Take a fresh look at your lifestyle.

తోలు బొమ్మ

అయ్య ..
మీ కడుపులు సళ్లగుండా!

దగ్గొచ్చిన,జరమొచ్చిన
పెయ్యంత పచ్చి పుండై పోయినా
మూలకున్న సీపిరి కట్టల ముడుసుకుని
వనుకుడే గానీ
కొండ కొనలు దాటి
నదులవోంపులు, వాగు వంకలు దాటి
జోరు వానాల నీటిప్రవహంలో కొట్టుకొని పోయినా
మందుగోలిలు, సూది ఇంజెకన్‌ ‌లు ఇచ్చే
సర్కారీ దవాఖానా రూపం తెల్వక
ఎండుటాకులా రాలిన జీవిని ఎప్పుడైనా
పలకరించారా? కనీసం.
ఇంటి దీపాన్ని వెలిగించే కసరత్తు
కొంతైనా చేశారా?

ఎండలో నిండు చూలాలు
పెయ్యంతా సేమటతో
కాళ్ళు బొబ్బలెక్కి నడవలేని దృశ్యాన్ని
సెట్టుకిండ కూలబడ్దా ఇప్పపువ్వు గంపను
ముద్దాడే అలసిన చేతులను
అరిగిన కాళ్లను చూసారా?
కనీసం
తీయని పలకరింపుతో .బాధను ఓదార్చారా?

ఆకలితో నకనక లాడి
డొక్కా వీపుకంటిన కూనను
చూసారా?
మాంసం ముద్దై పురుగులకు ఆకలి తీర్చే
కంపు కొడుతున్న కళేబరాలను
వాటి ఆర్తిని ఎప్పుడైన విన్నారా..?

పసులు కాసే పసికూన
విషపు నురగతో కొట్టుకుంటూ
కొనుపిరు గాలిలోకి పక్షిలా ఎగురుతుంటే
బిగపట్టి ..కడసారి కన్నోల్లను
కండ్లల్లో బందించిన చిత్రాన్ని కనులను చూసారా?
వాటి చివరి కోరికను తీర్చే
ఆలోచన ఏమైనా చేశారా?

వాలు పోస్టర్‌ ‌కప్పుకున్న
చలి తగ్గక వణుకు తున్న పాదాలను
చీము నెత్తురు కారుతూ
కనిపించిన కుస్థి వెళ్ళ కదలికలను చూసారా?
ఓ అసహ్యపు రాయిని విసిరారా?.

కటిక నేలపై నక్షత్ర ఆకాష్‌ ‌దుప్పటిని కప్పి
విష పురుగులకు ఓల్లును అప్పజెప్పి
పొద్దంతా మాంసం కరిగించిన
వలస సిమెంటు బిడ్డను చూసారా?
వెన్నెల వెలుగులో కుటుంబ ఎడబాటు
సంగీతం మూలుగుతున్న ధ్వనులో
ఎపుడైనా విన్నారా?
అయ్యో!అని ఓ పారి నిట్టుర్చారా?.

అర్థరాత్రి అన్ని సద్దుమణిగాయని
ఉరితాడును ముద్దాడే శిరస్సును
పట్టాలపై పడివున్న పాణాన్ని
క్రిమి మందును పొట్టలో పోసుకొనే చేతులను
ఊహించక పది గిర్రల లారీ కింద
నుజ్జు నుజ్జులో ఎగిరి పడ్డ మాంసం ముద్దలను
కోల్పోయిన కుటుంబ విషాద అరుపులను
ఆగిన గుండె దేహాల పరిసరాల శబ్దాలను
విన్నారా?
కనీసం మృత్యువు రుపాన్నైన ఊహించారా?

క్షణికం అని తెలుసు
ఏది రాదని ,ఎవరు రారని
అన్ని తెలిసి
ఆస్తికై వెంపర్లాడే ఈ తోలు బొమ్మ
ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు అగ్నిలా కాల్చివెస్తుందని తెలిసిన…
విడ్డూరం నరుని వైఖరి…
కాస్తో కూస్తో..కృత్రిమ ప్రేమల నడుమ
రక్తి కట్టే నాటకంలో అందరూ కీలుబొమ్మలే..
అవసరాన్ని బట్టి రంగు మార్చే
ఊసరెల్లులే….

-నాగరాజు మద్దెల
6301993211.

Leave a Reply