వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మూడు తరాల, యాభై వసంతాల విరసం

January 10, 2020

Three generations, fifty spring breaksనవయవ్వన తేజానికి యాభై ఏళ్లు వచ్చాయి. యాభైలోనూ యవ్వనోత్సాహమే. తెలుగునేల నుండి దిక్కుల్ని మండించిన వేడి నెత్తుటి అక్షరాలు, సంకెళ్లతో స్వేచ్ఛారావం వినిపించిన విప్లవ కలాలు కల్లోలాలను తట్టుకుంటూ అలసిపోక, విశ్రమించక, బెదిరిపోక, తలవంచక, రాజీపడక కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళ పోరాటపు అగ్గిని, విప్లవ విద్యార్థుల సవాలును స్వీకరించి, రాజీలేని వైఖరి రచయితకు తప్పనిసరి అని, నిజాన్ని వెల్లడించడంలో రచయితలు భయసంకోచాలను విడిచి ప్రజలకు బాసటకావాలని, తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలని ప్రకటిస్తూ వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలను తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపన కోసం పాటుపడతామని, సోషలిజం మా లక్ష్యమని 1970 జులై 3-4 అర్ధరాత్రి చరిత్ర ఎదమీద సంతకం చేసి హామీ పడింది విప్లవ రచయితల సంఘం. ఆనాడు సంతకం చేసిన పద్నాలుగు మంది రచయితల్లో వరవరరావు నేడు తన ఎనభై ఏళ్ల వయసులో ఆశయానికి కట్టుబడి జైల్లో ఉన్నారు. ఆనాడు సంతకం చేసిన యవతరం పునర్జీవిస్తున్నట్లు యాభై ఏళ్ల విరసంలో నేడు పాతికేళ్లలోపు యువకులు ఇప్పటి కల్లోలంలోనూ సృజనాత్మక ధిక్కారం వినిపిస్తున్నారు.మూడు తరాల ప్రాతినిథ్యంతో నవనవోన్వేషణ, ఎప్పటికప్పుడు ఎదురొచ్చే సామాజిక, రాజకీయార్థిక అంశాలపై సునిశిత పరిశీలన, సైద్ధాంతిక విశ్లేషణ, వందలాది రచయితల్ని ప్రభావితం చేసిన సాంస్కృతికోద్యమ కార్యకర్తృత్వం ప్రపంచంలో విరసానికి మాత్రమే సాధ్యమైందనంటే అతిశయోక్తి కాదు. వర్గపోరాట శాస్త్రీయ అవగాహనతో, విప్లవ సృజనాత్మక వికాసంతో సమాజానికి తాను ఎంత అందించిందో సమాజం నుండి అంత నేర్చుకుంది. లేకపోతే ఈ కొనసాగింపే ఉండేది కాదు.

విరసంలో అందరికన్నా పెద్దవయసు ఉన్న కామ్రేడ్‌కు ఎనభై అయిదేళ్ల వయసు ఉండొచ్చనుకుంటాను. ఈ ఏడాది విరసం సభ్యత్వం తీసుకున్న కామ్రేడ్‌కు ఇరవై మూడేళ్లు. మొదటి అధ్యక్ష, కార్యదర్శుల తరం దాటి రెండో తరం, మూడో తరం నాయకత్వం సంస్థకు ఎదిగి వచ్చింది. సుమారు పదిహేనేళ్ల క్రితం సీనియర్‌ ‌సభ్యులెవరూ విరసం కార్యవర్గంలో ఉండకూడదని నిర్ణయం తీసుకుని పూర్తిగా కొత్తతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి తామంతట తాముగా సాధారణ సభ్యులుగా కొనసాగతూ ఉండడం సంస్థ సజీవత్వానికి ఒక కొత్త నమూనా, భవిష్యత్తుకు గొప్ప భరోసా. ఒక సంఘం బతికి ఉండడమంటే ఇది. ఒక ఆశయం కొనసాగడమంటే ఇది. బహిరంగ సభలు, ధర్నా శిబిరాలు, ఊరేగింపులు, నిజనిర్ధారణలు, క్షేత్రస్థాయి పర్యటనల నుండి సాహిత్య వర్క్ ‌షాప్‌లు, సైద్ధాంతిక చర్చలు, సెమినార్ల దాకా, గోడ మీది నినాదం నుండి అద్భుత కాల్పనిక కథ, నవల దాకా విస్తరించిన జీవనది విరసం.

Three generations, fifty spring breaks1970లాగా ఇప్పడు కాలం విప్లవాలకు ప్రతికూలం కావొచ్చు. ఉద్యమాలు గాయపడిఉండొచ్చు. ఫాసిజం కోరలు విప్పి ప్రజా ఉద్యమాల ఉనికిని మింగివేయాలని బుసలు కొడుతూ ఉండొచ్చు. విరసం ఇంకా బతికి ఉంది. రాజ్యాన్ని ధిక్కరిస్తూనే ఉంది. ప్రజల పక్షానే స్థిరంగా నిలబడి ఉంది. విరసంలో ఉండడమంటే బాధ్యతతో కూడిన సాహసం కలిగి ఉండడం. విరసంతో ఉండడమన్నా ఎంతో కొంత ఇంతే. విరసం సభ్యుల కన్నా విరసం మిత్రులు ఎన్నో రెట్లు ఎక్కువ అని మొదటి మహాసభల నుండి నేటి వరకు కార్యదర్శులు ప్రకటిస్తూనే ఉన్నారు. విరసం బలం ఇది మాత్రమే కాదు. యాభై ఏళ్లుగా ప్రతిరోజూ విమర్శిస్తున్న వాళ్లు ఉండడం (సహేతుకంగా కావొచ్చు, అహేతుకంగా కావొచ్చు) కూడా ఒక సంఘానికి ఎంత బలం!
– పి.వరలక్ష్మి

Tags: p varalakshmi, kamred, future generation, young peoples

Summary
మూడు తరాల, యాభై వసంతాల విరసం
Article Name
మూడు తరాల, యాభై వసంతాల విరసం
Description
నవయవ్వన తేజానికి యాభై ఏళ్లు వచ్చాయి. యాభైలోనూ యవ్వనోత్సాహమే. తెలుగునేల నుండి దిక్కుల్ని మండించిన వేడి నెత్తుటి అక్షరాలు,
Author
Publisher Name
Prajatantra
Publisher Logo