటీచే ఇది ప్రారంభించబడినది. ఏప్రిల్‌ 29 ‌రోజున నృత్య దినోత్సవం జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్‌ ‌డాన్స్ ‌కమిటీ యిచ్చినది. 1760లో రచయిత మరియు ఆధునిక ప్రెంచ్‌ ‌నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్‌ ‌జార్జెస్‌ ‌నోవేర్రే యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు. నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను ఛేదించడానికి, అన్ని రాజకీయ, సాంస్క ృతిక, జాతి అడ్డంకులు అధిగ మించడానికి, సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట ఈ నృత్య దినోత్సవం యొక్క లక్ష్యం. ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్‌ ‌డాన్స్ ‌కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాల ననుసరించి వాత్సాయన గ్రంథము ఆధారంగా కళలు 64. అందులో ముఖ్యమైనది నృత్యం. అసలు న ృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధమైన నృత్యాలు కొన్ని వున్నాయి. మానవజాతి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది ఏళ్లుగా డాన్స్(‌నృత్యం) అనేది జన జీవనంలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తున్నది. తమకు తెలియకుండానే ఆదిమ యుగం నాటి మనుషులు సంతోషం, దుఃఖం కలిగినప్పుడు కూడా శరీరాలను కదిలిస్తూ లయబద్దంగా నృత్యం చేసేవారు. వారు ప్రకృతిని, సూర్యున్ని, చంద్రున్ని దేవుళ్ళ లాగా భావించేవారు. అవి కూడా భ్రమణం చేస్తున్నాయని నమ్మేవారు. వారు. ఆదివాసీలు గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేసే సంప్రదాయం ఆ పాత కాలపు సంప్రదాయానికి కొనసాగింపే అంటున్నారు పరిశోధకులు. రాతి యుగపు కాలము నాటి ప్రాన్స్, ‌స్పెయిన్‌, ఇం‌డియా వంటి అనేక దేశాల కొండగుహలలో ఆదిమానవుల వేట, నాట్యం దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని బట్టి ఆదిమ కాలం నుండి నాట్యం మానవ జీవితంలో ఒక భాగం అని అర్థం అవుతున్నది. ఆది మానవుడు ప్రకృతిని, శక్తులను శాంతింప జేయడానికి, తనకు వశపరుచుకోవడానికి నృత్యాన్ని ఒక సాధనంగా అలవాటు చేసుకున్నారు. కుల, మత కట్టుబాట్లు, ప్రవృత్తి పెరిగిన కొలది నృత్య రీతి కూడా పెరిగింది. ఇప్పటికీ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా వంటి చోట్ల ఆటవిక జాతులలో ఇవి కనిపిస్తాయి. పరిణామ క్రమంలో నృత్యం నుంచి కొంత మేర వేరే కళాత్మకత కొనసాగడం భారతదేశంలో కనిపించింది.

తెలంగాణలో నాగోబా జాతర సందర్భంగా కొత్త కోడళ్ళను కుటుంబంలో కలుపుకోవడానికి గోండు పెద్దలు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆటపాటలతో నృత్యం చేస్తారు. ఆ ఆచారం ఆదిమ తెగల నుంచి సంక్రమించినదే. మానవుడు నృత్యం చేస్తూ తనను తాను దేవునికి సమర్పించుకునే వస్తువుగా భావించి ఉంటాడు. ఈ విధంగా నృత్యం తాంత్రిక పూజకి రెండు పార్శ్వాలుగా తయారయ్యాయి అని చెప్పవచ్చు. మధ్యయుగ కాలం నాటికి భారతదేశంలో దేవాలయ నిర్మాణము ఒక ఉద్యమంలా తయారయింది. దేవాలయ నిర్మాణం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని రాజులు, సామంతులు ఎన్నో దేవాలయాలను కట్టి పోషణ కోసం మాన్యాలు, గోవులు, ఇతర ఆస్తులను దానంగా ఇచ్చేవారు. ఈ దేవాలయంలోనే దేవదాసీలు అనే స్త్రీలు ఉండే వారు. వీరు సంగీత, నృత్య కళాకారిణులు. జీవితాంతం వివాహం చేసుకోకుండా దేవాలయంలో నృత్యం, గానం చేస్తూ తమను తాము దేవుని సేవకు అర్పించుకొనే వారు. ఆ కాలంలో నాట్యం దేవునికి ప్రీతిపాత్రమైనదని అన్నారు కాబట్టి ఇటువంటి నాట్యకారిణి పూర్తికాలం సేవకురాలిగా నియమించి ఉండవచ్చు. ఇప్పటికి ప్రాచీన దేవాలయాలలో అద్భుతమైన నాట్య రీతులు కలిగి ఉన్న శిల్పాలు దర్శనమిస్తాయి. తెలంగాణాలోని కాకతీయులు నిర్మించిన రామప్ప దేవ్వాలయంలో ఆరు అంగుళాల నుంచి ఆపైన పొడవు ఉన్న శిల్పాలు అలనాటి నృత్య రీతులను ప్రతిబింబిస్తున్నాయి. మార్గి నృత్య పద్దతులైన స్థానక, చారి, కరణ, పిండిబంధ వంటి వాటి ప్రతిబింబాలు వీటిలో ఉన్నాయి. అట్లాగే దేశి నృత్య పద్దతులైన ష్టనక, హత్స, గావునడలి, యోగిని, పేరిణి వంటి నృత్య శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ దక్షిణ భారత దేశంలో ఆ కాలంలో ఉన్న నృత్య పద్దతులు. మానసోల్లాసం, సంగీత రత్నాకరం, నృత్యరత్నావళి, వంటి గ్రంథాలలో ఈ నాట్య పద్దతులు కనిపిస్తాయి. నాగార్జున కొండ, అమరావతి, ఘంటశాల వంటి బౌద్ధ స్తూపాల దగ్గర కనిపిస్తాయి. భారతీయ నాట్య ప్రపంచంలో అతి ముఖ్యమైనవి జానపద నృత్యాలు, సింధు భాగవతుల ఆడే ఆట, పులి నృత్యం, ఆదివాసీలు ఆడే దండారి, దేనికదే ప్రత్యేకమైనది. వీటినుంచి విడిగా మన జీవితాలను ఊహించలేము.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ నృత్యం(డాన్స్) ‌మానవ జీవితంలో ఒక విడదీయరాని భాగంగా ఉంది. మన భారత దేశంలోని దేవాలయాల్లో న ృత్యానికి సంబంధించిన ఆనవాళ్ళు వివిధ భంగిమలలో శిల్పాలపై మలచబడి ఉన్నాయి. జీవితంలోని కొన్ని దశల్లోనూ అంటే పుట్టుక, అన్నప్రాసన, ఓణీలు, పంచెలు ఇవ్వడం, వివాహం, మరణం వంటి అన్ని సందర్భాల్లోనూ డ్యాన్స్ ‌పెనవేసుకుని ఉంది. ఆడ, మగ, వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు వారి సంతోషాన్ని డాన్స్ ‌రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఇక సంబంధిత పండగలు ఆచారాలు, జాతరల ఊరేగింపు, పూజా సమయాలలో అతి ముఖ్యమైన భాగం అవి భరతనాట్యం, కూచిపూడి, కథక్‌, ‌వంటి శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలు లేదా జానపద నృత్యాలు, తీన్మార్‌ ‌మాత్రం ఉండాల్సిందే. రాతి యుగంలో ఒక కళగా కనిపించి, లోహ యుగానికి వచ్చేటప్పటికి ఒక డ్రామా లక్షణాలను సంతరించుకుని, నేటికాలంలో ఒక వినోదాత్మక కళగా నృత్యం రూపుదిద్దుకున్నది. డ్యాన్స్ ‌మానవుని జీవితంలో విడదీయరాని బంధాలను పెనవేసుకుంది. ఈమధ్య కాలంలో ప్రచార సాధనాలు నృత్యానికి అధిక ప్రాముఖ్యత కలిగించాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న నృత్యకారుల ప్రతిభ సోషల్‌ ‌మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ నేడు నృత్యానికి విలువ, ప్రాధ్యాన్యతను సమకూరుస్తున్నాయి. ఈ కాలంలో శారీరక దేహ దారుడ్యం, ఆరోగ్యం పెంపొందించుకోవడానికి నృత్యంలో కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు.

nerupati aanandh

Leave a Reply