- మరో మోటార్ ఒకట్రెండు రోజుల్లో నడిపిస్తాం
- అబ్జర్వేషన్లో ఉంచాం
- మంత్రి హరీష్‌రావు దగ్గరుండి అన్నీ పర్యవేక్షించారు
- నాణ్యతలో రాజీ పడలేదు
- మునుగుడు కాదూ, మెట్ల వరకు నీళ్లొస్తాయి…
- ‘ప్రజాతంత్ర’తో ఇరిగేషన్ ఎస్ఈ కెఎన్.ఆనంద్
చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ కొత్త ప్రాజెక్టు కావడంతో ఒకేసారి నీళ్లను విడుదల చేయడం కుదరదనీ సిద్ధిపేట జిల్లా ఇర్రిగేషన్ ఎస్ఈ కెఎన్.ఆనంద్ తెలిపారు. కొత్త ప్రాజెక్టు కావడం వల్ల పంపింగ్ చేసే మోటార్లను, ఇతరత్రా అన్నింటిని అబ్జర్వేషన్లో ఉంచామే తప్ప మరొకటి కాదన్నారు. ప్రాజెక్టులో ఉన్న 4 మోటార్లు 135మెగావాట్ల పంపులేననీ వీటిలో గురువారం నాటికి మూడు మోటార్లు నాన్‌స్టాప్‌గా నడుస్తున్నాయన్నారు.
ఈ మేరకు గురువారమిక్కడ ఎస్ఈ ఆనంద్ ‘ప్రజాతంత్ర’ప్రతినిధితో మాట్లాడుతూ…ప్రాజెక్టు ప్రారంభించి వారం రోజులు కూడా కాకముందే మోటార్లన్నీ నడువడం లేదనీ, హీట్ అవుతున్నాయనీ, మోటార్లను నిలిపివేశారనీ, ప్రాజెక్టులో నాణ్యత లోపించిందనీ, ముఖ్యంగా రిజర్వాయర్‌లో రివిట్‌మెంటు కాలువ కూలిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. వాస్తవానికి ఈ రంగనాయకసాగర్ రిజర్వాయర్ ప్రారంభం నుంచి తమ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పనులన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించారన్నారు. మంత్రి హరీష్‌రావు ఒక ఇంజినీర్ వలే అన్నీతానై ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారనీ, అన్నీ బాగున్నాయన్న తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకుండానే రిజర్వాయర్‌లో నాణ్యత లోపించిందనీ, రివిట్‌మెంటు కాలువ కూలిందంటూ ప్రచారం జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు కొత్తది కావడంతో ఒకేసారి అన్ని నీళ్లను విడుదల చేయడం లేదన్నారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే సిమెంటు లైనే కాదూ రాళ్లతో నిర్మించిన కట్ట మునగడమే కాకుండా మెట్ల వరకు నీళ్లొస్తాయన్నారు. రిజర్వాయర్ వద్ద ఉన్న నాలుగు మోటార్లలో మూడు మోటార్లు నిరంతరాయంగా నడుస్తున్నాయనీ మరో మోటార్‌ను శుక్ర, శనివారాలలో నడిపిస్తామన్నారు. అనంతగిరి రిజర్వాయర్ ప్రారంభ సమయంలోనూ మోటార్లు మొదట్లో కొంత వరకు సతాయించాయన్నారు. కొత్త మోటార్లు కావడం 135మెగావాట్ల పంపు సామర్ధ్యం కావడం వల్ల ఈ మోటార్లు కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు.

ప్రస్తుతం అన్నింటినీ తాము అబ్జర్వేషన్లో పెట్టామన్నారు. కొత్త మోటార్లు కావడం వల్ల హీట్(వేడి)అనేది సర్వసాధరణమైన విషయమన్నారు. కొత్త ప్రాజెక్టు, కొత్త మోటార్లు కావడం వల్ల పలు సాంకేతిక లోపాలూ తలెత్తడం సాధరణమేననీ దీనిపై లేనిపోని దుష్ప్రచారాలు చేయడం ఎవరికీ కూడా తగదన్నారు. అన్నీ చిన్న చిన్న సమస్యలేననీ, అవన్నీ ఒకట్రెండు రోజుల్లో సమసిపోతాయన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టు వద్ద వాతావరణమంతా బాగుందనీ, మోటార్లన్నీ బాగున్నాయనీ ఎలాంటి సమస్యలు లేవన్నారు. రానున్న రోజులలో అన్ని మోటార్లు నడుస్తాయనీ దీంట్లో ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దనీ ఎస్ఈ కెఎన్ ఆనంద్ స్పష్టం చేశారు.