- అధికారంలోకి వొస్తే మేడారం అభివృద్ధి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- బడెట్‌పై తీవ్ర అసంతృప్తి
- రేవంత్ వొస్తున్నాడని రాత్రికి రాత్రే పట్టాలు : ఎంఎల్‌ఏ సీతక్క
- వైఎస్‌ఆర్ గుర్తొస్తున్నారు : షబ్బీర్ అలీ, మాజీ మంత్రి
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా పీసీసీ చేపడుతున్న హాత్• సే హాత్• జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం ములుగు నియోజకవర్గం పరిధిలోని పస్రా గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ములుగు నుంచి సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపిస్తే..ములుగు ఖ్యాతిని దిల్లీ వరకు తీసుకెళ్లారు. కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటుంది. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించింది. మేడారం నుంచే ఈ యాత్ర మొదలు పెట్టడానికి ఒక కారణం ఉంది. సమ్మక్క సారలమ్మ వన దేవతలు. నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారు.
కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన సమ్మక్క సారక్క పోరాడిన గడ్డ ఇది. సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ ఇది. అందుకే ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యాం. అధికారం అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదు…. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే. వైఎస్ చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్‌తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే..ఈ యాత్ర విజయవంతం అయినట్లే. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంది. కేసీఆర్ పాలనతో తెలంగాణ కోసం అమరుల ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తుంది. అమరుల త్యాగాలను ఈ ప్రభుత్వం మట్టి కప్పాలని చూస్తుంది. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా? నోటిఫికేషన్ల వేయకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వం కాలయాపన చేసింది.
ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా? భర్తకు ఫించన్ ఇస్తే భార్యకు పింఛన్ ఇవ్వకపోవడం సంక్షేమమా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికైనా వొచ్చాయా? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? తెలంగాణ వొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 25 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ. 20 వేల కోట్లు రావాలి. ములుగు రూ. 20 వేల కోట్లు వచ్చాయా? మరీ ఆ 25 లక్షల కోట్ల బడ్జెట్ ఎటు పోయింది? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా? తెలంగాణలో 10 శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా? రైతులు, నిరుద్యోగులకు,విద్యార్థులకు , బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలి. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుంది. చేంజ్ అనే నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నామని..ప్రతి వర్గాల్లో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. చేంజ్ రావాలంటే ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు రావాలి. కేసీఆర్ కు ఏమీ తెలియదు. ఎవరూ చెప్పిన వినడు. ఇటువంటి కేసీఆర్ మనకు అవసరమా?
రేవంత్ వొస్తున్నాడని రాత్రికి రాత్రే పట్టాలు : ఎంఎల్‌ఏ సీతక్క
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేశారు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ. పేదలకు బతుకుదేరువు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ములుగు నుంచి ఉంటుందని తెలిసిన స్వల్ప సమయంలో ఒక్క పిలుపుతో ఇంత మంది తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మీలో ఎంత ఉత్సహం ఉందో అర్ధమవుతోందని సీతక్క అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం ఆనాడు సమ్మక్క సారక్క పోరాడి అమరులయ్యారు. ఆ వనదేవతల ఆలయం నుంచి సోదరుడు రేవంత్ రెడ్డి యాత్ర ను ప్రారంభించడం సంతోషం. నేను పేదింటి బిడ్డనైనా… నన్ను మీరంతా అక్కున చేర్చుకున్నారు.
మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం సంతోషం. కాంగ్రెస్ ను అధికారంలోకి తీలుకొచ్చే వరకు చేతిలో చేయి వేసి.. అడుగులో అడుగేయాలి. రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేస్తుండ్రు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ. పేదలకు బతుకుదేరువు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేవరకు రేవంత్ అడుగులో అడుగేయాలని పిలుపునిచ్చారు. తాను పేదింటి బిడ్డనైనా అక్కున చేర్చుకున్నారని.. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మేడారం వనదేవతల ఆలయం నుంచి రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీతక్క అన్నారు.
వైఎస్‌ఆర్ గుర్తొస్తున్నారు : షబ్బీర్ అలీ, మాజీ మంత్రి
రేవంత్ యాత్రను చూస్తుంటే నాకు వైఎస్‌ఆర్ గుర్తొస్తున్నారు. ఆయన చెల్లెమ్మా అంటూ చేవెళ్ల నుంచి యాత్ర చేశారు. రేవంత్ సీతక్క అంటూ ములుగు నుంచి యాత్ర మొదలు పెట్టారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు సాగుతున్నాయి. వీటి నుంచి దేశాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా రాహుల్ సందేశాన్ని గ్రామ గ్రామాన తీసుకెళతాం. రాహుల్ స్ఫూర్తితోనే రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. పేదల ఇబ్బందులు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.