అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణ(ఎల్ఆర్ఎస్) పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్దేశించినట్టిదిగా కనిపిస్తోంది. ఇలాంటి పథకాలు గతంలోనూ ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాయి. కానీ, ఇప్పుడు అందుకు తగిన సమయం కాదన్నది సామాన్య, మధ్యతరగతి వర్గాల అభిప్రాయం. కొరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా కష్టనష్టాలకు గురవుతున్నది ఈ వర్గాలే. ఒక వైపు ఆదాయం తగ్గిపోవడం, మరో వైపు ఖర్చులు పెరిగిపోవడంతో ఈ వర్గాల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది. కొరోనా వేళ సామాన్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లో ఒక్కటి కూడా ఈ వర్గాలకు లబ్ధి కలిగించలేదు. అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారస్తులను, ఎంఎస్ ఎంఈ పరిశ్రమల కోసమే ఈ ప్యాకేజీల డబ్బును పంపిణీ చేస్తున్నారు. కొరోనా కారణంగా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గిన మాట నిజమే. అందుకే, ప్రజలను ఆకర్షించేందుకు ఇలాంటి పథకాలను మళ్లీ తెరమీదికి తెస్తున్నాయి.
ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణ అనేది నిరంతర పక్రియగా సాగుతూనే ఉంటుంది. అయితే, ప్రజలు అందుకు సిద్దంగా ఉన్నారా లేదా అని ఆలోచించకుండా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 26వ తేదీని కట్ ఆఫ్ డేట్‌గా ప్రకటించి అక్టోబర్ 15వ తేదీ లోగా ఆన్ లైన్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు నింపాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణలో 43 మునిసిపాలిటీలకూ, టిఎస్ మెట్రోపాలిటన్ డెవలెప్ మెంట్ అథారిటీ, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీలకు ఇది వర్తిస్తుంది. 2018 మార్చి 30వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎల్ఆర్ ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయిలు, లే అవుట్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 వేల రూపాయిలు, నిర్దారించింది. సామాన్య, మధ్య తరగతి వర్గాల కుటుంబ పోషణకే చాలీచాలని ఆదాయాలతో ఖర్చులతో సతమతమవుతున్న తరుణంలో ఈ పథకాన్ని ప్రజల నెత్తిన రుద్దిన తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ప్రజల గోడును పట్టించుకోకుండా మునిసిపాలిటీల ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం నిదానంగా ఆలోచిస్తే ఆదాయ మార్గాలు చాలానే ఉన్నాయి.
పన్నుల ద్వారానే, ఆదాయం పెంచుకోవాలనుకోవడం సరైంది కాదు. తెలంగాణలో ఇటీవల భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ముడుపులు తీసుకుంటూ పట్టుబడిన వారిలో తాసిల్దార్లు, కలెక్టర్లు ఉన్నారు. వారిపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన మాట నిజమే కానీ, ఇంకా లోతుగా పరిశీలన జరిపితే ప్రభుత్వ దృష్టిలో పడకుండా అక్రమార్జనపరులు ఎంతో మంది యథాప్రకారం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అలాగే, అభివృద్ది, సంక్షేమం తమకు రెండు కళ్ళని చెప్పుకుంటూ ప్రభుత్వం రైతులు, ఇతర వర్గాలకు వారి ఆదాయ పరిమితులతో నిమిత్తం లేకుండా సాయం అందిస్తోంది. రైతు బంధు పథకం ఇందుకు నిదర్శనం. ఈ పథకం మంచిదే అయినా, 20, 50, వంద ఎకరాలున్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేసుకుంటూ పోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఐదెకరాలు గల రైతులకు అమలు జేస్తే కొంతైనా భారం తగ్గుతుంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పేద రాష్ట్రంగా తెరాస ప్రభుత్వం తయారు చేసేసిందని ప్రతిపక్షాలు తరచూ చేస్తున్న ఆరోపణలు నిరాధారం కాదేమోనని ఇలాంటివి చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు జేయడం ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో, ప్రజల మీద భారం పడకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. అయితే, ఆధునిక కాలంలో కేంద్రం సహా అన్ని రాష్ట్రాల ధోరణి ఒకే తీరులో ఉంది.
ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం అత్యవసరం. ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఒక చేత్తో ఇచ్చి, రెండో చేత్తో లాక్కున్నట్టుగా ఉంటోంది. అంతేకాక ఇళ్ళ స్థలాల పంపిణీ, అక్రమ ఆక్రమణల క్రమబద్దీకరణ అనేది కందిరీగల తుట్టె వంటిది. ఇలాంటి విషయాలు తేలిగ్గా తేలే వ్యవహారాలు కావు. మునిసిపల్, టౌన్ ప్లానింగ్, ప్రభుత్వ సర్వే శాఖల సిబ్బంది కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. హడావుడిగా చేసే వ్యవహారాలు కావు. కొరోనాతో ప్రజల జీవిత విధానం మారిపోయింది. ఆదాయాలు తగ్గడంతో ఖర్చుల ప్రాథమ్యాల విషయంలో ఆచితూచి సామాన్యులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైన ఖర్చులకే బొటాబొటీగా ఆదాయం ఉంటున్న సమయంలో ఈ క్రమబద్దీకరణ కింద కట్టేందుకు వారి వద్ద డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. అలాగే, అవినీతిని నిర్మూలిస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఈ క్రమబద్దీకరణ చర్యలతో కొత్త అవినీతి మార్గాలను తన సిబ్బందికి సూచించినట్టు అవుతుంది. స్థలాలు ఆక్రమించుకున్న వారు ఎక్కడికీ పోరు, వారి నుంచి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వసూలు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఎల్ఆర్ఎస్ అవినీతి ఉద్యోగులకు మరో ఆదాయ వనరు అవుతుంది. కనుక, ప్రభుత్వం ప్రతిష్ట కోసం పోకుండా ఈ విషయమై పునరాలోచన చేయడం ఎంతైనా అవసరం. పాలకులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గడం నామోషీ ఏమీ కాదు. తనకు ఎలాంటి భేషజాలూ లేవనీ, ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిదే.