హైదరాబాద్, ఫిబ్రవరి 3 : బయట పులిలా గర్జించిన గవర్నర్.. అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అన్నారు. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై కీలక జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్‌లో గవర్నర్ నడిచారని, తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య రాజీ కుదిరిందని.. చివరకు తుస్సుమనిపించారన్నారు.
సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే గవర్నర్ నడవక తప్పలేదని విమర్శించారు. కాగా అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ప్రసంగంపై ప్రభుత్వవర్గంలో చర్చ జరిగింది. ప్రసంగం చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలోని అంశాలను మాత్రం గవర్నర్ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, విధానాల ప్రస్తావన లేకుండానే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. దీంతో ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.