Take a fresh look at your lifestyle.

మానవుడి స్వార్ధానికి సమిధలవుతున్న పులులు…

జాతీయ చిహ్నాలు అనేవి ఒక జాతి యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో నివసించే జీవజంతువులు, ఆ జాతి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు మరియు సంస్కృతిని ప్రతిబింబించేవిగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. జాతీయ చిహ్నాలను ఎంచుకునే ముందు పై అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం పరిపాటి. భారత దేశ జాతీయ జంతువు ‘‘రాయల్‌ ‌బెంగాల్‌ ‌టైగర్‌’’ అని మనకు తెలుసు. అడవికి రాజైన మృగరాజు పులిని మన దేశ జాతీయ జంతువుగా ఎంచుకున్నామంటే పులుల పట్ల మనం చూపిస్తున్న ఆదరణ తేటతెల్లం అవుతుంది. హిందువులు పవిత్రంగా కొలిచే శక్తి స్వరూపిణి దుర్గా మాతకు వాహనం కావడం పులికి సంబంధించిన మరో ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది జూలై 29 నాడు జరుపుకుంటున్న ‘‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’’ గురించి తెలుసుకుందాం.

రష్యాలోని సెయింట్‌ ‌పీటర్స్బర్గ్ ‌నగరంలో 2010 సంవత్సరంలో పులుల సంరక్షణకు సంబంధించి జరిగిన ఒక సమావేశంలో పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ప్రతియేటా జూలై 29 రోజును ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’ గా పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పులుల సంచారానికి అనువైన సహజ ఆవాసాలను రక్షించడం, పులుల సంరక్షణార్ధం ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల సంఖ్యలో దాదాపు మూడోవంతు భారతదేశంలోనే ఉండడం విశేషం. 20వ శతాబ్దం ఆరంభంలో మన భారతదేశంలో పులుల సంఖ్య 40 వేలు దాటి ఉండేదని ఒక అంచనా. కానీ 1972 లో చేపట్టిన పులుల జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న పులులు రెండు వేల లోపేనన్న వాస్తవం వెలుగు చూసింది. ఇరవయ్యో శతాబ్దం రెండవ అర్ధ భాగంలో పలు కారణాల వల్ల ఆవరణ వ్యవస్థలు అసమతౌల్యతకు గురికావడం, తత్ఫలితంగా పులులకు అనువైన ఆవాస ప్రాంతాలు తగ్గిపోవడం మరియు పులులను వేటాడటం మొదలైన కారణాల వల్ల పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లుగా తెలుస్తున్నది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం 1970 సంవత్సరంలో దేశవ్యాప్తంగా పులుల వేటపై నిషేధం విధించడం, వన్యప్రాణి సంరక్షణా చట్టం, 1972 అమలు చేయడం గమనార్హం. ఆ తర్వాత మన దేశంలో 1973 లో ప్రారంభమైన ‘‘ప్రాజెక్టు టైగర్‌’’ ‌పులులు, పులుల ఆవాస ప్రాంతాల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలన్నింటిలోకెల్లా ప్రధానమైనది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పులుల ఆవాసం కోసం దేశ వ్యాప్తంగా పలు భౌగోళిక రీజియన్లలో కేటాయించబడిన ‘పులుల రిజర్వు ప్రాంతాలు’ పులుల సంఖ్యను పెంచేందుకు, వాటిని సంరక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 50 పులుల అభయారణ్య ప్రాంతాలు 37,761 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని పిలుపునిచ్చే ఒక ఒప్పందంపై 2010 సంవత్సరంలో భారత దేశం మరో 12 దేశాలతో సహా సంతకం చేసింది. 2006 సంవత్సరంలో నమోదైన పులుల సంఖ్య 1411 తో పోలిస్తే, 2014 లో మన దేశంలో ఉన్న పులుల సంఖ్య 2226 ను చేరుకోవడం ముదావహం. వరల్డ్ ‌వైడ్‌ ‌ఫండ్‌ ‌ఫర్‌ ‌నేచర్‌ (‌డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్‌) ‌వారి ఇటీవలి ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలో కేవలం 3890 పులులు మాత్రమే ఉన్నట్లు, అందులో 2967 పులులు మన దేశంలోనే ఉన్నట్లుగా తెలుస్తున్నది.

2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ పులి దినోత్సవం ‘వాటి మనుగడ మన చేతుల్లోనే….’ (దెయిర్‌ ‌సర్వైవల్‌ ఈజ్‌ ఇన్‌ అవర్‌ ‌హాండ్స్) అనే ఇతివృత్తం ఆధారంగా నిర్వహిస్తున్నారు. పారిశ్రామికీకరణ, నగరీకరణ, సహజ వనరులను మితిమీరి వినియోగించడం తదితర కారణాల వల్ల ఉత్పన్నమైన వాతావరణ మార్పులు, అక్రమంగా సాగే పులుల వేట, పులుల ఆవాసాల క్షీణత మొదలైన మానవుడి కార్యకలాపాలే పులుల సంఖ్య తగ్గడానికి కారణమన్నది నగ్న సత్యం. ఈ విశ్వం కేవలం మానవుడి కోసమే కాదు… సమస్త జీవకోటితో కలిసి సహజీవనం చేయడమే మానవుడి కర్తవ్యమని, అదే ప్రకృతి ధర్మమని పదేపదే హెచ్చరిస్తున్న ప్రకృతి ప్రియుల మాటలను గౌరవిస్తూ, పులుల సంరక్షణ కోసం మనమంతా మన వంతుగా కృషి చేసి పులులను మరియు సకల జీవకోటిని కూడా స్వేచ్ఛగా, సహజంగానే వాటి మనుగడ సాగించే పరిస్థితులు కల్పించేందుకు ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుందాం.
– మోహన్‌ ‌లింగబత్తుల
9398522294

Leave a Reply