Take a fresh look at your lifestyle.

నాడు దళిత ద్రోహి…నేడు అంబేద్కర్‌ ‌వారసుడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరు నెలల్లోనే మారిపోయాడా? లేక ఈ ఆరు నెలల్లో మోత్కుపల్లి నర్సింహుల్లోనే మార్పు వొచ్చిందా? ఎందుకంటే ఆరు నెలల క్రితం కాషాయ కండువా కప్పుకున్న మోత్కుపల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. దళిత ద్రోహి అన్నాడు. నీచ రాజకీయం చేస్తున్నాడన్నాడు. ఏ నాడైనా దళితుడిని గౌరవించావా అని నిలదీశాడు. దళితుల కోసం కనీసం అయిదు వేల కోట్లైనా ఖర్చు చేశావా అని ప్రశ్నించాడు. అసలు నీ పరిపాలన ఎవరికోసం, ఉన్నత వర్గాల కోసం, నీ కుటుంబం కోసం.. నీ కుటుంబమంతా రాజ్యాధికారంలో ఉంది. నువ్వు ఏనాడు జనానికి కనిపించవు. అందుకే దళిత యువకులంతా నీమీద తిరుగబడటానికి సిద్ధంగా ఉన్నరు.. ఇలా సాగింది ఆయన ఉపన్యాసమంతా. ఇప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకంగా కెసిఆర్‌ను అంబేద్కర్‌ ‌వారసుడిగా అందలానికి ఎత్తుతున్నాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి నిర్ణయాన్ని దళితులకోసం తీసుకున్న మగాడు, మొనగాడు కెసిఆర్‌ అం‌టూ కెసిఆర్‌ను పొగడ్తలతో నింపేస్తున్నాడు. ఆనాడు దళితులంతా కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్నారన్న వాడల్లా, ఈ నాడు దళితులంతా కెసిఆర్‌కు అండగా నిల్వాలని పిలుపునిస్తున్నాడు. ఇంతకూ కెసిఆర్‌ ఆరు నెలల్లోనే ఎందుకు మంచివాడై పోయినాడు అంటే ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించడమే.

తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దళిత సాధికారత పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చి, దానికి శ్రీకారం హుజురాబాద్‌ ‌నుండే మొదలవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్‌లో 12వేల కోట్ల రూపాయలను కేటాయించడం పట్ల మోత్కుపల్లి హర్షం వ్యక్తంచేశారు. ఈ సంవత్సరం జనవరిలో బీజేపీలో చేరిన మోత్కుపల్లి అక్కడ ఇమడలేక పోతున్నాడు. ఆ పార్టీ తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదంటూ ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ధ్వజమెత్తడమేగాక, దళిత సాధికారత పథకం పై చర్చించేందుకు కెసిఆర్‌ ‌దళిత నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి బిజెపి అభిప్రాయానికి వ్యతిరేకంగా పాల్గొన్నప్పటి నుండి ఆ పార్టీకి ఆయన మరింత దూరమవుతూ వొచ్చాడు. దళితుల మేలుకోరి చర్చించే అంశంలో తన లాంటి దళిత సీనియర్‌ ‌నాయకుడు పాల్గొనకపోవడమేంటన్నది ఆయన ప్రశ్న. ఆ సమావేశానికి వెళ్లడం ద్వారా ఒక విధంగా తాను బీజేపీ గౌరవాన్ని కాపాడిన వాడినయ్యానంటూ తనకు తానుగా కితాబిచ్చుకున్నాడుకూడా. పైగా తాను వెళుతున్న విషయాన్ని పార్టీ నేతలకు తెలిపే వెళ్ళానని, తానే గనుక ఆ మీటింగ్‌కు వెళ్ళక పోయినట్లైతే దళిత వ్యతిరేక పార్టీగా బిజెపిపై ముద్రపడేదని, ఒక విధంగా పార్టీ గౌరవాన్ని తాను కాపాడిన వాడినన్నది ఆయన వాదన. దాని తర్వాత ప్రగతి భవన్‌లో ప్రతిపక్ష నేతలతో జరిపిన అధికార సమావేశానికి కూడా బిజెపి పక్షాన మోత్కుపల్లి హాజరవడాన్ని కాషాయ పార్టీ జీర్ణించుకోలేకపోయింది.

ఏమైతేనేమీ చివరకిది మోత్కుపల్లి రాజీనామాకు దారితీసింది. తాను బీజేపీకి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన డప్పు కొట్టి మరీ తెలియజేశాడు. బిజెపి లో దళిత నాయకుడు ఎవరూ లేని సమయంలో తాను ఆ పార్టీకి చేయూత నిచ్చే ఉద్దేశ్యంగా చేరితే, తన లాంటి సీనియర్‌ ‌నాయకుడికక్కడ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన చెందాడు. నాయకులంతా పైన కూర్చుంటే తన స్థానం ఎప్పుడూ కిందనే ఉంటూ వొచ్చిందని మదనపడ్డాడు. అలాంటి పరిస్థితిలో దళితులందరికీ ఆర్థిక, సామాజిక భద్రతను కల్పిస్తున్న కెసిఆర్‌ ‌సర్కార్‌ను అభినందించలేకుండా ఉండలేక పోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. దళిత బంధు పట్ల ఆకర్షితుడై మోత్కుపల్లి అలా మాట్లాడాడో, హుజురాబాద్‌ ఎన్నికల వేళ మోత్కుపల్లితో టిఆర్‌ఎస్‌ ‌నేతలు తెరచాటు మంతనాలు జరిపారోగాని బిజెపిని విడిచిపెట్టిన మోత్కుపల్లి మాత్రం త్వరలో టిఆర్‌ఎస్‌ ‌తీర్థం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది అధికార పార్టీకి పోటీగా నిలుస్తున్న బిజెపి, కాంగ్రెస్‌కు ఒక విధంగా షాకే. ఎందుకంటే హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ధేశించేది దళిత వోటర్లన్నది నిజం. ఇక్కడ దాదాపు లక్షా ఇరవై వేల వోటర్లు ఉండగా అందులో దళిత వోటర్ల సంఖ్య 45 వేలు. ఇందులో కూడా మాదిగ కమ్యూనిటీకి చెందిన వోటర్లు 38 వేలు కాగా, మిగతావారు మాల వోటర్లు. ఇదిలా ఉంటే ఇక్కడ బిసి వోటర్ల సంఖ్య కూడా ఎక్కువే . మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్‌, ‌గౌడ్‌, ‌యాదవులున్నారు. వీరంతా బిసిలే కాబట్టి, ఆదే వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ ‌గెలుపు సునాయాసమనుకుంది బిజెపి. అయితే బిసి వోటర్లలో వివిధ పార్టీలకు చెందినారు ఉండటంతో ఆ వోట్లు ఖచ్చితంగా ఎటు పడతాయన్నది చెప్పడం కష్టం. కాని, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ ఎన్నికల సమయంలోనే ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకంవల్ల దళితులంతా తప్పకుండా టిఆర్‌ఎస్‌ ‌కే వోటు వేస్తారన్న గట్టి నమ్మకంతో ఉంది. రాబోయే శాసనసభ ఎన్నికలకు హుజురాబాద్‌ ఎన్నిక లిట్మస్‌ ‌టెస్ట్ అవుతుందనుకుంటున్న తరుణంలో కెసిఆర్‌ ‌కదిపిన ఈ పావు బిజెపి, కాంగ్రెస్‌ ‌గెలుపు ఆశకు చెక్‌ ‌పెట్టినట్లు అయింది.

Leave a Reply