Take a fresh look at your lifestyle.

ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెటే…

కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌ముమ్మాటికీ ఎన్నికల బడ్జెటేనన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డిమానిటైజ్‌, ‌కరోనాతో అతలాకుతలమైన దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌ ఊరటనిచ్చేదిగా ఉంటుందనుకున్నారు. కాని, చిన్న, మద్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్‌గా ఇది కనిపంచడంలేదన్న విమర్శ ఉంది. ఈ బడ్జెట్‌ ఏరంగానికి ఊరటనివ్వకపోయినా డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌పైనే ప్రధాన్యం చూపించి, కార్పరేషన్‌ ‌రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అనేక సంస్థలనుండి తన వాటాను ఉపసంహరించుకోవడం, ఆయా సంస్థలను ప్రేవేటు రంగానికి అప్పగించే రంగం సిద్దంచేయడంలాంటివి ఈ బడ్జెట్‌ ‌ద్వారా స్పష్టమవుతున్నదని ప్రతిపక్షాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. గత బడ్జెట్‌లలో జరిగిన అన్యాయాలను ఈసారైన కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని రెండు తెలుగు రాష్ట్రాలు ఆశించాయి. కాని ఈ రాష్ట్రాల ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయింది. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటినుండి అనేక పథకాలు, ప్రాజెక్టుల విషయంలో ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర నాయకత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నా వాటిని పట్టించుకోవడంలేదనడానికి ఈ బడ్జెట్‌ ‌కేటాయింపులే నిదర్శనం. విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్న వాటిని తోసి ఇతర రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించింది.

ముఖ్యంగా త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడగకున్నా అక్కడ వివిధ ప్రాజెక్టులకు, పథకాలకు నిధులను మంజూరుచేయడమే ఇందుకు నిదర్శనం. అభివృద్దిలో ముందడుగు వేస్తున్న తెలంగాణరాష్ట్రం మెట్రో అభివృద్ధికోసం కేంద్రానికి ఇప్పటికే అనేక విజ్ఞప్తులు చేసింది. కాని,బడ్జెట్‌లో తెలంగాణ మెట్రో విషయం ఊసేలేదు. అలాగే విడిపోయిన ఏపి కూడా మెట్రో ప్రాజెక్టుకోసం గత ఆరేళ్ళుగా కేంద్రాన్ని అభ్యర్థిస్తూనే ఉంది. అయినా ఆ రాష్ట్రానికికూడా కేంద్రం ఈ బడ్జెట్‌లో శూన్య హస్తమే చూపించింది. కాని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు మెట్రో ప్రాజెక్టులకు నిధులను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. చెన్నైకి 63వేల 246 కోట్లు, బెంగుళూరుకు 14వేల 788 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామ్‌ ‌తన బడ్జెట్‌ ‌రిపోర్టులో తెలిపారు. అలాగే నాసిక్‌లో కొత్త కారిడార్‌ ‌కేటాయింపులు జరిగాయి. అలాగే తమిళనాడులో నేషనల్‌ ‌హైవేకు, కేరళ, ముంబై, అస్సాం నేషనల్‌ ‌హౌవే, ఎకనమిక్‌ ‌కారిడార్‌ల నిర్మాణాలకు లక్షలాది కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

కాని, తెలంగాణ, ఆంధ్రలో కొత్త రైలు మార్గాల విషయాన్ని విస్మరించింది. ప్రధానంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే ఐటిఐఆర్‌ ‌లాంటి ప్రాజెక్టునుగాని, వరంగల్‌ ‌లాంటి ట్రైసిటీలో ప్రవేశపెట్టాలనుకున్న మెట్రో ప్రాజెక్టునుకాని కేంద్రం పట్టించుకోలేదన్నది బడ్జెట్‌ ‌స్పష్టంచేస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగాని, కాళేశ్వరం ప్రాజెక్టుకుగాని జాతీయ హోదా కలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోడై కూసినా కేంద్రం దృష్టిపెట్టలేదు. పైగా ఈ బడ్జెట్‌ ‌సామాన్యులకు ఏమాత్రం మేలు చేసేదిగాలేదన్న వాదనకూడా ఉంది. కరోనాతో ఇప్పటికే అతలాకుతలమైన సామాన్యులపైన పెనుబారాన్ని మోపేదిగానే ఉంది. కరోనా కారణంగా వేలాదిమంది ఉపాధి కోల్పోయి, వ్యాపారాలు మూతపడి ఇప్పుడిప్పుడే గుడ్డిలో మెల్లగా కోలుకుంటున్న తరుణంలో పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను విపరీతంగా పెంచింది. ఇప్పటికే పెట్రోల్‌, ‌డిజిల్‌పైన పెరిగినదానికే ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇది మరింత భారంగా మారింది.

ఫలితంగా ప్రయాణ, రవాణా ఛార్జీలు పెరిగి, దాని ప్రభావం సామాన్య ప్రజలు కొనుగోలుచేసే సరుకుల ధరల పెరుగుదలకు కారణంగా మారబోతున్నది. పెట్రోల్‌పై ఏకంగా లీటర్‌కు రెండున్నర రూపాయలు, డిజిల్‌ ‌లీటర్‌కు నాలుగు రూపాయలను పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే దీని ప్రభావం వ్యవసాయ రంగంపైన కూడా చూపనుంది. ఆరంగంలో ఉపయోగించే అనేక రకాల వస్తువుల ధరలు పెరిగే అవకాశమేర్పడింది. దీనికితోడు ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు, ఇవ్వాళ అతిసామాన్యుడికి కూడా నిత్యావసర వస్తువుగా మారిన సెల్‌ ‌ఫోన్‌ ‌ధరలను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్‌ ‌చెబుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ బడ్జెట్‌ ‌నిరాశపర్చింది. ఆర్థిక ఇబ్బందులకు గురైన దేశం, మద్యతరహా కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వేతనాలపై విదించే టాక్స్‌ను తగ్గిస్తుందేమోనని పడిన ఆశ నిరాశగానే మారిందంటూ ఉద్యోగ వర్గాలు ఆవేదన చెందుతున్నారు.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply