- ప్రధాని మోదీ స్పష్టీకరణ
- స్పష్టత కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్
- అన్‌లాక్ 2ను ఎలా అమలు చేయాలో సూచించండి
- కొరోనా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో లాక్డౌన్ల దశ ముగిసి అన్‌లాక్‌ల దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్‌లాక్ 1 నడుస్తోందనీ, అన్‌లాక్ 2ను ఎలా అమలు చేయాలనే విషయంపై ఆయా రాష్ట్రాల సీఎంలు ఆలోచించాలని సూచించారు. ఈనెల 30తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఆ తరువాత కొరోనా వైరస్ నియంత్రణకు అమలు చేయాల్సిన ప్రణాళికపై బుధవారం కొరోనా ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోందనీ, దీనిపై స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని దేశంలో లాక్డౌన్ల దశ ముగిసిందనీ, ప్రస్తుతం అన్‌లాక్‌ల దశ ప్రారంభమైందని స్పష్టం చేశారు. దేశంలో కొరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన ప్రణాళికను రూపొందిచాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల సీఎంలదేనని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రులు ప్రజలకు వైద్య సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతీ కొరోనా బాధితునికి మెరుగైన వైద్యం అందించాలనీ, అప్పుడే దేశంలో వైరస్ ప్రభావిత మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలో కొరోనా ప్రభావం ప్రారంభమైన మూడు నెలల క్రితం పీపీఈ కిట్లు, డయాగ్నస్టిక్ కిట్ల కొరత ఉండేదనీ, ఇప్పుడు ఆ దశను దాటి పోయామన్నారు.
కేంద్రం రాష్ట్రాలకు కోటి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను రాష్ట్రాలకు పంపించామని చెప్పారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు పాటించిన క్రమశిక్షణ కారణంగా వైరస్‌ను చాలా వరకు నిరోధించగలిగామనీ, అయితే, రాష్ట్రాలు కొరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలోని రాష్ట్రాలన్నీ ఆరోగ్యం, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. టెస్టుల సంఖ్య పెంచిన పక్షంలో వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తించి ఐసోలేషన్‌కు తరలించి త్వరగా వైద్యం అందించడానికి వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 కొరోనా పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయనీ, లక్షల సంఖ్యలో ప్రత్యేక పడకలు, ఆక్సీజన్ సదుపాయంతో వేల సంఖ్యలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయనీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొరోనాపై పోరులో భాగంగా ప్రజలలో భయాలను తొలగించేందుకు సహాయం చేయాలనీ, కొరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడకుండా ఉండటం, భౌతిక దూరం నిబంధన పాటించడంతో కొరోనా మహమ్మారిని చాలా వరకు నియంత్రించవచ్చనీ, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.