- పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మరింత కట్టుదిట్టం
- సాయుధ బలగాలతో పాటు బారికేడ్ల నిర్మాణం
- ప్రభుత్వ తీరును తప్పుపట్టిన రైతు సంఘాలు
6న రోడ్లను దిగ్బంధిస్తామని వెల్లడి - కావాలనే రైళ్లను దారి మళ్లిస్తున్నారని మండిపాటు
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అగ్రిచట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఘాజీపూర్ దగ్గర భారీ ఫెన్సింగ్‌తో పాటు ఢిల్లీ,యూపీ పోలీసులు పహరా కాస్తున్నారు. సింఘు,టిక్రి సరిహద్దుల దగ్గర హర్యానా, ఢిల్లీ పోలీసులు మోహరించారు. జనవరి 26 తరహాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. మరోవైపు రైతులు మాత్రం కొత్త అగ్రిచట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని చెప్తున్నారు. స్థానికుల రాకపోకలకు ఆటంకం కలిగించేలా బారికేడ్లు అడ్డు పెట్టడాన్ని తప్పు పడుతున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
జనవరి 26 ఘటనపై ఇప్పటికే 200 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో 32 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 40 మంది రైతు సంఘాల నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ క్రై బ్రాంచ్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసులను పరిశీలిస్తున్నారు.మరోవైపు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళలను చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంతో ఎన్ని సార్లు చర్చలు జరిపినా కూడా రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీంతో ఆందోళనను మరింత ఉధృతం చేయాలని భావిస్తూ ఉన్నారు. దీంతో రైతులు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా రాస్తా రోకో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్బంధిం చనున్నట్టు రైతుల సంఘాలు ప్రకటించాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బ్జడెట్లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్పుకొచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా మని అన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లన్నీ దిగ్బంధించి నల్ల చట్టాలపై నిరసన తెలపాలని మంగళవారం రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. జనవరి 26న జరిగిన విధ్వంసం అనంతరం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వారు విమర్శిస్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన జరుగుతున్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేయడాన్ని, వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని మోహరించడాన్ని రైతులు ఖండిస్తున్నారు.
దేశ రాజధాని నగరంలోని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను అణచివేసేందుకు రైల్వేశాఖ పలు రైలు సర్వీసులను రద్దు చేయడం, దారి మళ్లించడం చేస్తుందని రైతు సంఘాలు ఆరోపించాయి. ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైతులు వస్తున్న రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లించడం, రైలు సర్వీసులను రద్దు చేయడం చేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ కొక్రికలాన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని భటిండా, మాన్సా, ఫిరోజ్ పూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి వస్తుండగా రైళ్లను సరిహద్దుల్లోనే నిలిపివేశారని సుఖ్ దేవ్ సింగ్ చెప్పారు. రైళ్లను రద్దు చేయడం, దారిమళ్లించటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
రైతులు ఆందోళనను కొనసాగించేందుకు ట్రాక్టర్లు, బస్సులు,ట్రాలీలు, టెంపోల్లో తరలివస్తున్నారని కొక్రికలాన్ వివరించారు.వెయ్యిమంది రైతులు రైలులో ఢిల్లీకి వస్తుండగా టిక్రి సరిహద్దుకు నాలుగుకిలోవి•టర్ల దూరంలోని బహదూర్ ఘడ్ వద్ద దించివేశారని చెప్పారు. గంగానగర్-ఓల్డ్ ఢిల్లీ రైలును కూడా బహదూర్ గఢ్ వద్ద నిలిపివేశారు. ముంబై సెంట్రల్ నుంచి వచ్చే అమృత్ సర్ స్పెషల్ రైలును జనవరి 13 నుంచి దారి మళ్లించారు.దర్బంగా-అమృత్ సర్ స్పెషల్ రైలు కూడా రద్దు చేశారు.