- ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
- జనసేన, టీడీపీ నాయకులు నీచరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం
రాష్ట్రంలో మూడు యూనివర్సిటీలను ఉన్నత స్థాయిలో నిలపాలని ప్రభుత్వం సంకల్పించిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శనివారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ.. కరోనా సమయంలో సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నాయకులు నీచరాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామంటే కొన్ని పార్టీలు ఆందోళన చేయడం సరికాదని చెప్పారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించామని తెలిపారు. పదోతరగతి పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది ఆలోచించి చెబుతామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో పాటు చదువు కూడా ముఖ్యమేనని ప్రభుత్వం భావించిందని చెప్పారు. గత ప్రభుత్వం సాంకేతిక విద్య విషయంలో వైఫల్యం చెందిందన్నారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో దేశం అంతా కన్పిస్తున్నాయి కానీ తెలుగుదేశం వారికి కనిపించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, హిందూపురం ఎంపీ గోరంట్లమాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఏ.సాంబశివారెడ్డి, ఎస్కేయూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య ఎం.రామకృష్ణారెడ్డి, ఎస్కేయూ రిజిష్ట్రార్ కృష్ణకుమారి, రెక్టార్ కృష్ణానాయక్, తదితరులు పాల్గొన్నారు.