బంగారం ధర ఆకాశానికి ఎగబాకింది. రోజు రోజుకీ సరికొత్త రేటుకి చేరుతోంది. రూపాయి తగ్గుతుంటే ఇరవై రూపాయలు పెరుగుతోంది. తాజాగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 54వేలకు చేరింది. ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో మదుపరులు బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో దాని ధర నానాటికీ పెరుగుతోంది. ఆగస్టు గోల్డ్ కాంట్రాక్ట్‌లో 10గ్రాములు రూ. 51,782 పలకగా ఆ తర్వాత రూ.52,220 వద్ద ఆల్‌టైమ్ రికార్డును తాకింది. ఇప్పుడు ఈ ధరకు కూడా దాటేసి 54 వేలకు చేరింది. దీంతో పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనాలంటే చుక్కలు కనిపించడం ఖాయం.
పసిడికి తోడు వెండి కూడా ఆల్ టైం రికార్డు వైపు పరుగులు పెడుతోంది. వెండి కిలో రూ.3347 పెరిగి రూ.66,400 పలికింది. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బంగారు వ్యాపారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. బంగారు ఆభరణాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ చేసే గడువును పెంచింది. 2021 జనవరి 15 చివరి తేదీ వున్న గడువును సవరిస్తూ 2021 జూన్ 1 వరకు గడువును పొడిగించింది.