“కొత్తగా ఏర్పాటు చేయ బడే జాతీయ మెడికల్ కమిషన్ లో సెంట్రల్ కమిటీ లో 25 మంది సభ్యులు ఉంటారు .చైర్మన్, 12 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ,ఎక్స్ అఫీషియో మెంబర్ సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్లో ఐదుగురు మాత్రమే వైద్యులు కాగా మిగిలిన వారు బ్యూరో క్రాట్లు లా గ్రాడ్యుయేట్స్ , చార్టర్ అకౌంటెంట్ లు ఉంటారు. అయితే ఈ ఏర్పాటును వైద్య వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కమిషన్ ఐదు రాష్ట్రాలకే ప్రాధాన్యం దక్కేలా ఉందని ,కమిటీలో మెజార్టీ సభ్యులు డాక్టర్లే ఉండాలని వైద్య వర్గాలు అంటున్నాయి . వైద్య వృత్తి తో సంబంధం లేని బయటి వాళ్లు వైద్యవృత్తిని నియంత్రించే కమిషన్లో సభ్యులుగా నియమించాలనుకోవడం హాస్యాస్పదం.“
‘‘ఆరోగ్యమే మహాభాగ్యం ‘‘అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సక్రమమైన ఆలోచనలు వస్తాయి ,సరిఅయిన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటాము. సరైన ఆలోచనతో చక్కగా పని చేయడం జరుగుతుంది .అప్పుడు ఆర్థిక పరిపుష్టి కలిగి ఆరోగ్యవంతమైన, ఆదర్శవ ంతమైన, సమాజం ఏర్పడు తుంది. తద్వారా వ్యక్తిగత అభివృద్ధి నుండి సమిష్టిఅభివృద్ధితో తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుంది. ‘‘ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది’’ అటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, పటిష్టమైన వైద్య రంగాన్ని తయారు చేసుకోవాలి .అందుకని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను 1934లో ప్రారంభించారు . అటు తరువాత మెడికల్ కౌన్సిల్ ఆక్ట్ 1956 ను తీసుకువచ్చి 1964 ,1993 మరియు 2001లో సవరణలను తెచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశమంతా ఒకే విధమైన ప్రమాణాలతో కూడిన వైద్య విద్యను గ్రాడ్యుయేట్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అందజేసే విధంగా ,నూతన మెడికల్ కాలేజీలో స్థాపనకు ,విస్తరణకు అనుమతులు ఇవ్వడం మరియు వైద్య వృత్తిని చేపట్టే వారి రిజిస్ట్రేషన్ చేయడం ,వైద్య వృత్తిని చేపట్టిన వారు కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించే లాంటివి రెగ్యులేషన్ చేసే సంస్థగా పనిచేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 542 మెడికల్ కాలేజీలు, 64 పోస్ట్ గ్రాడ్యుయేట్ సంస్థలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలో పని చేస్తున్నాయి .కాలేజీల ఏర్పాటుకు జరిగే తనిఖీలలో అవినీతి, సీట్లు పెంచే విషయంలో ,కాలేజీలో నిబంధనల ప్రకారం వసతుల కల్పన ఏర్పాటులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవకతవకలకు పాల్పడుతుందని , అవినీతి పేరుకుపోయింది అని 2015లో నీతి అయోగ్ వైద్య రంగంలో సంస్కరణలను ప్రతిపాదిస్తూ …. 2017 డిసెంబర్ లో జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా, దేశవ్యాప్తంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్ల నిరసన ప్రదర్శనలు, సమ్మెలు ,ధర్నాలు జరగడంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు పెట్టారు.
వైద్య విద్యలో ప్రవేశాలు ,పరీక్షలతో పాటు ఆరోగ్య రంగంలో ఎన్నో కీలక అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. వైద్య విద్యతో పాటు వైద్య రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ బిల్లుపై భిన్న వైరుధ్యాలతో కూడిన అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో భారతీయ వైద్య మండలి అనుసరించిన నియమ నిబంధనలను సరళీకృతం చేయడం జరిగింది. ఈ సరళీకరణ తో ఎవరికి లాభం జరగనుందో, దేశాభివృద్ధికి ఎలా మేలు కలుగుతుందో కానీ ప్రజారోగ్యానికి ముప్పుతో పాటు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లను తయారు చేసే అవకాశం ఉందని మేధావులు ,డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు….. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు గురించి, అందులోని ప్రతిపాదన లు అభ్యంతరాల గురించి చర్చించుకుందాం……. ఇప్పటివరకు భారత వైద్య మండలి లో చైర్మన్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సెంట్రల్ కమిటీ లో ఎనిమిది మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒక్కరూ, రాష్ట్ర వైద్య మండలి నుంచి ఒక్కో ప్రతినిధి ,అన్ని ఆరోగ్య విశ్వవిద్యాలయాల నుంచి ఒక్కో ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేయ బడే జాతీయ మెడికల్ కమిషన్ లో సెంట్రల్ కమిటీ లో 25 మంది సభ్యులు ఉంటారు .చైర్మన్, 12 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ,ఎక్స్ అఫీషియో మెంబర్ సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్లో ఐదుగురు మాత్రమే వైద్యులు కాగా మిగిలిన వారు బ్యూరో క్రాట్లు లా గ్రాడ్యుయేట్స్ , చార్టర్ అకౌంటెంట్ లు ఉంటారు. అయితే ఈ ఏర్పాటును వైద్య వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కమిషన్ ఐదు రాష్ట్రాలకే ప్రాధాన్యం దక్కేలా ఉందని ,కమిటీలో మెజార్టీ సభ్యులు డాక్టర్లే ఉండాలని వైద్య వర్గాలు అంటున్నాయి .
వైద్య వృత్తి తో సంబంధం లేని బయటి వాళ్లు వైద్యవృత్తిని నియంత్రించే కమిషన్లో సభ్యులుగా నియమించాలనుకోవడం హాస్యాస్పదం….. ఇంజనీర్లను చార్టెడ్ అకౌంటెంట్ లను డాక్టర్లు నియంత్రిస్తే ఎలా ఉంటుంది?? రాజకీయ నాయకులు బార్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉండి నడిపిస్తారా ? ఆర్టీసీ డ్రైవర్, రైలు ఇంజన్ నడిపే చందంగా ఉంటుందంటున్నారు మేధావులు….. ఎంసీఐ లో అవినీతి కారణంగా 69 కళాశాలలో అవకతవకలు జరిగాయని, ఎంసీఐ లో దొరికిన కొందరు అవినీతి పరుల కంటే నీతిపరులా? ఈ డాక్టర్లు కాని వాళ్లు సభ్యులుగా ఉన్న ఈ కొత్త బిల్లు అవినీతిని ఎలా నిరోధిస్తుంది?…. నేషనల్ కమిషన్ బిల్లు అమలైతే వైద్య రంగంతో సంబంధం లేని వారికి వైద్యులు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. హోమియో ,ఆయుర్వేద కోర్సులు చేసినవారికి బ్రిడ్జ్ కోర్స్ అందించి ఆధునిక వైద్యం ప్రాక్టీస్ చేపట్టేందుకు అనుమతించడం అభ్యంతరకరం… పూర్తిస్థాయిలో కోర్సు చదివి ఒక సంవత్సరం పాటు ఆస్పత్రిలో పని చేసిన ఎం బి బి ఎస్ డాక్టర్లే చికిత్స చేయడంలో తడబడుతున్నారు. బ్రిడ్జి కోర్సు చదివిన వారికి అనుమతించడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమే అని వైద్య నిపుణులు వాపోతున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల పై ఉన్న ఆంక్షలు, నియంత్రణలు ఎత్తివేసి, ఎక్కువ సంఖ్యలో ఎంబీబీఎస్ , పిజీ సీట్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావించడం ప్రైవేటీకరణ ,సరళీకరణ, గ్లోబలీకరణ లో భాగంగానే వైద్యవిద్య వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. గతంలో మెడిసిన్, పీజీ సీట్లు పెంచాలంటే ఎంసీఐ పరిశీలించి తగిన సౌకర్యాలు ఉన్నాయని, బోధనా సిబ్బంది ఉన్నారని గుర్తిస్తే నే అనుమతి ఇచ్చేది.
ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త ప్రతిపాదన లో గతంలో ఉన్న నిఘా వ్యవస్థ ఉండదు. మెడికల్ కాలేజీ యాజమాన్యాలే కావాల్సిన సంఖ్యలో ఎంబిబిఎస్ ,పీజీ సీట్లు పెంచుకోవచ్చని, 40 శాతం సీట్లపై ప్రభుత్వం, 60 శాతం సీట్లపై ప్రైవేటు యాజమాన్యం ఫీజు నిర్ణయిస్తుందనే ప్రతిపాదనను, క్యాబినెట్ 50 శాతం నకు పెంచింది. కానీ ప్రస్తుత విధానంలో ఫీజు నియంత్రణ ప్రభుత్వం చేతిలో 80 శాతం, ప్రైవేట్ కాలేజీల చేతుల్లో 15 శాతం ఉంటే ,ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం 50 శాతం చేశారు. ఇది పేదలకి, ప్రజలకి ఎలా లాభమో? పాలక పెద్దలే వివరించాలి. ఇది గ్రామీణ ప్రాంతాల బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు డాక్టర్లు కావడం అనేది కలగానే మిగిలిపోతుంది. పేదరికం విలయతాండవం చేస్తుంటే ,కనీస వసతులు సమకూర్చుకోలేక నానా యాతన కు గురవుతుంటే ,చదువుకోవడానికి సరైన వసతులు లేక అననుకూలమైన వాతావరణ పరిస్థితులలో చదువుకునే నిరుపేదలకు వైద్య విద్య అందని ద్రాక్ష పండు గానే మిగిలిపోతుంది. కోట్ల రూపాయలు ఉన్నవారికే తెల్లకోటు వేసుకునే అవకాశం కల్పించేందుకె ఫీజు నియంత్రణ బాధ్యత ల నుండి ప్రభుత్వం తప్పు కుందని భావించవచ్చు… ప్రైవేటీకరణ కాలంగా అధిక ఫీజులు నిర్ణయించి పేద విద్యార్థులు ఈ కోర్సుల వైపు రాకుండా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ…. లోపాయికారిగా ఈ విద్యకు దూరం చేయాలనే కుట్రలు జరుగుతుండటం ఇబ్బందికరం….. అంతే కాకుండా విదేశాల్లో వైద్య విద్య చదివిన భారతీయ విద్యార్థులకు మన దేశంలో వైద్య వృత్తిలో ప్రవేశించాలంటే జాతీయ స్థాయిలో నేషనల్ లైసెన్సయిట్ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది. కొత్త విధానం ప్రకారం ఈ పరీక్ష రాయనవసరం లేకుండానే విదేశాలలో చదివిన విద్యార్థులు ఇండియా లో వైద్య వృత్తి చేపట్టే వెసులుబాటు కల్పించడం జరిగింది.
ఇలా అనుమతించడం మూలంగా రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనదేశంలో చదివినా డాక్టర్లు ఇతర దేశాల్లో ప్రాక్టీస్ చేయాలంటే ఆయా దేశాలు నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందే…. మన దేశంలో సరైన వసతులు కల్పించి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేది పోయి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న విదేశీ వైద్య విద్యను ప్రోత్సహించే విధంగా చర్యలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది…. మరొక ముఖ్యమైన అభ్యంతరకర విషయం ఏమిటంటే నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లులోని సెక్షన్ 32 దీని ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ను పరిమిత స్థాయిలో వైద్యవృత్తిని ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించే విషయం…… ప్రాథమిక వైద్య స్థాయిలో ,కొన్ని రకాల మందులు పిస్క్రైబ్ చేసే విధంగా పరిమితులతో కూడిన అనుమతినీస్తారు. వీళ్ళు ఇదివరకే పని చేస్తున్నా =వీ, వీ లకు ఏ మాత్రం తీసిపోరు. వారిలాగే కొన్ని రోజుల శిక్షణ తో డాక్టర్లుగా పనిచేయడానికి అనుమతిస్తే ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అవుతుంది. ఆరోగ్య రంగంలో సహకారం ఇవ్వడం వేరు, వైద్యవృత్తిని ప్రాక్టీస్ చేయడం వేరు గా ఉంటుంది.
డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం 1000:1 గా జనాభా డాక్టర్ల నిష్పత్తి ఉండేవిధంగా చూడడానికి డాక్టర్లు గాని డాక్టర్లకు పర్మిషన్ ఇస్తే సరిపోతుందా?? అనాటమీ ,ఫిజియాలజీ ,బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ చదవకుండా ఆరునెలల అనుభవంతో డాక్టర్లుగా ఎలా మనగల్గుతారని, వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత నుండి ప్రభుత్వం విస్మరించడానికె ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారని అంటున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం కొన్ని విధివిధానాలు ప్రకటించింది. వైద్య కళాశాల ఏర్పాటుకు రెండేళ్ల నుంచి అన్ని సౌకర్యాలతో నడుస్తున్న 300 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలి. రెండేళ్లు 60 శాతం ఆక్యుపెన్సీ ఉండాలని, ఆసుపత్రి లేని కాలేజీలో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కరువు అవుతుందనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2021 -22 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధన ను తొలగించారు. కాలేజీలో కనీసం ఇరవై నాలుగు భాగాలు ఉండాలి. కాలేజీకి తొలుత 100 నుంచి 150 సీట్లతో అనుమతిస్తారు. 100 సీట్లు ఉంటే 400 పడకలు, 150 సీట్లు ఉంటే 600 పడకలు, 200 సీట్లు ఉంటే 800 పడకలు, 250 సీట్లు ఉంటే వేయి పడకలు ఉండాలి. ప్రతీ కళాశాలలో 30 పడకలు అదనంగా ఎమర్జెన్సీ మెడిసిన్ కు కేటాయించాలి. ఐదు పడకల ఐసియు, పి ఐ సి యు వేరువేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్, స్కిల్ లాబరేటరీ, ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసే లేబరేటరీ తప్పనిసరి చేశారు. వైద్య సిబ్బంది నివాస సదుపాయాలను, ఎమర్జెన్సీ స్టాఫ్ అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఐచ్ఛికం చేశారు. లెక్చర్ హాల్ లను తగ్గించారు. కొన్ని వైద్య విభాగాల్లో పడకలను కుదించారు. ఏటా కాలేజీ తనిఖీ చేయాలనే నిబంధన లేదు. వైద్య సిబ్బంది సంఖ్యను తగ్గించడం జరిగింది. కాలేజీలో సెంట్రల్ రీసెర్చ్ లాబరేటరీ లు తప్పనిసరి కాదని కళాశాల ఇష్టం అనడం బాధాకరం.
ఆసుపత్రికి వచ్చే రోగుల పై పరిశోధనలు, రోగాల్లో వచ్చే మార్పులు, కొత్త రోగాలపై క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ జరిగే విధానాన్ని తప్పనిసరి కాదనడం దేనికి సంకేతము? పాలకవర్గాలే చెప్పాలి. కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కొత్త రోగాలు వ్యాప్తి చెందినప్పుడు, వాటికి సంబంధించిన వివరాలు కనుగొనకుండా ఉంటే మానవాళికి శ్రేయస్కరం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తికి కాకుండా నివారణ చర్యలు, చికిత్స చేయడం, వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడం గురించి అన్వేషణలు జరుగుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో కరోనా కి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాజనకంగా జీవిస్తున్నాం. దీనికి కారణం వ్యాక్సిన్ అభివృద్ధికి నిరంతర కృషి పరిశోధనలు జరుగుతుండటం వల్ల….. ఇకముందు ఇటువంటి పరిశోధనలు లేకుంటే మరో రకమైన వైరస్ ప్రబలి తే మానవ జాతి మనుగడ సాధ్యమేనా?…. ఇలాంటి తరుణంలో క్లినికల్ రీసెర్చ్ కు దోహదపడే సెంట్రల్ రీసెర్చ్ లేబరేటరీ లు తప్పనిసరిగా మెడికల్ కాలేజీలో నెలకొల్పే విధంగా కఠిన నిబంధనలు ఉండటం ఆవశ్యకం. అదేవిధంగా కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలలో లైబ్రరీకి పెద్ద స్థలం కేటాయించాల్సిన అవసరం లేదని తాజా సవరణల్లో పేర్కొనడం ఆశ్చర్యకరం….. అంతేకాకుండా వాటిలో పుస్తకాల సంఖ్యను తగ్గించే చేశారు. కానీ వ్యాధులను నిర్మూలించు టకు, అవి రాకుండా అరికట్టేందుకు ఎంతోమంది వైద్యనిపుణులు గ్రంథాలయాల్లో గంటల తరబడి పుస్తకాల అధ్యయనం గావించి పలు మహమ్మారి లకు మందులు, టీకాలు కనుగొన్న అనుభవాలను మరిచి లైబ్రరీలను కుదించటం సరి అయినది కాదు…. ప్రస్తుతం వంద సీట్లు ఉన్న మెడికల్ కాలేజీలో 7 వేల పుస్తకాలు, 150 సీట్లు ఉన్న కాలేజీలో 11 వేల పుస్తకాలు, 200 సీట్లు ఉన్న కాలేజీలో 15000, 250 సీట్లు ఉన్న కాలేజీలో ఇరవై వేల పుస్తకాలు ఉండాలనే నిబంధనను సరళీకరించి 7 వేల నుండి మూడు వేలకు, 11 వేల నుండి 4500 కు, 15 వేల నుండి 6 వేలకు, 20 వేల నుండి ఏడు వేల వరకు కుదించటం జరిగింది….. లైబ్రరీ వైశాల్యాన్ని కూడా తగ్గించారు. పుస్తకాల సంఖ్యను కుదించడం వల్ల విద్యార్థులకు అందుబాటులో లేకుండా భవిష్యత్తు అధ్యయనం కోసం, సృజనాత్మకత అభివృద్ధికి నిరోధకంగా వైద్యవిద్య నిపుణులుగా మారడానికి అవరోధకంగా ఉంటాయి. వైద్య విద్యార్థులు 24 గంటలు లైబ్రరీలోనే నిరంతర శ్రమ చేసే అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల భవిష్యత్తు వైద్యరంగానికి తీవ్ర నష్టం.
గతంలో మాదిరిగా కఠిన నియమ నిబంధనలు అనుసరించి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ గా ఏర్పరిస్తేనే అనేక వసతుల లేమి, సిబ్బంది కొరత, హాస్టల్ సమస్యలు, ఆస్పత్రి నిర్వహణ సరిగ్గా లేకపోవడం, విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందకపోవడం దేశవ్యాప్తంగా ఒకే ఈ విధమైన ప్రమాణాలతో కూడిన వైద్య విద్య అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఒక పక్క నిక్షిప్తమై ఉండగా తాజాగా నిబంధనలను సరళీకృతం చేయడంవల్ల నాణ్యతతో కూడిన డాక్టర్లు ఎలా తయారవుతారు?స్కిల్ ఇండియా గా ఎలా అభివృద్ధి చెందుతుంది? మనదేశంలో నైపుణ్యం గల డాక్టర్ల కొరత ఉంది. ఈ కొరతను అధిగమించేందుకు , ఈ నేషనల్ మెడికల్ కమిషన్ పనిచేయదు. మెడికల్ కాలేజీల ఏర్పాట్లలో తప్పుదోవ పట్టించి తప్పుడు విధానాలతో తేలిగ్గా మెడికల్ కాలేజీనీ నెలకొల్పే వీలు కల్పిస్తుంది. ఒకసారి అప్రూవల్ వచ్చాక ఆ తరువాత వారి వసతులు తగు స్థాయిలో లేకపోయినా కాలేజీల ను రద్దు చేసే అవకాశం లేదు.
ఈ అవకతవకల తో కూడిన సరళీకృత విధానాల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ వెహికల్ కళాశాల అన్నిటిలో ఒకే రకమైన ప్రమాణాలు ఏర్పడే అవకాశం ఉండదు. డాక్టర్లు, ప్రజలు ప్రభుత్వం కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా కేంద్రీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వమే ఏకపక్ష నిర్ణయంతో నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకురావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ఆరోగ్య రంగం అత్యంత నిరాదరణకు గురైందన్న ది నగ్నసత్యం. ప్రపంచంలో లో అనేక దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతం మేరా నిధుల్ని ఆరోగ్య రంగానికి కేటాయించడం జరుగుతుంది. ఆ ప్రకారం ఆరోగ్యం పై భారత్ లో ప్రజలు చేస్తున్న ఖర్చు వారి ఆదాయం లో 65 శాతం ఉంటుంది. వారు సొంతంగా జేబులో నుంచి తీసి చేస్తున్న ఖర్చు. ప్రపంచంలో ఏ దేశంలో ఈ స్థాయిలో ఆరోగ్యం పేరిట ఖర్చు చేయడం లేదు. అందువల్ల యూరప్, థాయిలాండ్, క్యూబా వంటి మెరుగైన వైద్య ఆరోగ్య సేవల అనుభవాలను చూసి మన వైద్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మన దేశ స్థూల దేశీయోత్పత్తిలో ఆరోగ్య రంగం వాటాను 1.4 శాతం నుండి 2.5 శాతం పెంచాలని, జాతీయ ఆరోగ్య విధానం సూచించిన మేరకు రాష్ట్రాలు తమ బడ్జెట్లో 8 శాతం నిధులు కేటాయించి ఆరోగ్య రంగం ను అభివృద్ధి పరిచి ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రభుత్వ మెడికల్ కాలేజి లలో సరి అయిన, మెరుగైన వసతులు కల్పించి ప్రజలకు చికిత్స అందించడం అవసరం….. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న భారతదేశంలో ప్రభుత్వ ఆధీనంలోనే విద్య, వైద్యం లను ఉంచుకొని….. విద్యా వైద్య ఆరోగ్య సేవలను అందించు తేనే 130 కోట్ల మంది ప్రజలు హాయిగా గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారు….. లేనిచో ఈ వైద్యవిద్య సరళీకరణ లో మార్పులు చేయకుండా వైద్యాన్ని ప్రజోపయోగ అవసరాలను తీర్చకుండా కార్పొరేటీకరణ కోసం వినియోగిస్తే ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

జిల్లా ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్.
మహబఃబాద్ జిల్లా. 9989584665,