Take a fresh look at your lifestyle.

మర్కజ్ వెళ్లిన వారు స్వ‌త‌హాగా బయటికి రావాలి..!

  • సంఘ‌టితంగానే కోవిద్ -19 ను ఎదుర్కొన‌గ‌లం 
  • కేంద్ర హోమ్ శాఖ  సహాయమంత్రి  కిష‌న్‌రెడ్డి వెల్ల‌డి
ఢిల్లీలోని మర్కజ్ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు స్వ‌త‌హాగా బయటకు రావాలని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి జీ కిష‌న్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఎంత ఆలస్యం చేస్తే వారి కుటుంబంలోని వృద్ధులకు, చిన్నారులకు, మహిళలకు, ఇతర సభ్యులకు అంత ప్రమాదం అన్నారు. మర్కజ్ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు స్వతహాగా బయటకి రాక పోతే కుటుంబ సభ్యులను సమాజాన్ని కరోనా బారిన ప‌డేసే ప్ర‌మాదం ఉంద‌న్నారు. వెంటనే దగ్గరల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మర్కజ్ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని కోరారు. ఈ వైరస్ కి కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేవని, ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని పునరుద్ఘాటించారు. నిర్లక్ష్యం చేస్తే వారి కుటుంబంతో పాటూ, దేశ ప్రజలకు సోకే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. కోవిద్ 19 అనే కనిపించని శత్రువుతో దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు పోరాడుతున్నారని గుర్తు చేశారు.  ప్రపంచవ్యాప్తంగా నమోదైన లక్షలాది పాజిటీవ్ కేసులు భయాందోళనలు కల్గిస్తున్నాయ‌న్నారు.  కరోనాతో జరుగుతోన్న యుద్ధంలో పాల్గొంటున్న సివిల్ సర్వీసెస్ అధికారులు మొదలు కొని గ్రూప్ – 4 ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందలు తెలిపారు. ఇంటి బయటే కూర్చొని భోజనాలు చేసి, తిరిగి విధుల్లోకి వెళ్తోన్న సంఘటనలు వింటుంటే హృదయం చలిస్తుందని చెప్పారు. అయితే, డాక్టర్లు, నర్సులు, పారా మిలటరీ సిబ్బందిపై కొందరు చేస్తోన్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన…  ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజీపీలను ఆదేశించినట్టు వెల్లడించారు. నిత్యవసర వస్తువుల సమగ్ర పంపిణి, లాక్ డౌన్ నిబంధలను అతిక్రమిస్తోన్న వారిని, తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు.
ఈశాన్య రాష్ట్రాల వారికోసం హెల్ప్ లైన్:
లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు,  తమ సమస్యల పరిష్కారానికి 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా 1934 హెల్ప్ లైన్ ను ప్రారంభించిందని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలలో చైనీయుల పోలికలు ఉండటం వలన, చైనీయులపై ఉన్న కోపాన్ని ఇతర రాష్ట్రాల ప్రజలు వీరి పట్ల వివక్షగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా మీ వల్లే వచ్చిందంటూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని అవమానించడం మంచి పద్దతి కాదని కిషన్ రెడ్డి అన్నారు. ఎవరైనా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే వారిపై ట్రోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1934 కు కాల్ చేయాలని, ఈశాన్య రాష్ట్రాల వారికి అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Leave a Reply

error: Content is protected !!