టీఆర్ఎస్ ఆరేళ్లలో అభివృద్ధిపై దృష్టి సారించ లేదు: టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్
గడచిన ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ, సచివాలయం కూల్చివేతలపై తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ విమర్శించారు. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందనీ, అలాంటి నగరాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. మంగళవారం ఆయనిక్కడ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యక్షుడు ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు, హెచ్ఆర్డిఏ చైర్మన్ శ్రీశైల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాయప్ప, ముజాహిద్, నర్సయ్య, వినయ్, మేడ రవి, రాంచందర్‌తో కలసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగర ప్రజలు ప్రధానంగా కాలుష్యం, పౌర సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, రవాణా వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, పేర్కొన్నారు.
గత ఆరేళ్లలో రాష్ట్రంలో, మేయర్ స్థానంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యల పరిష్కారంపై ఎలాంటి చొరవ చూపలేదని పేర్కొన్నారు. సీఎంతో సహా మంత్రులు, అధికార పార్టీ నేతలంతా కేవలం వారి స్వలాభం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నదనీ, నగరంలో ప్రతీ కాలనీలో కాలనీ అసోసియేషన్లు ఉన్నప్పటికీ కనీసం వారితో సమస్యల పరిష్కారంపై సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. నగరంలోని ప్రతీ వంద మందిలో 80 శాతం మంది స్లమ్ ప్రాంతాలలో నివసిస్తున్నారనీ, వారి కోసం ఏం చేస్తున్నారో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొనలేదని చెప్పారు. టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొ.పీఎల్వీ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న కాలుష్యాం నివారణకు ఏ విధమైన చర్యలు చేపడతారో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొనకపోవడం శోచనీయమన్నారు. ప్రజల కోసం పోరాడే టీజేఎస్‌ను ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.