తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వాడివేడిగా సాగాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే ఉదయం 11.30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 1.30కి ముగించారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతుండగానే సభా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను నిర్వహించడంపై బీజేపీ సభ్యులు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆందోళన విరమించాలని బీజేపీ సభ్యులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సర్ది చెప్పినప్పటికీ వారు వినకుండా బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతుండటంతో మంత్రి తలసాని బిజేపీ సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానించడంతో స్పీకర్ పోచారం ఆమోదించారు.
స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఉండటంతో మార్షల్స్ వారిని బలవంతంగా ఎత్తుకుని వెళ్లి బయటకు తీసుకువెళ్లారు. ఆ తరువాత స్పీకర్ వైఖరికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.