Take a fresh look at your lifestyle.

సామూహిక వ్యాప్తి దశకు.. కొరోనా

భారత దేశంలో కొరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) ‌దశకు చేరిందా ? వారం లోపే దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడమే ఇందుకు కారణమా ? దేశంలో రోజురోజుకూ భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ సామూహిక వ్యాప్తి ఇంకా ప్రారంభ దశలోనే ఉందనీ, ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వం కొరోనా
నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటి పోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కొరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో ఆ తరువాత వైరస్‌ ‌నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల  అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కోవిడ్‌ 19 ‌హాస్పిటల్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌కన్వీనర్‌ ‌డా.గిరిధర్‌ ‌గ్యాని దేశంలో కోవిడ్‌ 19 ‌సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందనీ, అయితే ఇప్పుడిప్పుడే అది అంతగా విస్తరించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొరోనా తీవ్రత దృష్ట్యా దేశం రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కునే అవకాశం ఉందనీ, భారీ సంఖ్యలో వైద్య చికిత్సలు అందించేందుకు అవసరమైన ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని తక్షణమే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కొరోనా నియంత్రణకు రానున్న 5 నుంచి 10 రోజులు అత్యంత కీలకమనీ, కొరోనా వైరస్‌ ‌లక్షణాలు ఉన్న వారిని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్య చికిత్సలు అందించిన పక్షంలో భవిష్యత్తులో సామూహిక వ్యాప్తి దశకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొరోనా వ్యాప్తిలో మూడో దశగా చెప్పుకునే సామూహిక వ్యాప్తి అత్యంత కీలకమనీ, దీనిని ఈ దశలోనే నియంత్రించని పక్షంలో దేశం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొరోనా వ్యాప్తిలో అతి కీలకమైన ఒకరి నుంచి మరొకరికి సోకే దశలోనే నియంత్రించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలనీ, లేనిపక్షంలో ఇది దేశమంతా విస్తరించి భారీ ప్రాణ నష్టానికి దారి తీస్తుందని డా.గిరిధర్‌ ‌గ్యాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply