- విద్యావ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం
- కొత్త విధానంలో ఇంటర్ విద్య రద్దు
- నాలుగేళ్లుగా డిగ్రీ విద్యలో మార్పు
- కేబినేట్ వివరాలు వెల్లడించిన ప్రకాశ్ జవదేకర్
దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండ నున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యావిధానంలో మార్పులపై కేబినేట్ నిర్ణయాలను మంత్రి జవదేకర్ వ్నిడియాకు వెల్లడించారు. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు తీసుకువచ్చేందుకు తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానం – 2020కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ 21వ శాతాబ్దపు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యతన జరిగిన సమావేశంలో ఆమోద్ర వేసినట్లు చెప్పారు. 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరుగలేదని గుర్తు చేశారు.
దీన్ని మొత్తం సమాజం, దేశం, ప్రపంచ విద్యావేత్తలు స్వాగతిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని, 34 ఏళ్ల తర్వాత దేశంలో నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వచ్చిందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే తెలిపారు. ’నూతన విద్యా విధానం, సంస్కరణల అనంతరం 2035 నాటికి 50 శాతం స్థూల ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)ను సాధిస్తామని పేర్కొన్నారు. ఎన్ఈపీలో సంస్థల కోసం గ్రేడింగ్ చేయబడ్డ విద్యా, అడ్మినిస్టేట్రివ్, ఫైనాన్షియల్ స్వయం ప్రతిపత్తి, ఉన్నత కోసం ఒకే రెగ్యులేటర్, అనేక ’తనిఖీల’ స్థానంలో అనుమతుల కోసం స్వీయ వెల్లడి ఆధారిత పారదర్శక వ్యవస్థ కింద పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ’మన దేశంలో 45వేల అనుబంధ కళాశాలలు ఉన్నాయని, గ్రేడెడ్ స్వయం ప్రతిపత్తి కింద, అకడమిక్, అడ్మినిస్టేట్రివ్, ఫైనాన్షియల్ స్వయం ప్రతిపత్తి వారి అక్రిడిటేషన్ స్టేటస్ ఆధారంగా కాలేజీలకు ఇవ్వబడుతుందని చెప్పారు.
ప్రాంతీయ భాషల్లో ఈ-కోర్సులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వర్చువల్ ల్యాబ్లను అభివృద్ధి చేసి నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (నెట్ ఎఫ్) రూపొందిస్తున్నట్లు ఖరే వివరించారు. ఎన్ఈపీ 2020 రూపకల్పనలో విస్తృత సంప్రదింపుల పక్రియను అవలంభించామని తెలిపారు. మొత్తం 2.5లక్షల గ్రామ పంచాయతీలను ఆన్లైన్ వేదిక ద్వారా సంప్రదించామని, ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్లు, విద్యావేత్తలు, సామాన్య ప్రజల అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం..ప్రస్తుతం ఉన్న 10 ప్లస్ 2 ప్లస్ 3 అంటే పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విధానాన్ని 5ప్లస్ 3ప్లస్ 3ప్లస్ 4 మర్చారు. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. కొత్త విధానంలో ఇంటర్ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్ కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. కాగా, బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.