Take a fresh look at your lifestyle.

ఈ రోజులు కార్పొరేట్లకు సువర్ణధ్యాయం

“దేశాభివృద్ధిలో తమ పాలన సువర్ణధ్యాయం అని చెప్తూ, రాబోయే 18వ లోక్‌ ‌సభా కాలంలో కూడా కీలక నిర్ణయాలు కొనసాగుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేలా రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలు ఎవరి జీవితాలకు సువర్ణధ్యాయం కానున్నాయి? ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న 8 గంటల పని కాలాన్ని 14 గంటలకు పెంచుతూ, 100 మంది కార్మికులు గల పరిశ్రమల మూసివేయాలంటే అనుమతి తప్పనిసరిగా ఉన్న నిబంధనను సవరించిన కార్మిక చట్టాలు ఏ వర్గాన్ని బంగారుమయం చేయనున్నాయి.”

దేశంలో అమలవుతున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలు గతానికి భిన్నమైనవి కాకున్నా ఆ విధానాలను చట్టబద్దం చేయడం, వాటి అమలులో తెగింపు, రాజ్యాంగ విలువలను సమాధి చేయడంలోనే తేడా కనిపిస్తున్నది. జాతి వనరులను దేశవిదేశ బహుళజాతి సంస్థలకు మేలు చేస్తున్న కార్యాచరణ ప్రజలకు ప్రయోజనకారిగా నమ్మించడానికి పాలకులు నిత్యం అవాస్తవాలు చెబుతున్నారు. ప్రస్తుత పాలన దేశాభివృద్ధిలో సువర్ణధ్యాయమని తామే కితాబునిచ్చు కోవడమే కాక, ప్రస్తుత ప్రజాస్వామ్యం యవ్వనదశలో ఉందని ప్రధాని ప్రకటించడం అందులో భాగమే. నిజానికి దోపిడీలో, అవినీతిలో, అణచివేతలో దేశంలో కొనసాగుతున్న సువర్ణధ్యాయం లేదా యవ్వన దశ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న అసత్య ప్రచారాలు తప్ప ఇంకేం కాదు.

దేశంలో 73 ఏళ్ళ ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా, ధనస్వామ్యంగా, మతోన్మాదుల కవచంగా మార్చిన విధానాలను కప్పిపుచ్చేందుకు, ప్రజాస్వామ్య ముసుగు ధరిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వేరువేరు భాగాలలో ఒక భాగంగా ఉండవలసిన ప్రభుత్వం సర్వోన్నతంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రజలను దూరంగా నెట్టి అభివృద్ధి నిరోధకులుగా భావిస్తున్నది. ప్రజాసంక్షేమానికి ఖర్చు చేస్తూ, వనరులను న్యాయ, సమానత్వ సూత్రాల ప్రాతిపదికగా సమజాభివృద్ధికి ఉపయోగించవలసిన కర్తవ్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నందువల్ల ప్రజాస్వామ్య నిర్వచనం హాస్యాస్పదమైంది. పెట్టుబడిదారుల కనుసన్నల్లో ప్రభుత్వాలు పనిచేయడం, పెట్టుబడిదారులు నిర్ణయించిన రాజకీయ పార్టీలు, నేతలే పాలకులుగా ఎన్నికవుతుండడం సాధారణమై ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్రమించిన నిరసన హక్కును వినియోగించుకొనే ప్రజల మీద దాడులు జరుపుతూ మహిళలు, రైతులు, వృద్ధులు, పెన్షనర్లు, వికలాంగులు, పిల్లలు, రైతులు, ఉపాధ్యాయులు తేడాల్లేకుండా అందరిపై నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళాలు, వాటర్‌ ‌క్యానన్‌లు ప్రయోగించేంత సమానత్వాన్ని సాధించింది. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీని దిగ్బంధించి తమ తెగువను ప్రదర్శిస్తున్న ఉత్తర భారత రైతులపై సాగిస్తున్న దౌర్జన్యం దీనికి తాజా నిదర్శనం. అంతకంటే సొంత భూభాగంలోని సాటి పౌరుల మీదే సర్జికల్‌ ‌స్ట్రైక్‌ ‌చేసేంత వరకు ఆలోచన చేయడం, అది ఎన్నికల వాగ్దానంగా కూడా ప్రకటించడం ప్రజాస్వామ్య వికాసంగా ప్రధాని భావిస్తుండవచ్చు.

ప్రజాస్వామ్యానికి పునాదులైన కార్యనిర్వాహక, న్యాయ విభాగాలను పూర్తిగా ఆక్రమించి, శాసన వ్యవస్థ ఏకచ్ఛ•త్రాధిపత్యం వహించడం వాస్తవం. న్యాయస్థానాల్లో తీర్పులను సైతం ప్రభావితం చేసి, పదవీ విరమణ అనంతరం తమకు అనుకూలంగా పని చేసిన న్యాయమూర్తులకు రాజకీయ, ప్రభుత్వ పదవులు కట్టబెట్టడం న్యాయ వ్యవస్థ నిర్వీర్యానికి నిదర్శనం. అలాగే విచారణ, దర్యాప్తు సంస్థలను పూర్తిగా జేబు సంస్థలుగా మార్చి, రాజకీయ శత్రువుల పైకి ఎక్కుపెట్టే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన ఎన్నికల కమిషన్‌ ‌పనితీరులో జోక్యం చేసుకొని, ఎన్నికల షెడ్యూల్‌లను, నిబంధనలను వారికి అనుకూలంగా పనిచేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల పక్రియను అత్యంత ఖరీదైన స్థాయికి తీసుకెళ్లి, అధికార దుర్వినియోగం, విచ్చలవిడి రాజకీయ అవినీతికి పాల్పడుతూ కార్యనిర్వాహక వ్యవస్థననూ అవినీతి మయం చేశారు. దేశ సమాఖ్య లక్షణాలను ఒక్కొక్కటిగా దెబ్బతీస్తూ, కేంద్రీకృత పాలన వైపు వేగంగా పరుగెడుతున్నారు. వీటన్నింటికి సజీవ సాక్ష్యాలుగా ఎన్నో సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

దేశాభివృద్ధిలో తమ పాలన సువర్ణధ్యాయం అని చెప్తూ, రాబోయే 18వ లోక్‌ ‌సభా కాలంలో కూడా కీలక నిర్ణయాలు కొనసాగుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేలా రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలు ఎవరి జీవితాలకు సువర్ణధ్యాయం కానున్నాయి? ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న 8 గంటల పని కాలాన్ని 14 గంటలకు పెంచుతూ, 100 మంది కార్మికులు గల పరిశ్రమల మూసివేయాలంటే అనుమతి తప్పనిసరిగా ఉన్న నిబంధనను సవరించిన కార్మిక చట్టాలు ఏ వర్గాన్ని బంగారుమయం చేయనున్నాయి. బ్రిటిష్‌ ‌కాలం నాటి మెకాలే గుమస్తా విద్యా విధానానికి నఖలు ప్రతిలాగా, ప్రస్తుత మార్కెట్‌ అవసరాలకు సరిపడే మానవ వనరులను సృష్టించడం, డిజిటలైజసన్‌ ‌లక్ష్యాలుగా, ప్రైవేటు విదేశీ విద్యా సంస్థలకు అనుమతిస్తూ రూపొందించిన జాతీయ విద్యా విధానం ఏ సమాజాన్ని సువర్ణధ్యాయంగా మారుస్తుందో. దొంగ చేతికే తాళాలు ఇచ్చేలా పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు చేయదలిచిన సవరణల ద్వారా ఎవరి దోపిడీకి ఆటంకాలను తొలగించి దేశ వనరులను దోచిపెట్టనున్నారో తెలుస్తుంది.

కరువులు, వరదలు వంటి ప్రకృతి వైఫరీత్యాలు, వ్యాపారుల దోపిడీల వల్ల అప్పుల పాలైన రైతులకు కనీస మద్ధతు ధర కూడా కల్పించకుండా కోటాను కోట్లకు అధినేతలైన పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మొండి బకాయిల రద్దు పేరుతో లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ప్యాకేజీలుగా అందించి కార్పొరేట్లకు సువర్ణధ్యాయం లిఖిస్తూ, కడు పేదలకు కన్నీటి ధారలను మిగుల్చుతుంది. ప్రజాస్వామ్య యవ్వన దశ అంటే రాత్రికి రాత్రే చట్టాలు చేయడమా? లౌకిక విలువలను వదిలి మత విద్వేషాలు చిమ్మడమా? ఎన్నికల సంఘం, న్యాయ, విచారణ, దర్యాప్తు సంస్థల వంటి రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యమా? లక్షల కోట్లు ఖర్చు చేసి వోట్లు కొనుగోలు చేయడమా? ప్రలోభాలతో ఫిరాయింపులను ప్రోత్సహించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయడమా? ఆలోచనాపరులను అంతమొందించడమా? బాధితులనే నేరస్తులుగా మార్చి శిక్షించడమా ? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు ప్రజాస్వామిక వాదుల ప్రశ్నలన్నింటికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. బీమా, రైల్వే, ప్రజా రవాణా వంటి ఎన్నో ప్రజా రంగాలను పూర్తిగా ప్రైవేటీకరించి కార్పొరేట్‌ ‌రెక్కలు తొడిగి సామాన్యులకు అందనంత ఎత్తులో నిలబెడుతున్నారు. పిడికెడు మంది కార్పొరేట్‌ ‌శక్తులకు, ప్రభుత్వ పెద్దలకే సువర్ణధ్యాయం తప్ప ప్రజలకు ఎంతమాత్రం కాదు.
– స్ఫూర్తి

Leave a Reply