Take a fresh look at your lifestyle.

తలాపున పారుతోంది గోదారి..

  • ఇక మన చేను… మన చెలక మాగాణి
  • సిఎం కేసీఆర్‌ ‌కృషి…హరీష్‌రావు పట్టుదల
  • 1.14లక్షల ఎకరాలకు సాగునీరు
  • తీరనున్న సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల నీటి గోస
  • ఎవరింట్లో వారు, ఎవరి ఊర్లలో వారు  పండుగలా జరుపుకోవాలని మంత్రి హరీష్‌రావు పిలుపు
    నేడు రంగనాయక సాగర్‌ ‌ప్రారంభోత్సవం

harish raoదాదాపుగా రెండు దశాబ్దాల కిందట అప్పటి గోదావరిని, బీడు బారిన భూములను చూసి ‘తలాపున పారుతుంది గోదారి…నా చేను నా చెలక ఎడారి..’అని ఓ కవి రాసిన పాటను ఇప్పుడు తిరగరాసుకోవాలి. ‘తలాపున పారుతుంది గోదారి..మా పొలం కూడా పారుతుంది గోదారి’అని రైతన్నలు పాడుకోవాల్సిన సమయం రానే వచ్చింది. గోదావరి, ప్రాణహిత నదుల నీళ్లు ప్రతి ఏటా సముద్రం పాలవుతున్నా…వాటిని వినియోగించుకోలేని దుస్థితి. అప్పటి సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల పగుళ్లు వారిన భూములు నెర్రెలు బారిన భూములను చూసి కవి ఆ పాటను రాశాడు.ఆ పాటను స్పూర్తిగా తీసుకున్న నాటి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాలేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనుకున్న సమయానికి యావత్‌ ‌దేశమే అబ్బుర పడేలా శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి భూమత చెంతకు గోదారి జలాలను తీసుకు వచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేసే ఘట్టానికి తెర తీయబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే అంటే శుక్రవారమే బృహత్తర సిద్ధిపేట శివారులోని చంద్లాపూర్‌ ‌వద్ద నిర్మించిన రంగనాయకసాగర్‌(‌కాలేశ్వరం)ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించబోతున్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు పనులు అనుకున్న మేర ముందుకు సాగకపోవడంతో…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిఎం హెదాలో, తన్నీరు హరీష్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో కాలేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్‌ ‌చేశారు. కాలేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద దాదాపుగా 282.3టిఎంసిల నీటి లభ్యత ఉందని భావించిన నీటి పారుదల శాఖాధికారులు అక్కడ ఒక బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల వద్ద ఒక బ్యారేజీని చేపట్టి పంప్‌హౌజ్‌ల ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి చంద్లాపూర్‌ ‌శివారులో నిర్మించిన రంగనాయకసాగర్‌కు నీటిని పంపింగ్‌ ‌చేస్తున్నారు. అనంతగిరి రిజర్వాయర్‌ ‌నుంచి ఇప్పటికే చంద్లాపూర్‌ ‌సర్జ్‌పూల్‌ ‌వరకు గోదావరి నీళ్లు చేరాయి. ఈ అండర్‌‌గ్రౌండ్‌ ‌సర్జ్‌పూల్‌ ‌నుంచి నాలుగు మోటార్ల ద్వారా రంగనాయకసాగర్‌లోకి శుక్రవారం నీటిని ఎత్తిపోయనున్నారు. ఒక్కో మోటార్‌ ‌ద్వారా రోజుకు 0.25టిఎంసిల నీటిని ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ ‌సామర్థ్యం 3టిఎంసిలు. ఈ రిజర్వాయర్‌ ‌నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా చెరువుల్లోకి నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్‌ ‌ద్వారా సిద్ధిపేట నియోజకవర్గ పరిసర ప్రాంతంలోని సుమారు ఒక లక్షా 14వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.

సిఎం కేసీఆర్‌ ‌కృషి…హరీష్‌రావు పట్టుదల
సుమారు 20సంవత్సరాల కిందట నీళ్ల గోస ఇంతా అంతా కాదు. సమైక్య రాష్ట్రంలో నీటి కోసం ముఖ్యంగా సాగునీటి కోసం తెలంగాణ రైతాంగం పడ్డ బాధలు వర్ణనాతీతం. పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడిన వైనం. అయితే, 2001లో కేసీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమం ప్రారంభించి…తెలంగాణ రాష్ట్రమొస్తే ఏమొస్తది అనుకున్న వాళ్లకు ఇప్పుడు చంద్లాపూర్‌ ‌వచ్చి రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ను చూస్తే ప్రత్యేకించి వేరే చెప్పనక్కర్లేదు. తెలంగాణ మీదుగానే గోదావరి పారుతున్నా…తెలంగాణ భూములన్నీ బీడు భూములుగానే ఉండేవి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిఎంగా, తన్నీరు హరీష్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సముద్రంలో కలిసిపోతున్న గోదావరిని తెలంగాణ పల్లెలకు మళ్లించాలని సంకల్పించారు. దీని కోసం కాలేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్‌ ‌చేశారు. దీని ఫలితంగానే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని పలు ప్రాంతాలు కోనసీమను తలపిస్తుండగా…తాజాగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సిద్ధిపేటను సైతం గోదారి జలాలు తాకాయి. ఒకప్పుడు మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్‌ ‌జిల్లా సమైక్యుల పాలనలో అన్నమో రామచంద్ర అంటూ రైతులు బతుకులు వెళ్లదీశారు. ఈ క్రమంలో సిఎంగా కేసీఆర్‌, ‌నీటిపారుదల శాఖ మంత్రిగా తన్నీరు హరీష్‌రావు ఎలాగైనా బీడు భూములను మాగాణంగా చేయాలన్న కృషి, పట్టుదల కారణంగా రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ అనుకున్న సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. 2016లో రంగనాయకసాగర్‌ ‌పనులకు నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2500ఎకరాల భూమిని సేకరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు ఒక మంత్రిగా కాకుండా ఒక ఇంజినీర్‌గా మారి అన్నీ తానై పనిచేశాడు. అధికారులను, ప్రాజెక్టు కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు. రిజర్వాయర్‌ ‌పనులు త్వరితగతిన పూర్తి కావడానికి హరీష్‌రావు లెఖ్కలేనన్ని పర్యాయాలు సందర్శించారు. సమీక్షించారు. దిశానిర్దేశం చేశారు. హరీష్‌రావు పట్టుదల వల్లనే ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాలుగేండ్ల వ్యవధిలోనే ప్రారంభించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, హరీష్‌రావు మాత్రం సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం, మీ అందరి ప్రేమాభిమానాలతో 2004 నుంచి మీకు సేవచేసే మహాభాగ్యం నాకు లభించింది. కేసీఆర్‌ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మనమంతా కలసి పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే స్ఫూర్తితో గత ఆరున్నరేండ్లుగా గోదావరి జలాలను తెలంగాణ రాష్ట్రమంతటా తీసుకెళ్లే మహాయజ్ఞంలో సీఎం కేసీఆర్‌తో కలిసి భాగస్వాములమయ్యాం. సిద్దిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఎంత అభివృద్ధి చేసినా ఇప్పుడున్న సంతృప్తి పొందుతున్న ఆనందం అనిర్వచనీయమైనది. ఈ మహా జలయజ్ఞంలో భాగస్వామిని అయ్యే మహాభాగ్యం దక్కినందుకు నేను పొందుతున్న ఆనందానికి అవధుల్లేవు అని అంటున్నారు. అంతేకాకుండా, రైతులు ఊరితాళ్లు ఎక్కిన ఇండ్లు ఇప్పుడు బంగారు పంటల లోగిళ్లుగా మారుతాయా అని కలలుగన్నం. ఆత్మహత్యలకు చిరునామాగా ఉన్న మెతుకు సీమ, పాడి పంటలకు ఖాజానాగా మారి, నిజమైన మెతుకుసీమగా ఎప్పు డు మారుతుందా? అని ఆశపడ్డం. వట్టిపోయిన మన చెరువులు నీటి ఊటల చెలిమెల్లా ఎప్పుడు మారుతాయా అని మొగులు దిక్కు మొహం పెట్టి, వాన కోసం ఎదురుచూసి అలసిపోయినం. ఆగమైనం. ఇన్నాళ్లకు మనందరి కల సాకారమైంది. మీ అందరి ప్రేమ, ఆ భగవంతుడి ఆశీర్వాదం. ముఖ్యమంత్రి, అపర భగీరథుడు, మన సిద్దిపేట కన్న బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పదీక్ష ఫలించింది అంటున్నారు హరీష్‌రావు.

ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయితే మెదక్‌ ‌జిల్లా…మెతుకు సీమనే..
కాళేశ్వరం నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, పరవళ్లు తొక్కుతూ గోదారమ్మ సిద్దిపేట నేలను ముద్దాడుతున్నది. కాలేశ్వరం నుంచి సిద్దిపేట వరకు 620 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను తెచ్చే మహత్తర జలయజ్ఞం విజయవంతమైంది. సిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరు నుంచి అనంతగిరి ప్రాజెక్టులోకి అక్కడి నుంచి 116 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌ ‌ప్రాజెక్టులోకి గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. మరి కొద్దిరోజుల్లోనే 112 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్న సాగర్‌ ‌సర్జిపూల్‌కు, అక్కడినుంచి 120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ చేరుతాయి. ఈ మహాయజ్ఞ ఫలాలు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట జిల్లా ప్రజలకు, ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని మెదక్‌, ‌నర్సాపూర్‌, ‌పఠాన్‌చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్‌, ‌నారాయణఖేడ్‌ ‌ప్రాంతాల రైతులకు అందబోతున్నాయి. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సుమారు 16.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందబోతున్నది. అందుకు మొదటి అడుగుగా సిద్దిపేట సమీపంలోని చంద్లాపూర్‌ ‌వద్ద నిర్మించుకున్న రంగనాయకసాగర్‌ ‌ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌, ‌దుబ్బాక, హుస్నాబాద్‌, ‌మానకొండూర్‌ ‌నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల చెరువులు, కుంటల్లోకి మరికొద్ది రోజుల్లో గోదావరి జలాలు రాబోతున్నాయి. రంగనాయకసాగర్‌ ‌ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో లక్షా 14 వేల ఎకరాల ఆయకట్టుకు, అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల నియోజకవర్గంలోని 30 వేల ఎకరాల ఆయకట్టుకు, మల్లన్నసాగర్‌ ‌ద్వారా ఒక లక్షా 25 వేల ఎకరాల ఆయకట్టుకు, కొం డపోచమ్మసాగర్‌ ‌ప్రాజెక్టు ద్వారా 2 లక్షల 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 5 లక్షల 25 వేల ఎకరాల నేల సస్యశ్యామలం కాబోతున్నది.

అరుదైన ఘట్టానికి వేదిక కాబోతున్న చంద్లాపూర్‌..
‌సిద్ధిపేట చరిత్రలో ఒక అద్భుత సందర్భం. ఒక చరిత్రాత్మక ఘట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కల సాకారమై, మంత్రి హరీష్‌రావు కృషి ఫలించి ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయకసాగర్‌ ‌ప్రాజెక్టు నిర్మించుకోవడం అరుదైన ఘట్టం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షకు, మంత్రి హరీష్‌రావు పనితీరుకు నిదర్శనం. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించనుండటంతో…దీనికి ముందుగా గురువారం రంగనాయకసాగర్‌ ‌గుట్టపైన ఉన్న రంగనాయకస్వామి ఆలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మెగా కంపెనీ ప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, కొరోనా వైరస్‌ ‌వల్ల రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఎలాంటి ఆడంబరాలు చేయకుండా చాలా సాదా సీదగా చేయాలని మంత్రి హరీష్‌రావు నిర్ణయించారు.ఎవరింట్లో వారు, ఎవరి ఊర్లలో వారు ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, గోదావరికి జలహారతులు పట్టాలనీ, ఇప్పటి వరకు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే బాధ తప్పుతుందన్నారు.. కాలువల ద్వారా వచ్చే నీటితో వ్యవసాయంతో పంటల దిగుబడి మరింత పెరుగుతుంది. కరెంటు ఆదా అవుతుంది. రైతు ల ఇండ్లలో పసిడి పంటల రాశులు నిండుతాయి. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయనీ, గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో ఈ ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా, అన్నపూర్ణ ప్రాంతంగా వర్ధిల్లుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రంగనాయకసాగర్‌ను సందర్శించిన సిపి..
రోజు రంగనాయక సాగర్‌ ‌ప్రాజెక్టును గురువారం సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిస్‌ ‌సందర్శించారు. ప్రాజెక్టులోనికి నీళ్లు వచ్చే టన్నల్‌, ‌ప్రాజెక్టు నిండిన తర్వాత బయటకు నీళ్లు వెళ్లే టన్నల్‌ ‌ప్రదేశాలను పరిశీలించారు. త్వరలో ప్రాజెక్టులోనికి నీళ్లు రాగానే ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున, వారి వాహనాలు పార్కింగ్‌ ‌చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌, ‌సిద్దిపేట రూరల్‌ ‌సిఐ సురేందర్‌ ‌రెడ్డికి భద్రత గురించి, వాహనాల పార్కింగ్‌ ‌గురించి సూచనలు, సలహాలు చేశారు.

Leave a Reply