Take a fresh look at your lifestyle.

ఓబిసి రిజర్వేషన్ల అమలు ప్రకటనకు ముప్పయేళ్ళు

“ఆరక్షణ్ లాగు కరో, వర్ణా కుర్సీ ఖాలీ కరో” వంటి నినాదంతో కాన్షీరాం నేతృత్వంలోని బిఎస్పి మండల్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం చేసిన పోరాటం ఓబిసిలా చరిత్రలో మరుపురాని ఘటన. కుల ఆధారిత రిజర్వేషన్ల అమలు కోసం మొదటి నుంచి ఉద్యమిస్తున్న సోషలిస్టులు కూడా మండల్ కమిషన్ నిర్ణయాలను అమలుపర్చాలని పోరాటం చేశారు. ‘పిచ్డే పావే సౌ మే సాట్’ నినాదంతో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. ఇదేసమయంలో మండల్ కు వ్యతిరేకంగా ‘కమండల్” నినాదంతో భాజపా ఓబిసిల హక్కులకు తూట్లు పొడిచే ప్రయత్నం చేసింది.”

“కేవలం సమానులలో మాత్రమే సమానత్వం ఉంది. అసమానతలను శాశ్వతంగా రూపుమాపడమే సమానత్వం”. 1980లో మండల్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తన నివేధికలో పేర్కొన్న ప్రారంభ వాక్యాలివి.

మండల్ కమిషన్, లేదా సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎస్ ఈబిసి) 1 జనవరి 1979 న ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం “సామాజికంగా లేదా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడం” అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. బిహార్ మాజి ముఖ్యమంత్రి బిందేశ్వరీ ప్రసాద్ మండల్ చైర్మన్ గా నియమింపబడిన ఈ కమిషన్ తన నివేధికను 31 డిసెంబర్, 1980న ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటికే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయి ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చింది. ఆమె పదవీకాలంలోనూ, తదనంతరం వచ్చిన రాజీవ్ గాంధీ కాలంలోనూ ఈ నివేధికను పూర్తి నిర్లక్ష్యం చేశారు. ఆగష్టు 7, 1990 న, అప్పటి ప్రధానమంత్రి వి పి సింగ్ తమ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ప్రకటించాడు. కమిషన్ ఒబిసి అభ్యర్థులకు అన్ని స్థాయిలలో 27% రిజర్వేషన్ల అమలును సిఫార్సు చేసింది. నివేదిక అమలుతో ఒబిసి లేదా ఇతర వెనుకబడిన తరగతుల పరంగా భారతదేశ సామాజిక న్యాయ ఉద్యమంలో గొప్ప అధ్యాయం ప్రారంభమైంది. ప్రకటన వెలువడటమే ఆలస్యం, ఓబిసి కోటాకు వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో ఢిల్లీ విశ్వవిద్యాల యానికి అనుబంధమైన దేశబంధు కాలేజీ విద్యార్థి రాజీవ్ గోస్వామి తనను తాను నిప్పంటించుకున్నాడు. ఆయన రగిలించిన మంట ఢిల్లీకి సమీపంలో ఉన్న నగరాలు, పట్టణాల్లో అనేక మంది యువకులు తమను తాము నిప్పంటించుకోవడానికి పురికొల్పింది. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం రాజకీయ ఉద్యమాలను చేసిన సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఈ కృత్రిమ ఆందోళనకు తావివ్వలేదు. అప్పటికి వి పి సింగ్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. బయటి నుండి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన బిజెపి తన రాజకీయ చర్చను మండల్ కమిషన్ నుండి రామ మందిరానికి మార్చడానికి ప్రయత్నించి, వెంటనే మద్దతు ఉపసంహరించుకుంది. ఇటువంటి నిస్సహాయ స్థితిలో వి పి సింగ్ ప్రభుత్వం పడిపోయింది.

నిజానికి ఓబిసి రిజర్వేషన్ల అమలును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్-బిజేపిలకు వి పి సింగ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం సహజంగానే మింగుడు పడలేదు. దుర్దృష్టవశాత్తు మేధావి వర్గం, ఉన్నతవర్గ ప్రొఫెసర్లు సైతం ఓబిసి రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేక చర్యలని వి పి సింగ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం దేశంలో సగానికి పైగా ఉన్న ఓబిసి కులాల మీద వారికున్న కపట ప్రేమకు నిదర్శనం. స్వాతంత్రానికి పూర్వం, అనంతరం కూడ ఓబిసి కులాలను కేవలం ఉత్పాధక కులాలుగా చూసే సంస్కృతిని ప్రోత్సహించింది ఆయా పార్టీల మేధావి వర్గాలే. నిజానికి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయబోతున్నట్లు ప్రకటించినప్పుడు ప్రారంభంలో పెద్దగా వ్యతిరేకత కనబడలేదు. అగ్రవర్ణ/కుల ఆధిపత్య మీడియా ఓబిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగ నెమ్మదిగా నిప్పును రాజేయడం ప్రారంభించింది. తన నిర్లక్ష్య రచనల ద్వారా మండల్ వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహించిన అరుణ్ శౌరీ వంటీ సీనియర్ పాత్రికేయుడు తన గ్రంథమైన ‘ఫాలింగ్ ఓవర్ బ్యాక్ వర్డ్’లో ఒబిసి రిజర్వేషన్లపై బాహటంగానే విషం కక్కాడు. అంతేకాదు ఆయన సంపాదకుడిగా ఉన్న పత్రికలో పుంఖానుపుంఖాలుగా ఒబిసి వ్యతిరేక వ్యాసాలను ప్రచురించాడు. ఉత్తర భారతదేశంలో ఉన్నత కుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఓబిసిలకు విరుచుకుపడ్డారు. 8 సంవత్సరాల వయస్సులో ఉన్న అమాయక విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు ప్రేరేపించబడ్డారంటే విషప్రచారం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. ఆ వయసులో వారికి మండల్ కమిషన్ అంటే ఏమిటో, అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్ అంటే అర్థం ఏమిటో కూడా తెలియకపోవచ్చు. దేశంలోని రెండు పెద్ద బ్రాహ్మణ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వి పి సింగ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. ఓబిసి రిజర్వేషన్లను న్యాయమైనవిగా గుర్తిస్తూనే క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని కమ్యూనిస్టులు తీర్మాణం చేయడం ఒబిసిల పట్ల వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ‘ఆరక్షణ్ లాగు కరో, వర్ణా కుర్సీ ఖాలీ కరో” వంటి నినాదంతో కాన్షీరాం నేతృత్వంలోని బిఎస్పి మండల్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం చేసిన పోరాటం ఓబిసిలా చరిత్రలో మరుపురాని ఘటన. కుల ఆధారిత రిజర్వేషన్ల అమలు కోసం మొదటి నుంచి ఉద్యమిస్తున్న సోషలిస్టులు కూడా మండల్ కమిషన్ నిర్ణయాలను అమలుపర్చాలని పోరాటం చేశారు. ‘పిచ్డే పావే సౌ మే సాట్’ నినాదంతో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. ఇదేసమయంలో మండల్ కు వ్యతిరేకంగా ‘కమండల్” నినాదంతో భాజపా ఓబిసిల హక్కులకు తూట్లు పొడిచే ప్రయత్నం చేసింది.

2006 లో అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థలలో, ప్రధాన ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి)రిజర్వేషనులు అమలు చేస్తామని తమ ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రకటించారు. 1990 లో మండల్ వ్యతిరేక ఆందోళనలో ముందున్న అర్జున్ సింగ్, ఆయన ప్రాతినిథ్యం వహించే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు అప్పటికే అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్నత కులాల నిరసనలు, ఆగ్రహ స్వభావాన్ని విశ్లేషించడం చాలా ముఖ్యం. ఈ రోజు దళితులు, వెనుకబడిన వారి నుండి వచ్చిన హక్కుల నినాదం ఒకరకంగా గుణాత్మకంగా ఉన్నప్పటికినీ, పరిపాలన ఇంకా ఉన్నత కులాల చేతుల్లోనే బలంగా ఉంది. రాహుల్ బజాజ్ వంటి పారిశ్రామికవేత్తలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు భారతదేశంలోని పెద్ద కంపెనీల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని నిస్సంకోచంగా వ్యాఖ్యానించడం ఆయనలోని ఉన్నత కుల దురహంకారానికి నిదర్శనం. భారతదేశంలో ఎక్కువ వ్యాపార సంస్థలు బనియాల చేతుల్లోనే ఎందుకున్నాయో బజాజ్ ప్రపంచానికి తెలియజేయాలి. భారతదేశ నలుమూలల మార్వాడీలు, బనియాలు ప్రధాన సంస్థలను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలోని కొన్ని వర్గాలకే స్కావెంజింగ్ పని ఎందుకు నిర్ణయించబడిందో, ఉత్పత్తి కులాలు ఆయా ఉత్పత్తులనే ఎందుకు చేయాలో కూడా రిజర్వేషన్ వ్యతిరేకులు తెలియజేయాలి. ఇతరులను విస్మరిస్తూ కొన్ని పనులపై కొందరికే ‘మేధో సంపత్తి హక్కు’ ఎందుకు?

రాజ్యాంగంలోని 16(4) ప్రకరణ ప్రకారం ఏదీ వెనుకబడిన తరగతి పౌరులకు అనుకూలంగా నియామకాలు లేదా పోస్టుల రిజర్వేషన్ కోసం రాష్ట్రం ఎటువంటి నిబంధనలు చేయకుండా నిరోధించదు. 1980 సంవత్సరం కుల, ఆర్థిక మరియు సామాజిక సూచికల ఆధారంగా భారత జనాభాలో 52% గుర్తించబడిన ఓబిసి (ఇతర వెనుకబడిన తరగతులు) కులాలున్నాయి. కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో 27% రిజర్వేషన్ల కింద ఉద్యోగాలను ఇతర వెనుకబడిన తరగతుల (ఓబిసి) సభ్యులకు ఇవ్వాలని సిఫారసు చేసింది. తద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు ఓబిసిలకు మొత్తం రిజర్వేషన్లు 49% గా ఉంటుంది. వాస్తవానికి దక్షిణ భారతదేశంలోని దళిత,వెనుకబడిన కులాల చైతన్యం ఉత్తరాధి నాయకులను మొదటి నుంచి కలవరపెడుతూనే ఉంది. అందుకే స్వాతంత్రానంతరం బిసి కులాల అధ్యయనానికి కంటి తుడుపు చర్యలు ప్రారంభమయ్యాయి. జనవరి 1953లో అప్పటి ప్రభుత్వం సామాజిక సంస్కర్త కాకా ఖలేల్కర్ అధ్యక్షతన మొదటి వెనుకబడిన తరగతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ తన నివేదికను మార్చి 1955 లో సమర్పించింది. ఈ నివేధిక 2,399 వెనుకబడిన కులాలు లేదా వర్గాల జాబితాను తయారు చేసింది. వారిలో 837 కులాలు ‘అత్యంత వెనుకబడినవారు’ గా వర్గీకరించబడ్డారు. దురదృష్టవశాత్తు ఈ నివేదిక సిఫార్సులు ఎప్పుడూ అమలు కాలేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మండల్ కమిషన్‌కు ముందే, కొన్ని రాష్ట్రాలు అప్పటికే ఆర్థికంగా వెనుకబడిన ఓబిసి వర్గాలకు రిజర్వేషన్లు కలిపించాయి. 1980 లో కర్ణాటక రాష్ట్రం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్సీ, ఎస్టీ మరియు ఓబిసిలతో సహా) 48% ని రిజర్వేషనులని అమలు చేయడమే కాకుండా ఇతర బలహీన వర్గాలకు సైతం మరో 18% రిజర్వేషన్లను కేటాయించడం విశేషం. తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ఓబిసిలు పెరియార్ నాయకత్వంలో ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించారు. శూద్రుల ఉత్పాదక సంస్కృతికి మూలస్థంభాలుగా హేతువాదం,నాస్తికత్వాలే ప్రధాన అజెండాగా పోరాడారు. వలసరాజ్య పాలనలోబ్రాహ్మణుల సామాజిక శక్తిని పక్కనపెట్టి, ఒబిసి రిజర్వేషన్లను అమలు చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు.

నిజానికి మండల్ కమిషన్ సిఫార్సుల అమలు భారతదేశంలో ‘రెండవ ప్రజాస్వామ్య పురోగతి’. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా 26 డిసెంబర్ 2015 న విడుదల చేసిన నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు చట్టబద్దమైన సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులలో కేవలం 12 శాతం మాత్రమే ఇతర వెనుకబడిన తరగతుల వారు ఉండగా, ప్రస్తుతం 21శాతం మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుండడం రిజర్వేషన్ల అమలులో పారదర్శక లోపానికి నిదర్శనం. సివిల్ పోస్టులను రిజర్వేషన్ల (కోటాలు) నుండి మినహాయించాలని 1971 లో సత్యనాథన్ కమిషన్ క్రిమిలేయర్ విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. 1993లో నియమింపబడిన జస్టిస్ రామ్ నందన్ కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థించింది. కేవలం ఆదాయ ప్రాతిపధికన ఓబిసి రిజర్వేషన్లను కుదించడం రాజ్యాంగ స్పూర్థికి విరుద్దం. మూలిగే నక్కపై తాటికాయ పడిన చంధంలా 2019 లో ఏర్పాటు చేయబడిన బీపీ శర్మ కమిటీ రిపోర్టు కూడ ఓబిసిలకు విరుద్ధంగా పరిణమించింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 12 లక్షలు దాటినట్లయితే ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా బీసీ విద్యార్థుల రిజర్వేషన్లను తొలగించే ఈ కమిటీ నివేదిక ఇప్పుడు ఓబిసిల పాలిట శాపంలా పరిణమించింది. నిజానికి ఓబిసి రిజర్వేషనుల అమలు మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగానే మారింది. రిజర్వేషన్ల కల్పనను సామాజికాంశంగా కాకుండా ఆర్థిక కోణంలో చూడడం విషాధం.

1991లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా నిరసనలను లెక్క చేయకుండా అగ్రకులాలలో “ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు” 10% రిజర్వేషన్ కోటాను ప్రవేశపెట్టింది. ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ల అమలును కొట్టివేసింది. రాజ్యాంగం సామాజిక మరియు విద్య పరమైన వెనకబాటు తనాన్నే గుర్తిస్తుంది కాని, ఆర్థిక వెనకబాటు తనాన్ని కాదని స్పష్టం చేసింది. అగ్రకులాలలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) 10% రిజర్వేషనులను కల్పిస్తూ రాజ్యాంగానికి 103వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇటీవలే ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలలో 829 పోస్టులకు గాను EWS అభ్యర్థులు పొందిన పోస్టులు 78. ఈ లెక్కన జనరల్ కోటాలో గల 304 పోస్టులతో కలిపి, మొత్తం 829 పోస్టులకు గాను 382 పోస్టులు జనరల్ అభ్యర్థులే పొందారన్న మాట! అంటే అక్షరాలా 46శాతం పొస్టులన్న మాట. ఇక్కడ జనరల్ కోటాలో రిజర్వేషన్ అభ్యర్థులెందరు అనేది అనవసరం. దీని ప్రకారం అసలైన రిజర్వేషన్ల అమలు జరుగుతున్నట్టా?. వాస్తవానికి ప్రస్తుత నివేదికల ప్రకారం ఓబిసి రిజర్వేషన్లను ఏనాడూ పూర్తిగా అమలు చేయలేదు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని ప్రకటించి ముప్పై ఏళ్ళు అయినా ఇప్పటికీ 21 శాతం మాత్రమే ఓబిసి రిజర్వేషన్లను కలిపించడం వెనకబడిన వారిని అత్యంత వెనకబాటుకు గురిచేయడమే.

చివరిసారిగా కుల ఆధారిత జనాభా గణన 89 సంవత్సరాల క్రితం, 1931లో బ్రిటిష్ వారు నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయడంతో యుపిఎ ప్రభుత్వం 2011లో సామాజిక-ఆర్థిక మరియు కుల గణన (ఎస్‌ఇసిసి) ను చేపట్టింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన SECC-2011 డేటాను రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా బహిరంగపరచలేదు. ప్రస్తుత భాజపా ప్రభుత్వం జన గణనలో ఓబిసి జనాభాను లెక్కించేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. అంత సవ్యంగా సాగితే 2021 జన గణనలో ఓబిసి జనాభా లెక్కలను చూడవచ్చు. సంక్షేమ రాజ్యంలో సంస్కరణలను అమలు చేయడానికి ప్రభుత్వం సంశయించకూడదు. సంస్కరణలు అంటే ఆధిపత్య వర్గ మిత్రులకు విలువైన జాతీయ ఆస్తులను ఇవ్వడం కాదు, అణగారిన వర్గాలకు ఆపన్న హస్తం అందిస్తూ అభివృద్ధి పథాన్ని చూపించడం. గడిచిన ముప్ఫై ఏళ్ళ కాలంలో వెనకబడిన తరగతుల రిజర్వేషనుల అమలు తీరు ఓబీసీలకు అన్యాయంగా పరిణమించింది. పరిస్థితి మారింతగా దిగజారక ముందే ఓబీసీలకు కేంద్ర స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఓబిసి రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి.

జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply