ప్రవహించే నదిని ప్రశ్నిస్తే
ప్రశ్నలు ముక్కలవుతాయ్
దూరంగా కనుమరుగవుతున్న
శబ్దాలు వినవస్తాయ్!
‘ఒక నేను’ ‘ఒకప్పటి నేను’ ‘ఇప్పటి నేను’ –
‘‘నేను ఆలోచిస్తాను, కాబట్టి ‘నేను’న్నాను’’
పదార్థం నుంచే స్పందించాను కాబట్టి
ఇద్దరమూ ఉన్నాము..!
అది ముందు రూపొంది దాన్నుంచే
కొన్ని కల్పనలు ఊహలు ఆలోచనలు పుట్టి
అవేమో విజృంభించి-
ఇవే ముందేమో అనిపించేట్టు చేసిందేమో..!
కనుక్కోవాల్సింది వేరే సమాసం
ఒక్కో సిద్ధాంతం ఒక్కోదాన్ని లేపి
ఒక్కో ప్రతిపాదన ఇంకోదాన్ని సృష్టించి
ఉపచేతనలో నింపి అచేతనను తడుతుంది
తరచూ..బాహ్యంలోంచే అంతరం ఏర్పడుతూ..!
టక్కున గాల్లోంచి ఎగిరొస్తున్నట్లుంటాయ్
అకస్మాత్తుగా అరుస్తాం ‘యురేకా………’ అని
పరిగెడతాం బయటికి అన్నీ విడిచి
ఆ గాలీ పదార్థమే!
సహజమైన ప్రక్రియ
చుట్టూ వద్దన్నా చూడాల్సొస్తుంది
చుసినవన్నీ లోపలికెళుతుంటాయ్
ఆ కలయికల శృంఖలా
ఒక వంతెనను లేపుతుంది
దానెంటా వెళితే ఒక్కోసారి సగానికే
పొగ పొగలా రాలిపోతుంది!
ఇంకోమారు దాని అంతే తేలదు
పోతా పోతా ఎక్కడో వదిలేస్తాం
ఓపిక లేక అలసిపోతాం
లేదా నిద్రపోతాం కలతగానో ఆదమరచో..!
మళ్ళా ఏ భవిష్యత్ కొసలోనో
అరే అలాగే వెళ్ళుంటే- ‘ఈ పాటికీ…’
అని ఉదాహరణగా చెబుతాం
సంభావ్యతను కథలుగా మలిచి
ఒక ఆర్కిటైప్ లా భావించుకుంటూ..!
నిజమే ఎవరికి వాళ్ళం ఒక ‘నమూనా’లమే-
బలం బలహీనతల్లో
సామర్థ్యం పని ప్రకటనల్లో
తొక్కే దారుల్లో వెతికే శైలుల్లో
పద్ధతుల్లో విధానాల్లో వ్యవహారాల్లో..!
అందరం బయలుదేరుతాం
ఎక్కడెక్కడెక్కడో తచ్చాడుతాం
దేని కోసమో వెంపర్లాడతాం
ఆవిష్కరణల అంచుల గుండా..!
లేపోతే మరి ఉత్పత్తి అసంభవం కదా…
అది మాత్రం గాల్లోంచి రాదు ససేమిరా
ముక్కలవుతున్న ఆ ప్రశ్నలూ ప్రవహించాలె
నదితో పాటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే..!!!
– రఘు వగ్గు