Take a fresh look at your lifestyle.

నేడు తొలి టీకా..!

  • రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
  • తొలి దశలో 139 కేంద్రాలలో 13,900 మందికి
  • నేను కూడా టీకా తీసుకుంటా : మంత్రి ఈటల
  • ఎలాంటి అపోహలు వద్దు : డీఎంఈ డా.రమేశ్‌రెడ్డి

తెలంగాణలో కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాలలో 13,900 టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఎంపిక చేసిన అన్ని కేంద్రాలకు వ్యాక్సిన్‌ను తరలించారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌, ‌నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపిక చేసిన వారికి టీకా వేయనున్నారు. ఈ రెండు కేంద్రాలలో వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడనున్నారు. కాగా, టీకా తీసుకున్న వారిలో ఎవరికైనా సమస్యలు వస్తే చికిత్స కోసం 57 హాస్పిటళ్లలో ఏర్పాట్లు చేశారు. గాంధీ హాస్పిటల్‌లో 12 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేయగా, ప్రత్యేక వైద్య బృందాలను, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. కాగా, శనివారం తొలి విడత కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ అనంతరం వారంలో నాలుగు రోజులు సోమ, మంగళ, గురు, శనివారాల్లో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ యధావిధిగా కొనసాగనుంది.

నేను కూడా టీకా తీసుకుంటా: మంత్రి ఈటల
కోవిడ్‌ ‌టీకా తీసుకోవడానికి ఎలాంటి బలవంతం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. టీకా తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్న వారికే వేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను కూడా శనివారం గాంధీ హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌ ‌వేయించుకోనున్నట్లు తెలిపారు. గాంధీ హాస్పిటల్‌లో తొలి విడత వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభ కార్యక్రమంలో తనతో పాటు సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌హెల్త్ ‌సెక్రటరీ రిజ్వీ పాల్గొంటారని చెప్పారు. శనివారం కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తొలి డోస్‌ ఇస్తారనీ, 28 రోజుల తరువాత సెకండ్‌ ‌డోస్‌ ఇస్తారని చెప్పారు. మొదటి డోసు ఏ కంపెనీది ఇచ్చారో రెండో డోసు కూడా అదే కంపెనీది ఇస్తారన్నారు. డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ ‌మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్‌లో వైద్య సిబ్బందికి కూడా కొరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ఈటల చెప్పారు.

today first vaccination in telangana

ఎలాంటి అపోహలు వద్దు : డీఎంఈ డా.రమేశ్‌ ‌రెడ్డి
ఎలాంటి అపోహలు లేకుండా కోవిడ్‌ ‌టీకా తీసుకోవాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.రమేశ్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతా మహంతితో కలసి గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్‌ ‌టీకా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏ మందుకైనా కొందరిలో రియాక్షన్‌ ‌రావడం సహజమేననీ, లక్షల్లో వొకరికి కూడా రియాక్షన్‌ ‌వస్తుందని చెప్పలేమనీ, కోవిడ్‌ ‌టీకా విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. కిడ్నీ, గుండె జబ్బులు ఉన్న వారు సైతం వ్యాక్సిన్‌ ‌తీసుకోవచ్చని చెప్పారు. ప్రతి రెఫరల్‌ ‌హాస్పిటల్‌లో 10 నుంచి 20 బెడ్లు సిద్ధం చేశామన్నారు. 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణులకు, బాలింతలకు వ్యాక్సిన్‌ ఇవ్వకూడదనీ, అలాగే, రక్తం గడ్డ కట్టడం వ్రంటి సమస్య ఉన్న వారికి కూడా టీకా ఇవ్వరాన్నారు. కోవిడ్‌ ‌టీకా ఇవ్వడానికి ముందు లబ్దిదారుల వివరాలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎంఈ రమేశ్‌ ‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply