- పేదల కోసం ఇండ్లు కట్టించలేవా?
- బీజేపీ అధికారంలోకొస్తే…పేదలకు ఉచితంగా విద్య, వైద్యం
- పేదలందరికీ ఇండ్లు…రైతులకు పంట నష్టపరిహారం
- పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో కేసీఅర్ పై బండి సంజయ్ ఫైర్…
పరిగి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇయ్యలేనోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్‌కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల అప్పు చేసి ప్రజల చేతికి చిప్ప ఇస్తారని అన్నారు. పంచాయతీలకు నిధులివ్వకుండా, ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు బిల్లులివ్వకుండా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో చేరితేనే ప్రజా ప్రతినిధులకు నిధులిస్తామంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరతమ భేదం లేకుండా తెలంగాణలోని పంచాయతీలన్నింటికీ నిధులిస్తున్నారని చెప్పారు. మోదీ కూడా మీలాగే బీజేపీలోనే చేరితేనే నిధులిస్తామని ఆఫర్ ఇస్తే…బీఆర్‌ఎస్‌లో ఒక్కరైనా మిగిలేవారా…అంటూ ప్రశ్నించారు.
‘ప్రజా గోస- బీజేపీ భరోసా’లో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేటలో జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, కార్యదర్శి ఉమారాణి, ఆకుల విజయ, పరమేశ్వర్ రెడ్డి, శక్తి కేంద్ర ఇంఛార్జీలు శ్యాం సుందర్, రమేశ్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, యాదయ్య, కాకి శ్రీనివాస్, శివకుమార్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.