Take a fresh look at your lifestyle.

అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే..

  • పరిశోధన, అభివృద్ధి వ్యవస్థ తప్పనిసరి
  • అందుకు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరం
  • విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలి
  • విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం కోసం పరిశోధన మరియు అభివృద్ధితో కూడిన పర్యావరణ వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇందు కోసం వాతావరణ మార్పులు, కాలుష్యం, ఆరోగ్యం, పేదరికం వంటి సమకాలీన సవాళ్ళను పరిష్కరించే ఫలిత-ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడం కోసం పరిశ్రమలు మరియు విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరమని ఆయన సూచించారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు సోమవారం నాడు పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. శాస్త్రవిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంలో సాగుతున్న అత్యాధునిక పరిశోధనల్లో భారతదేశాన్ని మిగిలిన దేశాలకంటే ముందు వరుసలో నిలపాలని నొక్కి చెప్పిన ఆయన, 1986లో ప్రారంభించిన పాండిచ్చేరి ఇంజనీరింగ్‌ ‌కాలేజ్‌ ‌ను పుదుచ్చేరి టెక్నలాజికల్‌ ‌యూనివర్సిటీ పేరిట, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత తొలి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ ‌డిజైన్‌, ‌తయారీ, డ్రోన్‌ ‌టెక్నాలజీ వంటి విభిన్న రంగాల్లో 15 అంకుర సంస్థలను విజయవంతంగా అభివృద్ధి మార్గంలో నడిపించడం కోసం ఇందులో ఇప్పటికే ఏర్పాటు చేసిన అటల్‌ ఇం‌క్యుబేషన్‌ ‌సెంటర్‌ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామిక రంగం మరియు ఆవిష్కరణ రంగాల్లో భారతదేశం నూతన శిఖరాలను అధిరోహిస్తుందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా అంకుర సంస్థలకు సరైన పరిస్థితులను కల్పిస్తున్న మూడో అతి పెద్ద దేశంగా భారతదేశం సగర్వంగా నిలబడడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ ‌భాగస్వామ్యాన్ని ప్రారంభించిన తర్వాత ఇందులో అనేక రకాల అంకుర సంస్థలు అభివృద్ధి చెంది, సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అంకుర సంస్థల్లో 45 శాతం సంస్థలు మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నిర్దేశకత్వంలో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఆరోగ్యకరమైన ధోరణి మరింత మంది మహిళలను పారిశ్రామిక రంగం దిశగా ప్రేరేపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవభారతానికి యువతే ప్రధాన బలమన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థులు దేశాన్ని ముందుకు నడిపించగలిగేలా నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగం వైపు యువత మరలేలా వారిలో పరిశోధన, ప్రయోగాల స్ఫూర్తి నింపాలని విశ్వవిద్యాలయాలకు సూచించారు.

స్వరాజ్యం సముపార్జించుకుని 75 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా సమాజంలో అక్కడక్కడా నిరక్షరాస్యత, పేదరికం, లింగ-సామాజిక వివక్షలు అభివృద్ధికి అవరోధాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ సామాజిక రుగ్మతలను రూపు మాపుతూ యువత నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా విద్యారంగం అత్యధికంగా ప్రభావితమైందన్న ఉపరాష్ట్రపతి, ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఉచిత టీకా కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో, కోవిడ్‌ అనంతర కాలంలోకి ప్రయాణిస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ ‌టీకా తీసుకోవడం ప్రతి ఒక్కరి పవిత్ర కర్తవ్యమన్న ఆయన, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గాల్లో టీకాకరణ జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. తరగతుల్లో ప్రత్యక్షంగా నేర్చుకునే విధానానికి, అంతర్జాల విద్య ప్రత్యామ్నాయం కాదన్న ఆయన, విద్యార్థులు తిరిగి పాఠశాలలు, కళాశాలలకు రావలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌డా. తమిళిసై సౌందరరాజన్‌, ‌పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌. ‌రంగసామి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply