నాలుగు రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికల నగరా మోగింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కేంద్రం తన చేతుల్లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని వినియోగించుకున్నదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ చేసిన ఆరోపణలో ఆవగింజంతైనా అసత్యం లేదు. మమతా బెనర్జీని సాగనంపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
ఆయన ప్రధాన సహచరుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు గడిచిన మూడు నెలల నుంచి చేస్తున్న హంగామా చూసిన వారికి ఒక మహిళను గద్దె దింపడానికి ఇంత భారీ ఎత్తున సన్నాహాలు అవసరమా అని చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా ఆమె మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమనీ, దాన్నెవరూ ఆపలేరని వ్యూహరచనా చతురునిగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు ప్రజల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. నిరంతరం ప్రజల్లో తిరుగుతూ, ప్రజల కోసం పని చేసేవారికి వోటమి ఉండదని చరిత్ర రుజువు చేస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడతలగా విస్తరింపజేయడం వెనుక కేంద్రం దురుద్దేశ్యం ఉందని మమత ఆరోపిస్తున్నారు.
నిజానికి శాంతి భద్రతలు ఇప్పుడు అక్కడ మరీ ఘోరంగా లేవు. దేశంలో దశలవారీగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే పద్దతి బీహార్, ఉత్తరప్రదేశ్‌ల కోసం ప్రవేశపెట్టారు. ఈ రెండు పెద్ద రాష్ట్రాలే కాకుండా, శాంతి భద్రతల పరంగా సమస్యాత్మక ప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రాలు. బీహార్‌లో జార్ఖండ్ కలిసి ఉన్నప్పుడు నక్సలైట్లు చెలరేగి బాంబుదాడులు జరిపేవారు. పోలింగ్ కేంద్రాలను ధ్వంసం చేసేవారు. బ్యాలెట్ పెట్టెలు ఎత్తుకుని పోయేవారు. అప్పటికిఇంకా ఈవీఎంలు రాలేదు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసులకు పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పూర్తిగా తొలగి పోయాయని చెప్పలేం కానీ, అంత తీవ్రంగా లేవు. అలాంటప్పుడు ఎనిమిది దశల్లో పోలింగ్‌ను నిర్వహించడం వెనుక రాజకీయ కోణాలున్నాయా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వొస్తుంది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగాల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా వాహన శ్రేణిపై దాడి జరిగిన మాట వాస్తవమే. అలాగే, బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో పలువురు తృణమూల్ కార్యకర్తలూ మరణించడమో, గాయపడటమో జరిగింది. అందువల్ల అక్కడ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు ఒకరి కొకరు తీసి పోకుండా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారన్న మాట వాస్తవమే. అయితే, తృణమూల్ కాంగ్రెస్‌ను రెచ్చగొడుతున్నది బీజేపీ వారేననడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. బెంగాల్ ప్రజలు సొంత కూతురిని కోరుకుంటున్నారనీ, కోడలిని కాదని(బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్ నాట్ పిషి) అనే నినాదాన్ని బీజేపీ తీసుకుని వొచ్చింది. తృణమూల్ అంతకుముందే బెంగాల్ వాంట్స్ ఇట్స్ ఓన్ డాటర్ అంటూ మమతా బెనర్జీనే ప్రజలు కోరుకుంటున్నారన్న నినాదాన్ని ప్రజల్లోకి విడిచి పెట్టింది. అయితే, నినాదాల కన్నా ప్రజలకు ఎవరు ఎక్కువ మేలు చేశారన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వోటర్లు స్పందిస్తారు.
బెంగాల్‌తో తనకు విడదీయరాని బంధం ఉందన్న మమతా బెనర్జీ మాటల్లో అసత్యం లేదు. ఆమెకు ఆ విశ్వాసం కలగడానికి కారణం ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం సాగిస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలు గుర్తించడం. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మమతా బెనర్జీని ఇరుకున పెట్టేందుకు సీబీఐని కాంగ్రెస్ హయాంలో కన్నా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. తాజాగా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యను బొగ్గు కాంట్రాక్టు కేసులో సీబీఐ అధికారులు ప్రశ్నించడాన్ని ఉదాహరణగా పేర్కొనవొచ్చు. మమతకు విశ్వాస పాత్రమైన పోలీసు అధికారులను ఇదివరకే బదిలీ చేశారు. తృణమూల్ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ ఒక్కొక్కరినీ తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇంత చేసినా బెంగాల్లో మమత పట్ల ప్రజాదరణ తగ్గకపోవడం కమలనాథులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఎన్నికల పోలింగ్ లోగా ఇంకా ఎన్నైనా అస్త్రాలను ప్రయోగించే అవకాశం ఉంది. బెంగాల్లో ముఖ్యమంత్రి పదవికి బీజేపీలో జనాకర్షణ కలిగిన నాయకులు, లేదా నాయకురాళ్ళులేరు. ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నా, వారికి ప్రజల్లో ఆదరణ లేదు. ఇక తమిళనాడు విషయానికి వొస్తే అన్నా డిఎంకెతో పొత్తుతో కనీసం కొన్ని సీట్లయినా సాధించవొచ్చని కమలనాథులు ఆశిస్తున్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించారు. ఆయన ఇప్పటికే తన పని ప్రారంభించారు. అందరినీ కలుసుకుంటున్నారు. అన్నా డిఎంకెకి జైలు నుంచి విడుదలైన శశికళ గ్రహణం ఉంది. ఆమె తానే జయలలిత వారసురాలినని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు.ప్రజలు ఆమె పిలుపునకు ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నా డిఎంకె శ్రేణుల్లో ఆమె పట్ల విధేయత గలవారున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి పళనిస్వామి, సీనియర్ నాయకుడు పన్నీర్ సెల్వం కలిసి పని చేసినా శశికళ ప్రభావాన్ని తప్పించుకోవడం కష్టం.
ఈసారి డిఎంకెకు పట్టం కట్టేందుకు జనం ఇంతకుముందే నిర్ణయించుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఉభయ డిఎంకెలు వంతుల వారీ అధికారాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఆ సంప్రదాయం అమలులోకి వొస్తే డిఎంకెకి పీఠం దక్కవొచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత పార్టీ పెట్టలేదు కనుక ఆయన ప్రభావం ఉండకపోవొచ్చు. కమల్ హసన్ ప్రభావం పెద్దగా ఉండదు. కేరళలో కూడా ఈసారి ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి అధికారం రావల్సి ఉంది. కాంగ్రెస్ నాయకత్వం చతికిలబడిపోయినందున మార్క్సిస్టులకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు ఎవరిని బలపరిస్తే వారికి అధికారం వొస్తుంది. పుదుచ్చేరి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.