Take a fresh look at your lifestyle.

తిల్లానా బతుకంబాళ్‌

‘‘ఆం‌ధ్రాలో పుట్టి, ఆంధ్రాలో పెరిగి, ఆంధ్రాలో చదువుకుని, ఉద్యోగరీత్యా నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమైన నాకే ఈ బతుకమ్మ పాట ఇంత వెగటుగా ఉంటే, ఈ మట్టిలోనే పుట్టి, ఈ మట్టి పరిమళాలు అణువణువునా నింపుకున్న తెలంగాణ ప్రజలకు మరి కాలిందంటే కాలదాండీ? బాధగా ఉండదాండీ’’?”

నాకు ఇంట్లో చేసిన ఉప్మా అంటే ఇష్టం. ముఖ్యంగా పెళ్లివారింట్లో బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌కోసం చేసిన టిఫిన్లు అయిపోతే అప్పటికప్పుడు గబగబా చేసి పడేస్తారు చూడండి, ఆ ఉప్మా అంటే మరీ మరీ ఇష్టం. మాములుగా చేసే ఉప్మా కన్నా ఆ యమర్జెంటు ఉప్మాకి ఆ స్పెషల్‌ ‌టేస్టు ఎలా వస్తుందో నాకు ఎప్పటికీ అర్ధం కాని విషయం. సరే, అదలా ఉంచుదాం. అయిదేళ్ల కిందట నేను ఖతర్‌ ఎయిర్‌ ‌వేస్‌ ‌వారి అంతర్జాతీయ విమానంలో అమెరికా వెళ్లేను. బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌మెనూ చూసేసరికి అందులో ఉప్మా అని రాసి ఉంది. ‘‘వార్నీ..ఇంటర్నేషనల్‌ ‌ఫ్లయిట్స్‌లో స్కాచ్‌ ‌విస్కీ ఇస్తారని తెలుసు గాని ఉప్మా కూడా పెడతారా?’’ అని బోలెడు ఆశ్చర్యపడిపోయాను. ఖతర్‌ ఎయిర్‌ ‌వేస్‌ అనే విదేశీ ముస్లిం సామ్రాజ్యంలో మన ఉప్మాకి చోటు దొరికినందుకు మహా ముచ్చటపడిపోయాను.

విమానవతి అత్యంత వినయంగా తెచ్చి ఇచ్చిన ప్లేటు మూత ఆకలిగా తీసి చూసేను. జనరల్‌గా ఉప్మా అని తలుచుకోగానే మన కళ్లముందు ఒక విజువల్‌ ‌కనిపిస్తుంది. అయితే ఆ విజువల్‌తో మిల్లీమీటర్‌ ‌కూడా ఏకీభవించని పదార్ధమేదో ఆ ప్లేటులో సాక్షాత్కరించి నా ఆకలిని కర్కశంగా హత్య చేసింది. అయితే ఆత్మారాముడి గోల భరించలేక ఆ గరిటజారు పదార్ధాన్ని నాలుగైదు స్పూన్లు కడుపులోకి సరఫరా చేసి, బ్రేక్‌ ‌ఫాస్ట్ అయిందనిపించాను. ‘‘ఈ పదార్ధానికి ఉప్మా అనే పేరు బదులు ఇంకేదైనా నోరు తిరగని పేరు పెట్టండి మహాప్రభో’’ అని ఖతర్‌ ఎయిర్‌ ‌వేస్‌ ‌వారికి మెయిల్‌ ‌పెట్టాలని తీర్మానించుకున్నాను. ఇంటికి వెళ్లగానే మన ఇంటి ఉప్మా చేయించుకుని తినడమే నా ప్రధమ కర్తవ్యంగా సంకల్పం చెప్పుకున్నాను. అప్పుడెప్పుడో బాలకృష్ణ పాడిన ‘శివ శంకరీ..’ పాట విన్న తర్వాత తక్షణమే మళ్లీ ఘంటసాల వారి ‘శివ శంకరీ..’ వినేసి నా కర్ణ పుటాల్ని కడుక్కున్నాను చూడండి, అలాగన్నమాట.

ఇంతకీ ఈ ఖతర్‌ ఎయిర్‌ ‌వేస్‌ ఉప్మా గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకొచ్చానంటే…
నిన్న నేను.. తెలంగాణ ఆడపడుచు కవితక్క సమర్పణలో, ‘‘అల్లిపూల వెన్నెల’’ అనే అచ్చమైన తెలుగు పేరుతో, ఏఆర్‌ ‌రెహమాన్‌, ‌గౌతమ్‌ ‌మేనన్‌ ‌వంటి నాన్‌ ‌తెలంగాణ దిగ్గజాల సారథ్యంలో తయారైన వీడియో పాటని తిలకించడం జరిగింది. ఆ దెబ్బకి నాకు ఐదేళ్ల కిందటి ‘ఖతర్‌ ఉప్మా..’ గుర్తొచ్చింది. ఆ ఉప్మాలో తెలుగువారి నేటివిటీ టచ్‌ ఏ ‌కోశానా లేనట్టే ఈ బతుకమ్మ పాటలో, ఆటలో కేరళ కొబ్బరి వేసిన అరవ సాంబారు ఘుమఘుమలే తప్ప తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల సొగసు మచ్చుకైనా లేవేనని చిరాకేసింది. పాటలో కర్ణాటక సంగీత పోకడలు, ఆటలో శాస్త్రీయ నృత్య రీతులు కలగాపులగంగా కలిపేసిన ఈ వీడియో వంటకానికి ‘‘అల్లిపూల వెన్నెల’’ అనే అచ్చ తెలుగు పేరు బదులు ‘‘తిల్లానా బతుకంబాళ్‌’’ అనే పేరు సూటవుతుందని గట్టిగా అనిపించింది.

ఆంధ్రాలో పుట్టి, ఆంధ్రాలో పెరిగి, ఆంధ్రాలో చదువుకుని, ఉద్యోగరీత్యా నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమైన నాకే ఈ బతుకమ్మ పాట ఇంత వెగటుగా ఉంటే, ఈ మట్టిలోనే పుట్టి, ఈ మట్టి పరిమళాలు అణువణువునా నింపుకున్న తెలంగాణ ప్రజలకు మరి కాలిందంటే కాలదాండీ? బాధగా ఉండదాండీ? ఈ వీడియో పాట కోసం కొన్ని లక్షలో, కోట్లో ఖర్చయిందట. అంత ఖర్చుతో నాన్‌ ‌తెలంగాణ వారితో చేయించే బదులు ఈ ప్రాజెక్టుని మన ‘‘బుల్లెటు బండి’’ టీముకి అప్పగించి ఉంటే ఇంతకన్నా తక్కువ ఖర్చుతో, ఇంతకన్నా అద్భుతంగా బతుకమ్మ పాట అల్లిపూల వెన్నెల వెలుగులు విరజిమ్మి ఉండేదని మనసారా నమ్ముతున్నాను.

– మంగు రాజగోపాల్‌, ‌ముఖ పుస్తకం గోడ నుంచి.. వారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ… దేవులపల్లి అజయ్‌

Leave a Reply