Take a fresh look at your lifestyle.

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున వ్యవసాయరంగంలాంటి పలురంగాలను ప్రజలకు దూరంచేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అందుకు వొచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దించాలన్న దృఢ సంకల్పంతో బిజెపి యేతర ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ఏకం కావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలియందికాదు. అయితే దీన్ని థర్డ్ ‌ఫ్రంట్‌ అని, ప్రత్యమ్నాయని కొందరు వ్యాఖ్యానిస్తుండగా గుణాత్మక మార్పును తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా కెసిఆర్‌ ‌లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదియేమైనా బిజెపిని గద్దె దించాలన్న విషయంలో జరుగుతున్న ప్రయత్నాలను పరిశీలిస్తే పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడుతున్నదన్నది మాత్రం స్పష్టమవుతున్నది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు , రాష్ట్రాలను కేంద్రం ఎలా గుప్పిటిలో ఉంచుకోవాలను కుంటున్నది, రాష్ట్రాలకు న్యాయంగా అందించాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం కొన్ని రాష్ట్రాలపట్ల ఎలా సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నది, మెజార్టీ లేకపోయినా రాజకీయపు ఎత్తుగడలతో రాష్ట్రాలను బిజెపి ఎలా కైవసం చేసుకుంటున్నది, దేశంలో విస్తారంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్న కేంద్ర విధానాలపైన దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల మధ్య సుదీర్ఘ చర్చ జరుగుతున్నది. ప్రతిపక్ష పార్టీల్లో ఈ ఆలోచనను రేకెత్తించడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇతర నాయకులతో పోలిస్తే ఒక అడుగు ముందున్నాడనే చెప్పవొచ్చు. గత రెండేళ్ళుగా ఆయన బిజెపికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూ వొస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, ‌బీహార్‌, ‌కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అధికార, అనధికార రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే వీరంతా బిజెపి వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ పార్టీతో అమీతుమీ తేల్చుకునేట్లుగా బయటపడకుండా గుంబనంగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లి మెడలో గంట ఎవరు కడుతారన్నట్లు, వొచ్చే ఎన్నికలనాటికి ఏర్పడనున్న ఈ బిజెపియేతర కూటమికి ఎవరు సారధ్యం వహించాలన్న విషయాన్నే ఆ పార్టీలు ఇంకా తేల్చుకోలేక పోతున్నాయి.

ఈ విషయంలో కెసిఆర్‌, ‌మమతాబెనర్టీ, నితీష్‌కుమార్‌ ‌పేర్లు మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ నాయకులు మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. బిజెపికి వ్యతిరేకకూటమి సంఘటితపర్చుకునే తరుణంలో కూటమి నాయకత్వంపై చర్చించుకుంటూ కూర్చుంటే పుణ్యకాలంకాస్తా దాటిపోతుందన్న ఉద్దేశ్యంగా నాయకత్వ అంశాన్ని పక్కకు పెట్టి, ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదిక మీదకు తీసుకురావాలని ఇప్పుడా పార్టీలు నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తున్నది. తాజాగా నేషలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్సీపి)నేత శరద్‌ ‌పవార్‌, ‌బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‌ను కలిసినప్పుడు వారిద్దరుకూడా ఇదే అభిప్రాయానికి వొచ్చినట్లు తెలుస్తున్నది. వారి చర్చల సారాంశాన్ని నితీష్‌కుమార్‌ ‌మీడియాకు వివరిస్తూ ఇప్పుడు తమ కృషి అంతా బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నిటినీ సంఘటిత పర్చడమేనన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వొస్తే అప్పుడు ఏర్పడేది థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు, అది మెయిన్‌ ‌ఫ్రంటే అవుతుందని ఆయన చెప్పడాన్ని బట్టి ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున్నే సంఘటితం కాబోతున్నట్లు స్పష్టమవుతున్నది. తానిప్పటివరకు కలిసిన నేతలంతా కూటమిలో చేరేందుకు చాలావరకు ఆసక్తిని కనబర్చినట్లుకూడా ఆయన చెప్పుకొచ్చారు. బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎన్డీయే కూటమి నుంచి ఇటీవల బయటికి వొచ్చిన వొచ్చిన విషయం తెలిసిందే.

అలా రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, తనను కలిసిన నాయకులు కూడా అందుకు తనను అభినందించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో అలాంటి వాతావరణమే ఏర్పడనుందా అన్న అభిప్రాయం ఏర్పడుతున్నది. దిల్లీలో ఆయన ఇటీవల మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ సందర్బంగా ఆయన కాంగ్రెస్‌ ‌ముఖ్యనాయకుడు రాహుల్‌గాంధీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత అరవింద కేజ్రీవాల్‌, ‌సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఐఎన్‌ఎల్‌డి అధినేత ఓపి చౌతాలా, సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ ‌యాదవ్‌తోపాటు ఆయన కుమారుడు, ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అభిలేష్‌ ‌యాదవ్‌లేకాక మరికొందరు ఇతర పార్టీల నేతలను ఆయన కలుసుకుని కూటమిపై చర్చించారు. అయితే గతంలో బిజెపి, కాంగ్రెస్‌యేతర కూటమిని ఏర్పాటు చేస్తామని కెసిఆర్‌ అన్నట్లు కాకుండా, మమతా బెనర్జీ మొదట్లో అభిప్రాయపడ్డట్లు కాంగ్రెస్‌ను దూరం పెట్టడం సరైందికాదన్న అభిప్రాయం నితీష్‌కుమార్‌కు కూడా ఉన్నట్లు ఆయన రాహుల్‌గాంధీతో సమావేశమవడం చెప్పకనే చెబుతున్నది. అలాగే 2024 లోకసభ ఎన్నికలకోసం ఏర్పడే ఈ కూటమి సారధ్యానికి కూడా ఆయనే సిద్దపడుతున్నట్లు కనిపిస్తున్నది. ఎన్నికలకు ఇంకా ఏడాదికాలం సమయం ఉండడంతో ఈలోగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Leave a Reply