అన్ని కోర్టుల పరిధిల్లో..: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ
నల్లగొండ,సెప్టెంబర్ 7: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయా కోర్టుల పరిధు లలో సెప్టెంబర్ నెలలోని 11 వ తేది రెండవ శనివారం నాడు జరిగే మూడవ జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.వి.రమేష్ మరియు కార్యదర్శి జి.వేణు పత్రిక విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో న్యాయమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని కోర్టుల ప్రాంగణములలో జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహించబడతాయని, ఈ లోక్ అదాలత్ లలో రాజీ యోగ్యమైన సివిల్, క్రిమినల్, భూ పరిహార మరియు భూ వివాద, బ్యాంకు రికవరి కేసులు, చెక్ బౌన్స్ మరియు ఇతర సివిల్ కేసులు సామరస్య పూరితముగా పరిష్కరింపబడుతాయని, రాజీ పడతగు కేసులలో ముందస్తుగా కౌన్సిలింగ్ నిర్వహించుటకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసినట్లు తెలుపుతూ, ఇట్టి అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని సమన్యాయం, సత్వర న్యాయాన్ని మరియు అప్పీలు లేను తీర్పును పొంది తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాల్సిందిగా కోరారు. ఇట్టి రాజీ చేసుకొన్న కేసులలో కోర్టు ఫీజు కూడా తిరిగి పొందగలరని తెలుపుతూ ఇప్పటికే దాదాపు ఒక వేయి ఐదువందల కేసుల పైగా రాజీపడదగిన కేసులను గుర్తించినట్లు, నోటీసులుకూడా అందచేస్తున్నట్లు తెలిపారు.