Take a fresh look at your lifestyle.

మూడత్వ ముప్పు

కాలాలు మారుతున్నా
మనిషి తీరు మారలేదు

ఆధునిక ప్రపంచంలో ఉన్నా
అనాగరిక గుర్తులు చెదరలేదు

అంతరిక్షంలోకి అడుగిడినా
మౌఢ్య ధోరణులు కడతెరలేదు

విశ్వరహస్యాలు చేదిస్తున్నా
అంధవిశ్వాసాలు తొలగలేదు

శాస్త్ర పరిజ్ఞానం వికసించినా
సంకుచిత చిత్తం చిత్తుకాలేదు

ఇపుడు దయ్యం భూతం
పిశాచి ప్రేతాత్మల భయాలు
మనిషిని వెంటాడుతున్నయ్‌

‌దొంగ స్వాములు డేరాబాబాల
ఆజ్ఞలు సమాజాన్ని శాస్తిన్నాయ్‌

అం‌దుకే మంత్రాల నెపంతో..
చిత్రహింసలు,క్రూరహత్యలు
నరబలులు సజీవ దహనాలు
ఇష్టా రాజ్యాంగా సాగుతున్నయ్‌

- Advertisement -

ఈ ‌వికృత జాడ్యం విస్తరిస్తే…
మనిషి అస్తిత్వం ప్రశ్నార్థకమే
ప్రపంచం అంధకార బందురమే

ఇప్పటికైనా…
అజ్ఞాన చీకట్లను చిదిమి
విజ్ఞాన ప్రమిద వెలిగిద్దాం

అంధవిశ్వాసాలు చెరిపి
శాస్త్రీయతను స్వాగతిద్దాం

క్షుద్రశక్తుల భ్రమలు విడిచి
హేతుబద్ధ దృష్టితో వీక్షిద్దాం

మంత్రగాళ్ల ఆటలు కట్టించి
వైద్య దేవుళ్లను ఆరాదిద్దాం

అవివేక అంతరాలు తొలచి
సమైక్య జీవన యానం చేద్ధాం

(మంత్రాల నెపంతో ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య ఘటన ఖండిస్తూ…)
– కోడిగూటి తిరుపతి,9573929493

Leave a Reply