Take a fresh look at your lifestyle.

ఇదే లాస్ట్ ‌వార్నింగ్‌

‌టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌రాష్ట్ర ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రతిపక్షాలకు అల్టిమేటమ్‌ ‌జారీచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాణించాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలేగాని, చౌకబారు మాటలతో రాజకీయాలను అపవిత్రం చేయడం ఏమాత్రం సమంజసంకాదని ప్రధానంగా కాంగ్రెస్‌, ‌బిజెపిలకు హెచ్చరిక చేశారు. తాను చేస్తున్న ఈ హెచ్చరిక ఇదే చివరిదంటూ ఇక ముందు ప్రతిపక్ష పార్టీల నాయకులు వొళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ ఆయన సోమవారం వరంగల్‌ ‌మీడియా సమావేశంలో ఆవేశపడ్డారు. బాధ్యతాయుత రాజకీయ పార్టీగా తాము సంయమనం పాటిస్తూ ఇంతకాలం ప్రతిపక్షాల తీవ్ర పదజాలానికి సైతం ఓపిక పడుతున్నా కనీస మర్యాదలను కూడా ప్రతిపక్షాలు అతిక్రమిస్తున్నాయని, తమ ఓపికను పరీక్షిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాయంటూ, ప్రతిపక్షాలే తమను మౌనం వీడమని బలవంతం చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. గత శాసనసభ ఎన్నికలైన్పటి నుండి కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు అధికార పార్టీని తూర్పాపడుతున్న విషయం తెలియంది కాదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరున జరుగుతున్న అవినీతి, అక్రమాలతోపాటు, పాలనాపరంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఈ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా, ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్‌ ఈ ‌విషయాలపై పలు సందర్భాల్లో వివరణ ఇస్తున్నా  ప్రతిపక్షాలు వాడుతున్న తీవ్ర పదజాలం ఆయన ఓపికకు పరాకాష్టగా మారిందనే చెప్పాలె. అందుకే ఆయన వరంగల్‌ ‌మీడియా సమావేశంలో సహనం కోల్పోయినట్లు కనిపించింది. రెండు ప్రధాన పార్టీలను టార్గెట్‌ ‌చేసినప్పటికీ ఎక్కువగా బిజెపిపైన విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, ఏ పథకం ప్రారంభించినా  కేంద్రం నిధులు ఇవ్వడంవల్లే రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుందంటూ బిజెపి రాష్ట్ర శాఖ తప్పుడు ప్రచారం చేస్తున్నదంటూ ఆయన విరుచుపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క  హామీనికూడా నేటివరకు నిలుపులేకపోయిన బిజెపి ప్రభుత్వం తమను విమర్శించడమేంటంటూ ఆయన నిలదీస్తున్నారు. ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఇదిగో అదిగో అన్నారు. చివరకు దాన్ని అటుకెక్కించారు. దాని స్థానంలో రైల్‌ ‌బోగీల ఓవరాయిలింగ్‌ అన్నారు. దాని సంగతి ఈ రోజువరకు తేల్చలేదు. బయ్యారం స్టీల్‌  ‌ఫ్యాక్టరీ అని ఊరించారు..దాని అతీగతిలేదు. గిరిజన విశ్వవిద్యాలయమన్నారు దాని ఊసే ఎత్తరు. ఐటిఐఆర్‌ ‌మురిపించారు. దేశంలో నూటాయాభై మెడికల్‌ ‌కాలేజీలను మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా కేటాయించలేదు.

ఒక్క నవోదయా పాఠశాలను మంజూరుచేయలేదు. దేశంలో పదహారు త్రిపుల్‌ ఐటిలను వివిధ రాష్ట్రాలకిచ్చినప్పుడు అందులో ఒక్కదాన్ని కూడా తెలంగాణ నోచుకోలేదు.  దేశంలో అయిదే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌లను కేటాయిస్తే తెలంగాణకిచ్చింది గుండు సున్న. కేంద్రంలో అధికారం చేపట్టడానికి ముందు ప్రతీఏటా రెండు వేల ఉద్యోగాలను కల్పిస్తామన్న బిజెపి తన ఆరేళ్ళ అధికారంలో ఇవ్వాల్సిన పన్నెండు  వేల ఉద్యోగాలేవంటూ ఆయన నిలదీస్తున్నారు. అందుకే కేంద్రం మాటలను ఎలా అర్థంచేసుకోవాలంటే బాత్‌ ‌కరోడోంకా, కామ్‌ ‌పకోడోంకా అని, ఎందుకంటే ఉద్యోగాలేవంటే పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనంటాడు ప్రధాని. స్వయం ఉపాధికూడా కేంద్రం తాను కల్పించే ఉద్యోగాల ఖాతాలో వేసుకోవడం కన్నా సిగ్గుచేటు మరోటిలేదంటూ ఆయన బిజెపి శ్రేణులపై విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం ఇంత వివక్షతను చూపిస్తున్నా తామెక్కడ సంయమనం వీడడం లేదు, కాని, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటికొచ్చినట్లు పేలడాన్ని ఇక ఎట్టి పరిస్థితిలోనూ సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. నాలిక ఉందికదా అని ఎలాపడితే అలా మాట్లాడకూడదదని, వారు మాట్లాడినంత దిగజారుడుగా తాము మాట్లాడలేమంటూనే,  ఇక్కడినుండి తమ పార్టీ శ్రేణులు కూడా టిట్‌ ‌ఫర్‌ ‌టాట్‌గా వ్యవహరిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా, వయస్సుకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న తీరును తీవ్రంగా తప్పు పట్టిన కెటిఆర్‌ ‌శిశుపాలుడి వంద తప్పులు కాచిన తర్వాత అతనికి ఏగతి పట్టిందో తమ కార్యకర్తలు కూడా అదేగతిని పట్టిస్తారంటూ ఆవేశపూర్తిగా ఆయన బిజెపితో పాటు కాంగ్రెస్‌ను కూడా చివరి హెచ్చరికను జారీ చేసిన తీరు భవిష్యత్‌లో ఇక ఈ పార్టీల మధ్య రణరంగం తప్పదన్న సూచనలకు తావేర్పడుతున్నది.

Leave a Reply