Take a fresh look at your lifestyle.

ఏపిలో ‘మూడు రాజధానుల’ చిచ్చు

ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తాజా శాసనసభ చివరి రోజున చేసిన మూడు రాజధానుల ప్రకటన పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. నిన్నటి వరకు కేవలం వైఎస్‌ఆర్‌ ‌పార్టీకి, తెలుగుదేశం పార్టీ మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రభుత్వం, ప్రజల మధ్య కొనసాగడానికి ఈప్రకటన కారణమైంది. ఇది రాష్ట్ర ప్రజ)ను, రాజకీయపార్టీలను రెండువర్గాలుగా చీల్చింది. మేధావి వర్గాల్లో కూడా ఈ విషయంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఒక్క ప్రకటన ఆడమగ తేడా లేకుండా ప్రజలందరినీ రోడ్లమీదకు ఈడ్చినట్లైంది. కాగా, అదనంగా రాజధానులను ఏర్పాటు చేస్తామన్న విశాఖ, కర్నూల్‌ ‌ప్రాంతాల్లో మాత్రం హర్షాధిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అసహనమంతా రాజధాని కోసం అమరావతిలో తమ భూములను ఇచ్చిన వారిలో ఏర్పడింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయకుండా మూడు ముక్కలుగా విడదీస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని పురుగుల మందు డబ్బాలను పట్టుకుని దీక్ష చేస్తున్నారు అక్కడి రైతులు. గత ప్రభుత్వం ఓ రెండేళ్ళపాటు అనేక సర్వేలు చేసి, నిపుణులతో చర్చించిన అనంతరం అమరావతే రాజధానికి అన్నివిధాలుగా అనుకూలమని భావించింది.

ఆమేరకు అక్కడ సుమారు ముప్పైవేలా ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక రైతలను ఒప్పించి, మెప్పించి తీసుకుంది. రాజధాని ఏర్పాటు తర్వాత వారికి తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని వారికి హామీ కూడా ఇచ్చింది. ఎలాగూ రాజధాని వొస్తుంది కాబట్టి భూములు పోయినా, తమకిచ్చే పరిహారంతో పాటుగా, కొద్దో గొప్పో మిగిలిన ప్లాట్లకు అనూహ్యంగా ధరపలికే అవకాశం వొస్తుందన్న ఆశతో రాజధాని నిర్మాణపై ఇంతకాలం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్న క్రమంలో ఇప్పుడు వైఎస్‌ ‌జగన్‌ ‌చేసిన ప్రకటన వారిపై పిడుగు పడినట్లైంది. తమలో ఎన్నో ఆశలు చూపించి, ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం వారి నుండి తీసుకున్నారు. ఒక విధంగా ఆ భూములను వారు త్యాగం చేశారనే చెప్పాలె. అలాంటి పరిస్థితిలో తమ నోటిముందు అందే ముద్దను ఒక్కసారే వెనక్కు లాగుకున్నట్లు అయిందంటూ ఇప్పుడు వారు వాపోతున్నారు. జగన్‌ ‌తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు తప్పిదం కూడా ఒక కారణమంటూ వారు ఆరోపిస్తున్నారు. భూములు తీసుకున్నప్పుడు తమకు ఇస్తానన్న ప్లాట్లను చట్టబద్దం చేయకుండా గాలికివదిలివేయడవల్ల తామిప్పుడు కుడితిలో పడ్డ ఎలకల్లా తయ్యారయ్యామని వాపోతున్నారు. రాజధాని విషయంలో ప్రజలకు గాని, ప్రజాప్రతినిధులకు గాని ఏమాత్రం క్లారిటీ లేకుండా అన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసి ఒక విధంగా తమను మోసంచేశాడంటూ వారు ఆరోపిస్తున్నారు. తాజా శాసనసభ సమావేశాల్లో ఆయన ఒకసారి రాజధాని నిర్మాణ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య జరిగిందని ఒకసారి, ప్రైవేటు కంపెనీకి ఇచ్చామని ఒకసారి చెప్పిన విధానంలోనే చంద్రబాబు తమను మసిబూసిమారేడు కాయ చేసినట్లు స్పష్టమవుతున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అస్పష్ట విధానం వల్ల రాజధానికోసం భూములిచ్చిన సుమారు ఇరవై నాలుగు వేల మంది రైతుల భవిష్యత్‌ ఆం‌దోళనకరంగా మారిందని వారు ఆక్రోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే జగన్‌ ‌తాజాగా చేసిన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని వారిప్పుడు డిమాండ్‌ ‌చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంతో సహా ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. కొందరు రైతులు తమకిక విషమే గతి అని పురుగుమందు డబ్బాలు చేతపట్టుకుని ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని,, అయితే పాలనాపరమైన వికేంద్రీకరణ కాకుండా, పారిశ్రామిక వికేంద్రీకరణ జరుగాలన్నదే తమ డిమాండ్‌ అం‌టున్నారు. రాజకీయపార్టీల మధ్య ఉండే వైశమ్యాలు పాలనలో చూపించడం సరైంది కాదంటూ, గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు చేపట్టదలుచుకుంటే తమ భూములను తమకు వెనక్కిచ్చిన ఇష్టం వొచ్చిన రీతిలో పాలన సాగించుకోవచ్చని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి పరిసర ప్రాంతాల్లో రాజధానికోసం తమ భూములు అప్పగించిన వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన కొందరు నాయకులు జగన్‌ ‌తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని పనులు కొన్ని ప్రారంభమై మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, తమ భూముల నుండి రాజధాని అవసరాలకోసం పక్కా రోడ్లను కూడా వేశారని, ఇలాంటి పరిస్థితిలో తమ భూముల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే జగన్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామంటున్నారు కొందరు టిడిపి నేతలు. దీనివల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ ‌క్యాపిటల్‌గా, కర్నూల్‌ను జ్యుడిషియల్‌ ‌క్యాపిటల్‌గా, అమరావతిని చట్టసభలకు రాజధానిగా విడగొట్టాలని ఏపి సిఎం జగన్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని తుగ్లక్‌ ‌చర్య అంటున్నాడు మాజీ సిఎం, ఏపి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. పదిరోజుల్లో నిపుణుల కమిటీ దీనిపై సమగ్ర నివేదిక ఇస్తుందంటూనే ముందస్తుగా ప్రకటన చేయడం వెనుక ఏదో పెద్ద ప్రణాళికే ఉందంటున్నారాయన. దీనివల్ల ప్రజలు మూడు ప్రాంతాలను చుట్టబెట్టాల్సి వొస్తుందంటున్నారు నిపుణులు. కాగా, దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని జగన్‌ ‌పేర్కొనడంపై, ఇప్పటికే ఆ దేశం తమ తప్పిదాన్ని సవరించుకునే పనిలో పడింది. ఆదేశ మాజీ అధ్యక్షుడు పార్లమెంటులో ఈ వ్యవస్థ కారణంగా దేశం ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని సోదాహరణంగా వివరించిన క్లిప్పింగ్‌లు ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో ప్రదర్శింపబడుతున్న క్రమంలో, దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంత్తైనా ఉందంటున్నారు విశ్లేషకులు.

Tags: 3 capital city names, amaravathi, Ap govt, ys jagan

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy