- ఆలయంలోనే స్వామివారి కల్యాణ మండపం ఏర్పాటు
- ఆలయ సిబ్బంది, ముఖ్య అధికారులతోనే కల్యాణం ముగింపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణ మహోత్సవం గురువారం నాడు ఆలయ ప్రాంగణంలోనే అత్యంత వైభవంగా జరుగనుంది. అందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బుధవారం నుండి ఆలయం వద్దనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం సాయంత్రానికి భద్రాచలం చేరుకున్నారు. ఆలయంలో జరిగే స్వామివారి కల్యాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారి రమణాచారి కూడ భద్రాచలం చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది జిల్లాలో ఉన్న ముఖ్య అధికారుల సమక్షంలోనే స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది స్వామివారి కల్యాణం ఆలయానికే పరిమితం అయింది. గత కొన్ని సంవత్సరాలుగా మిధిలా స్టేడియంలో ఉన్న కల్యాణ మండపంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణం వైభోవోపేతంగా నిర్వహించేవారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం స్వామివారి కల్యాణాన్ని పరిమిత సంఖ్యలోనే ఆలయంలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసారు.
ఆలయంలోనే స్వామివారి కల్యాణాన్ని నిర్వహించేందుకు మండపాన్ని ఏర్పాటు చేసారు. కేవలం 50,60 మంది మాత్రమే స్వామివారి కల్యాణం వద్ద ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా దూరం పాటించాల్సిన అవసరం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికే మీడియాకు అనుమతి లేదని ప్రకటించారు. కేవలం 1,2 శాటిలైట్ ఛానల్స్ మాత్రమే అనుమతిస్తారు. ఆ లింక్ ద్వారా మిగతా ఛానెల్స్ వారు ప్రచారం చేసుకోవల్సి ఉంటుంది.
ఈ ఏడాది భక్తులు టివిలకే పరిమితం అయి స్వామివారి కల్యాణాన్ని తిలకించాల్సి ఉంటుంది. కరోనా ప్రభావం వలన భక్తుల్లో భయాంధోళన చెందటం వలన భక్తులు భద్రాచలం చేరుకోలేదు. ముందుగానే ప్రభుత్వం భక్తులు రావద్దని ప్రచారం చేయటం వలన భద్రాచలం శుభ పరిణామం జరిగింది. అకస్మాత్తుగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తే అధికారుల్లో కొంత భయాంధోళన ఉండేది. రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. దేవదాయ ధర్మాదయ శాఖ కమీషనర్ అనీల్‌కుమార్ బుధవారం నుండి భద్రాచలంలోనే ఉంటూ కల్యాణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వామివారి కల్యాణానికి విచ్చేస్తున్నారు. ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు దేవదాయ ధర్మాదయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహదారి రమణాచారి సమర్పించనున్నారు.